శిధిలావస్థలో లెదర్ పార్కు
దళితుల జీవనోపాధిపై పాలకుల నిర్లక్యం
ఎంపీ కావ్య చొరవతోనైనా కార్మికుల కష్టాలు తీరేనా..
స్టేషన్ ఘనపూర్ లెదర్ పార్కు దుస్థితిపై
పార్లమెంటులో చర్చించాలని కార్మికుల విజ్ఞప్తి
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చర్మకారులు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నిర్మించిన లెదర్ పార్కు భవనం ఉపయోగంలో లేక శిధిలావస్థకు చేరుకుంది. లెదర్ పార్కు ఇండిస్టీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (లిడ్ క్యాప్) అధ్వర్యంలో 2003లో అప్పటి మంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేయగా, 2004లో దాన్ని పూర్తిచేసి యంత్రాలను సైతం అమర్చారు. తర్వాత ప్రభుత్వం మారడంతో లెదర్‌పార్కు మూలకు పడింది. విభజన అనంతరం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దానికి నిధులు కేటాయించి 2018 చివరి కల్లా 20వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా మూతబడిన లెదర్ పార్కును తెరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. మెగా లెదర్ పార్కు కాదు గదా.. మినీ లెదర్ పార్కు కూడా గతిలేదంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎంపీ కావ్య అయినా చొరవ తీసుకొని లెదర్ పార్క్‌ను ప్రారంభించాలని కోరుతున్నారు.
దళితులకు జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మినీ లెదర్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. స్టేషన్ ఘనపూర్ శివారులో 25 ఎకరాల్లో నిర్మించారు. రూ. 10లక్షలు వెచ్చించి కుట్టుమిషన్లు, ఇతర యంత్రాలను ఏర్పాటు చేశారు. దీనికోసం నియోజకవర్గ కేంద్రంతో పాటు చిల్పూర్, జఫర్‌ఘడ్ మండలాల్లో చర్మ వృత్తుల పట్ల నైపుణ్యత కలిగిన 33మందిని ఎంపిక చేశారు. వారు మాస్టర్ ట్రైనర్లుగా చెన్నై, హైదరాబాద్‌లో 40రోజుల పాటు శిక్షణ పొంది, నియోజకవర్గంలో మిగతా 300 కార్మికులకు వస్తువుల తయారీ శిక్షణ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. మూతబడిన లెదర్ పార్కు తెరిపిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించి నా.. ఆమాటలు ఉత్తమాటలే అయ్యాయి. వాస్తవానికి లెదర్ ఉత్పత్తులకు భారీగానే డిమాండ్ ఉన్నది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. స్థానికంగా వీటి ఉత్పత్తికి తగిన చర్యలు లేవు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానిక ఉత్పత్తిదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ కావ్య.. కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి లెదర్ పార్కు నిర్వహణకు కావలసినంత స్థలం ఉందని, ఏండ్లుగా ఎదురుచూస్తున్న చర్మకారులకు ఉపాధి కల్పించాలని కోరారు.
ఎంపీ కావ్య చొరవతోనైనా కార్మికుల కష్టాలు తీరేనా ?
లెదర్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని ఎంపీ కావ్య చెబుతున్నారు. తమ సమస్యలు పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీని కార్మికులు కోరుతున్నారు. ఏండ్ల తర్వాత పడావుపడిన స్టేషన్ ఘనపూర్ లెదర్ పార్కు పునరుద్ధరణకు పార్లమెంటులో తన స్వరం వినిపించి, సమస్య పరిష్కారానికి ప్రశ్నిస్తే.. ఏండ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల కష్టాలు తీరుతాయని ఈప్రాంత దళిత, నిరుద్యోగ యువత కోరుతున్నారు.
నియోజక వర్గ ప్రజలకు ఉపాధి కల్పించాలి
మినీ లెదర్ పార్కు ద్వారా వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న పాలకులు, దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఇప్పటికైనా తక్షణమే స్టేషన్ ఘనపూర్‌లో మినీ లెదర్ పార్కు ప్రారంభించి చర్మకారులను, దళిత నిరుద్యోగ యువతను ఆదుకోవాలి.
-రాపర్తి రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, జనగాం
ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం…
నియోజక వర్గంలో ఎలాంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేకపోవడంతో ఈప్రాంత యువత, చర్మకారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం. లీడ్ కాప్ సంస్థలో శిక్షణ పొందినవారు సైతం ఆశ వదులుకుని కూలీ చేసుకుని జీవిస్తున్నాం. లెదర్ పార్కు ప్రారంభిస్తే ఉపాధి దొరుకుతుంది. పాలకులు మారినా మా బతుకులు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దయతలచి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాం.
– గాదె కుమారస్వామి, చర్మకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాస్టర్ ట్రైనర్, స్టేషన్ ఘనపూర్
ఏండ్లుగా ఎదురు చూపులే…
లెదర్ పార్కు ఏర్పాటు కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ పరిశ్రమలో పనిచేసేందుకు శిక్షణ కూడా తీసుకున్నాం. కానీ నేటికీ పార్కులు పునరుద్ధరించలేదు. ప్రస్తుతం చెప్పులు రిపేరు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.
– ఈశ్వరయ్య, చర్మకారుడు, స్టేషన్‌ఘనపూర్
నిర్మించారు..వదిలేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES