Wednesday, March 25, 2026
E-PAPER
HomeNewsబడ్జెట్ కాదు అంకెల గారడి

బడ్జెట్ కాదు అంకెల గారడి

- Advertisement -

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానాలను రేకెత్తిస్తోందని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ విమర్శించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ బడ్జెట్ అంకెలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది వాస్తవాలకు దూరంగా ఉన్న అవాస్తవ బడ్జెట్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో సరైన నిధుల కేటాయింపులు లేవని, కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని అన్నారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల అమలుపై స్పష్టత లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వీటి గురించి సరైన ప్రకటన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు ఏళ్లలోనే భారీగా అప్పులు చేసిందని, ఇది రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షనర్లు, సింగరేణి కార్మికులు, మహిళలు, సంక్షేమ రంగాలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు.

రాష్ట్ర పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో హామీలు ప్రజలకు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆనాడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. 420 హామీలు ఇచ్చి కేవలం నామమాత్రంగా కూడా ఒకటి రెండు అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ రాష్ట్ర పరువును బజారుకుడిస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని దివాలా తీసింది అని పేర్కొంటూ జాతీయస్థాయిలో రాష్ట్ర పరువు తీస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి తీరు కారణంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, రైతులకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలుచోవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రికి పరిపాలన తెలియడం లేదని, ఆయన ప్రజలకు రైతులకు యువతకు విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. గతంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తోంది కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పులు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలను విద్యారంగాన్ని తీవ్రంగా విస్మరించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -