Sunday, May 25, 2025
Homeకథఎద్దేడిసింది!?

ఎద్దేడిసింది!?

- Advertisement -


నరసయ్య మామ చేలోనే మందుతాగిండంట!
”అయ్యో పాపం! ఎటువంటి మనిషి! చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ పలకరించే మంచి మనిషి! ఎప్పుడు నవ్వుతా ఉండే నిండైన మనిషి! అంతలోనే ఏమైంది? అంత పానం మీదకు ఏమోచ్చింది?” విషయం ఊర్లో గుప్పుమంది.
ఊరు ఊరంతా చెరువుకొమ్మునున్న నర్సయ్యమామ జువ్వికొయ్య చేనుకు అంతా పరుగోపరుగు! ఊరికి అరకోసు దూరంలో నర్సయ్య మామ జువ్వికొయ్య చేను. జువ్వికొయ్య నీడ అక్కడ కలిసి వ్యవసాయం చేసే రైతుల మాటమంతికి, పిచ్చాపాటికి వేదిక! ప్రక్కనే బోరు బావి కనుక ఎంచక్కా బోజనాలు చేయడానికి అదే నీడనిచ్చే చెట్టు! ఎండాకాలం కూడా ఏసీలా చల్లని గాలినిస్తుంది! కూలీలు గట్రా పనికొచ్చినా ఆ జువ్విచెట్టునీడనే బువ్వతింటారు. ఇప్పుడు ఆ జువ్విచెట్టు కిందే నరసయ్య మామ గడ్డిమందు తాగి పాణాలు ఇడిసిండు. పొద్దునలేత్తే ఆ పొలంలోనే నరసయ్య మామ చిరునామా! ఉదయమే కాసిని టీ తాగి తనకిష్టమైన రామలక్ష్మణుల ఎడ్ల జతను తోలుకొని పొలం ఎళ్ళిండు. పొలం పక్కనే అరెకరం బోళ్ళబీడు. అందులోనే ఎడ్లు మేస్తున్నాయి. మూడురోజుల సంది మనస్సులో ఒకటే రంది? ‘ఈ అప్పెట్టా తీరుద్దీ? ఎవడికేం సమాధానం చెప్పాలే? అప్పుగట్టక పోతే ఇజ్జత్‌ పోతది? ఎవరినెలా సముదాయించాలా? రోజెట్టా తెల్లారుద్దీ?’ నర్సయ్య మామ మనోవేదన. నాలుగైదు రోజులుగా పంట గురించి, అప్పుల గురించే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాడు.
నరసయ్య మామ మనసెరిగి ”ఎట్టయితే గట్టయితతి? ఎందుకు ఊరక రంది పడతవు! అవసరం అయితే ఓ ఎకరం అమ్మితీరుద్దాం!” సముదాయించేది రాజమ్మత్త!
జీవితంలో డక్కాముక్కీలు తిన్న రాజమ్మత్తకు కాస్తా గుండె ధైర్యం ఎక్కువే! కాస్తా మొండి మనిషికూడా! ఉదయం వెళ్ళిన నరసయ్య మామ ఇంటికొచ్చి ఆదరాబాదరా కాస్తా బువ్వ తిని బరిగొడ్లు తోలుకొని మళ్ళీ పొలం పోవాలి. ఎందుకో ప్రతిరోజులా ఈరోజు ఇంటికి రాలేదు? ఏ పనిమీద ఉన్నడో ఏమో! ఇంటికి రాకపోయోసరికి రాజమ్మత్తకు కాస్తా అనుమానం కూడా వచ్చింది. ఎందుకో మనసు కీడు శంకిస్తా ఉన్నది. కాస్త సద్దన్నం టిపెన్లో వేసుకొని మజ్జిగపోసుకొని సరాసరి పొలం కాడికి వెళ్ళింది. ఎదురుగా ఉన్న దశ్యం చూసి రాజమ్మత్త కళ్ళు గిర్రున తిరిగి పోతున్నాయి. పాదాల కింద దుమ్ము ఆగడం లేదు? పాదాలు వణుకుతున్నాయి. నిస్సత్తువ ఆవరించింది.. రోజూ అన్నంతిని, కబుర్లాడే జువ్విచెట్టు కింద నరసయ్య మామ శవమై అస్తవ్యస్తంగా కట్టెలా పడి ఉన్నాడు. పక్కనే గడ్డిమందు డబ్బా! చనిపోయి రెండు గంటలు పైగానే అయ్యి ఉంటుంది? నోటిగుంట కారిన బురుజు సారికలా చెంపపై ఎండి కనిపిస్తుంది. ఆకాశంకేసి ఆబగా చూస్తున్నట్లు తేలేసిన కనుగుడ్లు! శవం వెల్లకిలా పడి ఉంది. ఈగలు ఇప్పుడిప్పుడే తల దగ్గర ముసురుకుంటున్నాయి. చూసి చూడగానే నిరో గుండె పడిన రాజమ్మత్త తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. షాకు నుండి తేరుకొని నరసయ్యమామ శవం పక్కన కుప్పకూలిన రాజమ్మత్త నెత్తి కొట్టుకొని ఏడుస్తోంది. అప్పటికే ఓ ఇరవైమంది ఊరి జనం అక్కడ జమయ్యారు.
”ఏమంత కష్టమొచ్చింది? ఇట్టా చేసుకున్నాడు?” ఎవరికి తోచినమాటలు వారు మాట్లాడుతున్నారు. నరసయ్య మామ నుదుటి మీదకొచ్చిన వెంట్రుకలు అరచెయ్యితో సర్దిన రాజమ్మత్త తన పైటచెంగుతో శవంపై గుమిగూడుతున్న ఈగలను అదిలిస్తూ! శోకాలు తీస్తుంది.
”ఎంతపని చేసినవురా! దేవుడా!? మమ్మల నట్టేట ముంచినవేందిరా! దేవుడా? నాకన్న చావురాలే? నువ్వెలా ఈపని చేశావు దేవుడా! అప్పులు పాడుగాను ఎకరం అమ్మితే తీరేవి! ఎంత పనిచేశావు నా దేవుడా! ఆ పురుగుమందుల కోట్టోడి చేతికి జెట్ట పుట్టా! నా మొగుడ్ని నిలువునా మింగావురా భగవంతుడా! గొడ్డుమోతు విత్తనాల్నిచ్చి నామోగుడు పాణం తీశాడురా! దేవుడోరు!! వాడి కళ్ళలో పుండ్లుపడా? వాడి వ్యాపారం నాశనం గాను! చెట్టంత మనిషి పాణాలు తీసుకున్నాడు నాయనా!” శోకాలు తీస్తూ ఏడుస్తొంది రాజమ్మత్త.
ఉక్రోషంగా ఆపసోపాలు పడుతూనే ఎక్కెక్కి ఏడుస్తోంది! శవం ముందు సాగిలాపడి ”నీవు పండించిన గింజే, అంబలితాగు! ఒక్కసారి నాకోసం మాట్లాడు! నాకోసం కళ్ళు తెరువు!” అంటూ ఏడుస్తా ఉంటే అక్కడ గుమిగూడిన అందరికీ కండ్లవెంట నీరు ఉబికి వస్తున్నాయి.
”అసలేమైంది? నరసయ్య మామ ఇలా ఎందుకు చేసుకున్నాడు? ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది? ఏం సంఘటన జరిగింది?”
నరసయ్య మామ ఆరెకరాల మద్య తరగతి రైతు. చెరువు మొగదల ఐదెకరాల మెట్ట. అందులోనే అర ఎకరం బోళ్ళబీడు. చెరువుకింద ఎకరం మాగాణి. రెండెడ్లు, రెండు పాడి గేదెలు! ఎద్దు వ్యవసాయం తప్ప నరసయ్య మామకు మరో దేసలేదు. వ్యవసాయం తప్ప వేరే ప్రపంచమే తెలియదు. పొద్దుతో మొదలై పొద్దు భూ తల్లి కడుపులోకి జారిపోవడంతో పూర్తవుతుంది పొలం పని. నరసయ్య మామది గొడ్డుచాకిరీ. అయితే! ఇంటిని, పాడిని సరిదిద్ది, గేదెల పాలూ, నెయ్యీ అమ్మి, కోళ్ళు పెంచి ఇంటిని గుట్టుగా దిద్దుకొచ్చేది రాజమ్మత్త! అడిగిన అందరికీ చిక్కని మజ్జిగ పోసి దప్పిక తీర్చేది. నర్సయ్య మామ మూడేళ్ళ కితం బిడ్డ పెళ్ళికి రెండెకరాల భూమి పాపయ్య పటేలుకు అమ్మిండు. అయినా పాపయ్య పటేలుతో మాట్లాడి, ఎంతో కొంత కౌలు తెంచుకొని నరసయ్య మామే ఆ భూమి కౌలు సేద్యం చేస్తుండు.
కాలం కలిసిరాలే? రెండేళ్ళ సంది వ్యవసాయం దెబ్బతీసింది. పోయినేడు ఎకరంన్నరలో పత్తి వేసిండు. విత్తనాల మోసంతో నిలువెత్తు ఎదిగిన ఎకరంన్నర పత్తి పూత, కాయ లేకనే ఈటుపోయింది. ఈ ఏడు పంట బాగుంటే అతి వర్షాలకు తడిసి పత్తి ఆగం అయ్యింది. పెట్టిన పెట్టుబడి ఎల్లలే? పోయినేడు మిర్చీ ఏత్తే పంట బాగానే పండింది. రేటులేదు. కోల్డుస్టోరేజీలో పెడితే అప్పులకు వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయో? తెగనమ్మక తప్పదాయో!
మిర్చిపంట నిజంగా ఓ జూదం లాంటిది? పండించిన రైతు ధర నిర్ణయించలేడు. ధర ఎవరో నిర్ణయిస్తారు! ఎలా నిర్ణయిస్తారో, ఎక్కడ నిర్ణయిస్తారో పండించిన రైతుకు తెలియదు. మార్కెట్‌ కెళితే అడ్డీకి సవాశేరు అడుగుతారు? ధరలో ఎచ్చుతగ్గులు విపరీతంగా ఉంటాయి? ధర పలక లేదని కోల్డుస్టోరేజీలో పెడితే… అప్పిచ్చినోడు రందికి తట్టుకోలేక, తెగనమ్మకొస్తే! పెట్టిన పెట్టుబడి రాకపాయో! వచ్చిన సొమ్ములు వడ్డీలకే సరిపాయో! అసలు అప్పు అలాగే మిగిలిపాయో! ఈ ఏడాది, పోయినేడాది చేసిన అప్పులను తీర్చాలని ఆశతో రెండెకరాల మిర్చి ఏత్తే, పంటైతే రొమ్ము లోతు ఎదిగింది! పూత, పిందే లేదు? వెర్రి పూత, వేప కాయంత మరుగుజ్జు మిరపకాయ! పురుగుమందుల కొట్టోడు నకిలీ విత్తనాలు అంటగట్టి పచ్చిమోసం చేసిండు.
ఏడాదికాలం ఎద్దులా పనిచేసిన నరసయ్య చాకిరీ, రెండెకరాలకు పెట్టిన రెండు లచ్చల పెట్టుబడి, కలుపుకూలి, కోతకూలి అంతా తడిసి మోపెడైంది? మోత్తం కల్తీ విత్తనం ఖాతాలో ఆగమైంది. పూర్వకాలంలో నైతే రైతులే నాణ్యమైన కాయల నుండి విత్తనాలు తీసుకొని, నారు పోసి, మిరపతోట నాటుకునే వారు.
పాతికేళ్ళుగా వ్యవసాయం తీరూతెన్నూ మారిపోయింది. అందరూ కంపెనీ విత్తనాలే వాడతారు. బయటకొనాలసిందే! వందగ్రాముల విత్తనాలకు వేలరూపాయల రేటు పెట్టాలసిందే! రైతు బతుకు విత్తనంతోనే పరాదీనం అయిపాయో! పెట్టుబడి ఇక అప్పుల ఊబేనాయే! వ్యాపారాలు అన్నీ కుడిఎడమల దగా, దగా! మోసం! వెయ్యి రూపాయల కక్కుర్తి కోసం రైతును దగా చేసి, కల్తీ విత్తనాలు అంటగడితే! ఆరుగాలం రైతుబడ్డ కష్టం, పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరేనాయే. ఒకవేళ మంచి విత్తనం దొరికి, కాలం సాయంగుండి, కష్టం ఫలించి పండినా పంటకు తగ్గ రేటుండదు?
ఈ మిర్చిపంట రేటు మరీ మోసం, పచ్చి దగా. ఒకరకంగా ఇదో ధరల జూదం! అన్నింటా రైతే రందిపడాల! ఈ నకిలీ విత్తనాల గురించి అడిగితే?… ”మేమేమైనా విత్తనాలు తయారు చేశామా? మాకేమైనా కంపెనీలు ఉన్నాయా? కంపెనీ ఇచ్చింది, మేమిచ్చాం”! అని వ్యాపారులు తప్పించుకుంటున్నారు. పైగా అప్పు, పెట్టుబడులు అన్నీ వ్యాపారులేనాయే! ఈ యవసాయశాఖ లుంటాయి చూశారు… అవి ఎప్పుడూ నిద్దరబోతునే ఉంటాయి. వాటికి మెలకువ వచ్చేలోగా రైతు కొంప నిలువునా మునుగుతుంది? నరసయ్య మామ లాంటి బతుకులు బుగ్గి అవుతానే ఉంటాయి.
ఒకరకంగా నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళు ఉంటారు చూశారు… నిజంగా నరకం అనేది ఉంటే, వాళ్ళను రంపాలతో సజీవంగా బరబరా ముక్కలుగా కొయ్యాలి! సలసల కాగే నూనెలో వాళ్ళను ముక్కలుగా కోసి వేయించినా పాపంపోదు! ఎందుకంటే వాళ్ళే నర హంతకులు. ఇలా ఆలోచిస్తుండగానే! ఇంతలో హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఏ కాకితో కబురందిందో ఏమో… మోటారు సైకిల్‌పై అక్కడ వాలిపోయారు. ఆడిని, ఈడిని కాసేపు యక్ష ప్రశ్నలు అడిగారు. పంచనామా రిపోర్ట్‌ రాసుకున్నారు. పాపయ్య పటేల్‌ ఏమి మతలబు చేసిండో ఏమో! పురుగో భూషో కరిసిందని, అందుకే నరసయ్య మామ చనిపోయాడని రాసుకొని, రావాల్సిన కట్నాలు తీసుకొని వాళ్ళు చెక్కేశారు. ఇట్లాంటివి మేనేజ్‌ చెయ్యడంలో పాపయ్య పటేల్‌ దిట్ట! ఇప్పుడు ఆయనకు పటేల్‌గిరి లేదు. ఒకప్పుడు ఉండేదట! అయినా ఆయన్ను పటేలా అనే ఊరు జనం పిలుస్తారు. కష్టాల్లో ఉన్నోడిని కనిపెట్టి ఊరి జనాలకు అప్పూసొప్పూ, మంచీచెడూ అంతా ఆయనే.
తెల్లబట్ట లోడు ఊరికి ఎవరొచ్చినా ముందు ఆయనింట అడుగెట్టాలసిందే? అది ఆయనకు ముందు నుంచి అబ్బిన కళ! ఇప్పుడు యాబైఎకరాల ఆసామి ఆయన! ఆయనే మోతుబరి రైతు. ఊరిలో ఇల్లు, పట్నంలో సంసారం. పగలిక్కడా, రాత్రి అక్కడ. ఊరిసారం అబ్బిన మనిషి అక్కడా, ఇక్కడా ఆయనదే పెద్దరికం! పోస్టుమార్టం లేకుండా మేనేజ్‌ చేశాడు. నరసయ్య మామ శవాన్ని ఆయన ట్రాక్టర్‌లోనే పొలం నుండి ఇంటికి తరలించారు.

ఊరు సిరిపురం.పేరులోనే తప్ప ఇప్పుడా వూరిలో సిరి లేదు. అంతకళా లేదు. ఓ యాబై గడపల చిన్న ఊరు. అన్నీ రైతు కుటుంబాలే. ఒకప్పుడు పాడిపంటలతో పచ్చగా అలరారిన పల్లె. కాలం తెచ్చిన మార్పులు ఊరిని గాయపర్చాయి. పిల్లల చదువుకోసమని పట్నం చేరిన పది, పదిహేను కుటుంబాల ఇళ్ళకు దశాబ్ద కాలంగా తాళం కప్పలు వేళాడుతున్నాయి. ఆ ఇండ్లలో కసువూడ్చి కల్లాపు చల్లే ప్రాప్తం లేదు. ఇండ్లు ఈటు పోయినట్లు కనిపిస్తాయి. చదువుకున్న పిల్లలంతా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌ తదితర దూరదేశలలో స్థిరపడ్డారు. అక్కడ వాళ్ళు అక్కడే పెళ్లీ పేరంటాలు. ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయని ఇక్కడ పెద్దలంతా పట్నంలోనే కాపురాలు. ఇక మరోకొన్ని ఇళ్ళలో కాటికి కాలుచాపిన వద్ధులే కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ‘ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటోంది’ సామెతకు దగ్గరగా ఉంది పల్లె! ఊరు మీద మమకారం ఉన్న నరసయ్య మామ లాంటి సన్న, చిన్న కారు రైతులే జీవశ్చవాలై, కొద్దిమంది ఊర్లో కాలం గడుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఊరు పడావు పడుతుంది. పాడుబడుతుంది. పచ్చని పల్లెలు ఇలా వల్లకాడుగా మారాలసిందేనా? ఎద్దు, వ్యవసాయం లేకపోతే సమాజం మనుగడ ఎలా? బువ్వ ఎక్కడ నుండి వస్తుంది? అనే సంశయం పెరుగుతుంది. ఊరి ముంగటి వీధిలోనే నరసయ్య మామ చెక్కుచెదరని పురాతన పెంకుటిల్లు, సున్నంతో కట్టిందే. ఆనాటి గట్టితనమే వేరులే. పెచ్చు కూడా ఊడలేదు. పక్కనే పసువుల పాక, ఆ పక్కనే పెంటకుప్ప. ఊరి వాసన ఏమైనా మిగిలివుంది అంటే ఇలాంటి కష్టం ఆధారంగా జీవనంచేసే కొద్దిమంది రైతు కుటుంబాలు ఊరిలో ఉండబట్టే! ఇంటి ముంగిట వరండాలో నరసయ్య మామ శవం పండబెట్టాం. తలదగ్గర మూకుడులో నూనె పోసి, ఒత్తి పేని నూనెలో వేసి అంటించి దీపం వెలిగించాం.
వేలువిడిచిన మేనమామ కదా, నాకు తప్పదుమరి! నిట్టూర్పు విడిచాడు కష్ణయ్య. నర్సయ్యకు మేనల్లుడు కష్ణయ్య. కనుక తప్పదు ఈ సమయంలో నాకు రిస్క్‌! రాజమ్మత్తలో ఏడవడానికి కళ్ళలో నీళ్ళు కూడా ఇంకిపోయినట్లున్నాయి. నీరసంగా శవం ముందు జాగారం చేస్తుంది. వచ్చిపోయేవాళ్ళు మందలిస్తూంటే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాలు అన్నీ సోకాలుగా చేసి ఏడుస్తానే ఉంది. అంతలోనే నరసయ్య మామ కూతురు లక్మీబాయమ్మ అక్కడకు చేరుకుంది. అల్లుడుది పక్క ఊరే! ఇద్దరూ వచ్చేశారు. తల్లి పక్కన చేరి పిల్ల గుండెలు బాదుకొని, గుండెలు అవిసి పోయోలా తండ్రిని గుర్తుచేసుకుంటా ఏడుస్తోంది…”ఇట్టెట్టా చేసుకున్నావు నాతండ్రో! నేనున్నా నీకు తోడుండక పోతిని అయ్యా. ఇలా జరిగేది కాదు నాయనా! నాబాధలిక ఎవరికి చెప్పుకోను నాయనో? మమ్మిడిసి ఎలాపోయావు తండ్రీ!” శోకాలు తీస్తుంది లక్మీబాయమ్మ.
లక్మీబాయమ్మ నరసయ్య మామకు ఇష్టమైన ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుండి పొలం పనిలో తోడూనీడగా ఉండేది. మూడేళ్ళ క్రితం పెళ్ళి చేశాడు. పదో పన్నెండో చదివాడు. పదెకరాల పొలం ఉందని నమ్మబలికితే పక్క ఊరి సంబంధం… పిల్ల కళ్ల ముంగిట ఉంటుందని పొరుగూరికే పిల్లనిచ్చి, పెళ్ళి చేశాడు. రెండెకరాల భూమి పాపయ్య పటేల్‌కు అమ్మి పెళ్ళి ఘనంగానే చేశాడు. తీరా పిల్ల కాపురం వెళ్ళిన తర్వాత తెలిసింది… ఆడుత్త పోరంబోకని, పండుబోతోడని! పైగా తాగుబోతని. ఎకరం కూడా సొంతంగా సేద్యం చేయడు. పొలం కౌలుకిచ్చి ఊర్లో పోకిరిగా తిరుగుతాడు. వాడు లేచీలేవగానే పచ్చగుడ్డ కట్టిన బడ్డీకొట్టుకెళ్ళి క్వార్టర్‌తోనే ముఖం కడుగుతాడు. పచ్చగుడ్డ కట్టిన కొట్టిప్పుడు మందుషాపుకి సంకేతం అట! ఇప్పుడు ఊరుకు పది, పన్నెండు బెల్టుషాపులు వెలిశాయిలే. కిరాణంకొట్టు, కిళ్ళీ దుకాణం ఇప్పుడు అన్నీ మందుషాపులే! ఇప్పుడు ఇవే ప్రభుత్వాలను పోషించే రాజపోషకాలట! ఏంచేస్తాం? ఓటేసి తెచ్చుకున్న గవర్నమెంట్‌ కదా? నరసయ్య మామ అల్లుడు వీరతాగుబోతు! ఉదయం నుంచి రాత్రి దాకా అతనికి అదేపని! పైసలు పుట్టకపోతే చెంబూతెపాల కుదవబెట్టయినా నిషా గుర్రం ఎక్కాలసిందే! రోగాలు, రొష్టులు, ఆస్పత్రులు ఆపైన బోనస్‌.
లక్మిబాయమ్మ రెండుమూడు సార్లు మొగుడి ఆగడాలు తట్టుకోలేక అలిగి పుట్టింటికి వచ్చింది. పాపయ్య పటేలు దగ్గర పంచాయతీ పెట్టి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వాడి తీరుమారలే! పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గాని పోదంటారు కదా! లచ్చింబాయమ్మ మొగుడిది అదే కేటగిరీ. ఏంచేస్తాడు, తన కిష్టమైన కూతురు తండ్రికి, తల్లికి కొండంత అండగా ఉండేది. పెళ్ళి చేసి పాడుచేసుకున్నానే. అయినా మంచి సంబంధం కాదు. నరసయ్య మామకు అదో మనేది! మనేదికు మందేముంటుంది?
నరసయ్య మామ దహనానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. బొళ్ళబీట్లోనే అంతిమ క్రియలు. బంధువులందరూ చేరుకున్నారు. ఎందుకు మరి ఆలస్యం. పట్నం నుండి తలకొరివి పెట్టే కొడుకు రావాలట! అతనిదే ఆలస్యం. చనిపోగానే కబురందింది. బయలు దేరాడు. మార్గం మధ్యలో ఉన్నాడు. ఆయన చేరుకునే సమయం అంచనా వేసుకునే ఇక్కడ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మరీ ఆలస్యం అయితే చీకటి పడుతుంది. నరసయ్య మామకు చెట్టంత కొడుకున్నాడు! పేరు వెంకటేశ్వర్లు. వెంకటీ అని ఇంట్లో పిలుస్తారు. స్నేహితులు వెంకట్‌, మరింత సన్నిహితులు ఎంకీ! ఇలా ఒకే పేరుకు అర్థం ఒకటైనా నానా ముద్దు పేర్లు. వెంకీ ఉన్నాడనేకానీ ఏనాడూ నరసయ్య తాతకు చిన్నమెత్తు పనిచేసేవాడు కాదు! ఒకరకంగా ఇరిగిన వేలుమీద ఒంటేలు పోయమన్నా పోసే రకం కాదు వీడు? నరసయ్య మామ, రాజమ్మత్త గారాబం వాడినలా తయారు చేసింది. ఊళ్ళో ఉంటే పక్క మీద లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా నలుగురు పోకిరీలను పోగేసుకొని సినిమాలు, సికార్లు, ఇంట్లో ఉన్న కాసేపు సెల్లే వాడి ప్రపంచం. అదే ఇప్పుడు అరచేత ప్రపంచం! పదిసార్లు పిలిస్తే కాని పలకడు, ఉలకడు. వాడో ఊరి ఉలిపికట్టె! పట్నం సోకులు అలవాటు పడ్డాడు. ఎలాగో బతిమాలో బామాలో ఇంజనీరింగ్‌ వరకు చదివించారు. అందరిలా బయటకు పోవాలనే ఆలోచన, డాలర్లు సంపాదించాలనే ఆలోచన వెంకీకి లేదు. పంపించే స్తోమత ఇప్పుడు నరసయ్య మామకు లేదు. పట్నంలో కంప్యూటర్‌ కోచింగ్‌ అని సతాయించి నెలకు, రెండు నెలలకు ఒకసారి వచ్చి పదేలు అడగడం… అప్పొసప్పో చేసి నరసయ్య మామ సర్దుబాటు చేయడం, పెరుగు, నెయ్యి చిల్లరగా అమ్మగా వచ్చిన సొమ్ములు మూటగట్టి రాజమ్మత్త గుట్టుచప్పుడు కాకుండా వెంకీ జేబుల్లోకి చేర్చడం. ఇలా రెండేళ్లుగా తిరుగుడే తప్ప వెంకీకి ఉద్యోగం, సద్యోగం ఏమీలేదు.
పెళ్ళీడు వచ్చింది? పిల్ల నియ్యాలంటే పిలగాడు ఏ దేశంలో ఉద్యోగం చేస్తుండు? కనీసం ఓ ఇరవై ఎకరాల పొలం ఉందా? బ్యాంకు బ్యాలెన్స్‌ ఎంత ఉంది? ఇప్పుడిదే ట్రెండ్‌ నడుస్తోంది. చాలామంది ఎంకీ తోటి వాళ్ళకు ఇదే కారణంతో పెళ్ళి పీటలు ఎక్కడం లేదు? ఊళ్ళలో ఇదే తరహాలో పెళ్లిగాని ప్రసాద్‌ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఒకరకంగా ఇదో అనర్థ కాలమే! వెంకీ పెళ్ళి ప్రయత్నాలు అలాగే బెడిసి కొట్టాయి. ఉద్యోగం వచ్చాకే పెళ్ళి మాట ఎత్తమని తల్లితండ్రికి పోయినసారే వార్నింగ్‌ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా అనుకోని కాలం సుడిగుండంలా కమ్మేస్తుందని తెలియదు. ఇప్పుడు ఎంకీనే కుటుంబానికి పెద్దదిక్కు. ఎలా నడుపుతాడో ఏమో! ఎద్దు, వ్యవసాయం గురించి ఓనమాలు తెలవవు. మరోవైపు నరసయ్య మామ చేసిన అప్పులు తీర్చాలి. ఇల్లు చక్కదిద్దాలి. సంసారం ఈదడమంటే మామూలు విషయమేమీ కాదు. అందుకే సంసారం సాగరం అన్నారు పెద్దలు. ఇప్పుడీ సంసారసాగరం ఎలా ఈదుతాడో ఏమో!? ఈ గండాలు, సుడిగుండాలు ఎలా దాటుతాడో ఏమో? బరువు, బాధ్యతలు ఎరుగని ఎంకీబావ ఇలా ఆలోచనలు అలలు అలలుగా ముంచేస్తూ, మనస్సు పొరల్ని తొలిచేస్తుండగానే! వెంకీ స్నేహితుడు మోటారు సైకిల్‌ మీద నుండి ఒక్క ఉదుటున దిగి తండ్రిశవం దగ్గరకు పరుగెత్తుకెళ్ళాడు! తండ్రి శవం ముందు మోకరిల్లి పసిపిల్లోడిలా రోధిస్తున్నాడు. కొడుకును చూసిన తల్లి, అక్కా మరింత అంతర్మదనానికి లోనై మరింత శోకాలు తీసి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి మరీ ఏడుస్తున్నారు. ఇక అంతిమ సంస్కారం ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.
వెంకీ మనస్సు నిండా తండ్రి జ్ఞాపకాలే! డబ్బుల కోసం తండ్రితో పడిన ఘర్షణలు, వేదింపులు, ఏడుపులు, అలకలు, బుజ్జగింపులు లుంగలుగా చుట్టుకొని దుఃఖంగా మారి గొంతులో నుంచి పొంగి పొర్లు కొస్తున్నాయి. అయినా తమాయించుకొని దుఃఖాన్ని బలవంతంగా ఆపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం సహకరించడం లేదు? ఇన్నాళ్లు తనని పచ్చని మొక్కలా కష్టం తెలియకుండా సాకిన తన తండ్రి రూపం… తనే తలకొరివి పెట్టాలి?
వెంకీ రేపటినుండి ఇక కనిపించని తన తండ్రి రూపం తలచుకొని లోలోపల కుమిలి పోతున్నాడు. బందు మిత్రుల సముదాయింపుతో దహన సంస్కారం సాంప్రదాయిక ప్రక్రియలోకి చేరిపోయాడు.

”మానవత్వం సోయి తప్పిన సమాజం. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కాలం! కలికాలం అంటే ఇదేనేమో!? కుడిఎడమలదగా దగా మోసం!! డబ్బుతోనే ముడిపడిన బందాలు, అనుబందాలు, వ్యాపార సంబంధాలు. పచ్చని పంటలతో తెగుతున్న బంధం. మట్టి నుండి ఎట్టిలోకి, మళ్ళీ మట్టిలోకే జారిపోతున్న మనిషి! పచ్చగా కళకళలాడాల్సిన పల్లెల్లో స్మశాన వైరాగ్యం కమ్ముకుంటుంది ఇప్పుడు. రైతు ఇంట చావు డప్పులు మోగుతున్నాయి.
బంధుమిత్రులతో నరసయ్య మామ అంతిమ యాత్ర మొదలైంది. నరసయ్య కిష్టమైన జువ్వికొయ్య చేను బోళ్ళబీడులోనే చితి పేర్చారు. ఊరు ఊరంతా నరసయ్య మామ అంతిమ యాత్రలో నడుస్తుంది. గేదె చనిపోయిన తర్వాత పాడి కుండ బయట పడినట్లు నర్సయ్య మామ జ్ఞాపకాలు… అయ్యో! మంచి వాడికే ఎంత పని జరిగింది? మంచి వాళ్ళనే దేవుడు తీసుకెళతాడు… ఇలా నరసయ్య మామ మంచితనం గురించే ఊరివాళ్ళ అందరి ముచ్చట్లు. వెంకీ మాత్రం లోలోపల చాలా గిల్టీగా ఫీలవుతున్నాడు. నాన్న కోసం తనేం చేశాడు? చేస్తున్న చివరి పని, మొదటి పని ఇదేనేమో? కొడుకుగా తలకొరివి పెట్టడం? వెంకిలో అంతర్మధనం!
నరసయ్య మామను పాడెపై తీసుకురావడం, చితిపై పడుకోబెట్టడం, నిప్పుపెట్టడం దూరం నుంచి గమనించిన ఎద్దులు… రామలక్ష్మణులు! నెమరేయడం మానేసి, స్థానువుల్లా చూస్తూ నిలబడిపోయాయి! ఎన్నాళ్ళదో తమ అనుబంధం? రోజువారీ బంధం. మూగజీవాలతో కల్మషం లేని రైతు బంధం! పెనవేసుకున్న కాలానుబంధం!! ఎగుస్తున్న చితి మంటల్లో కాలిపోతుంది. దూరంగా నిలబడి నరసయ్య మామ అంతిమ యాత్ర తంతుచూస్తున్న ఎడ్లకు ఏమర్థమైందో ఏమో? మూగజీవాల కండ్లలో నుంచి కన్నీళ్ళు ధారలా కారుతున్నాయి.
నిజంగా మనుష్యుల పట్ల, ఈ పసువులకున్న కతజ్ఞత, ఆర్థ్రత ఈ మానవ సమాజానికి మాత్రం లేదుకదా? పశు సమాజం అనడానికి కూడా అనర్హమైన ఈ సమాజం నిజంగా ఇంత నికష్టంగా తయారైంది ఎందుకు? ఈ రైతు ఆత్మహత్యలు రైతుకు సహాయ పడలేని దగా సమాజం చేసిన హత్యలే కదా? మట్టిలో నుంచి బుక్కెడు, బువ్వ పుట్టించే రైతు అర్థాంతరంగా మట్టిలో కలుస్తున్నాడు కదా! ఈ బలవన్మరణాలు ఇంకెన్నాళ్ళు? ఇంకెన్నేళ్ళు రైతు కన్నీళ్ళు!?
రైతు గురించి, మనం తినే గింజ గురించి, ఈ పరాన్నభుక్కు సమాజానికి ఎప్పుడు అర్థం అవుతుందో ఏమోకదా!?
కష్ణయ్య ఆలోచనలు సుడి తిరుగుతున్నాయి. అందరూ చూస్తుండగానే నరసయ్య మామ భౌతిక కాయం చితి కట్టెలో కట్టెగా కాలి బూడిద అయ్యింది. మట్టి మనిషి మట్టిలోనే మట్టిగా మారి పోతున్నాడు! జువ్వికొయ్య మీద తీతువు పిట్ట అదే పనిగా విరామం లేకుండా కూస్తానే ఉంది.

ఎన్‌.తిర్మల్‌ 9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -