డిప్యూటీ మేయర్ గా అస్రఫ్ అలీ మొహమ్మద్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా బుర్రి చైతన్య రెడ్డి, డిప్యూటీ మేయర్ గా అస్రఫ్ అలీ మొహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నికలను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. బుర్రి చైతన్య రెడ్డి ని మేయర్ గా కార్పొరేటర్ పేర్ని స్వాతి ప్రతిపాదించగా 40 డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ చంద్రబోస్ బలపరిచారు.
డిప్యూటీ మేయర్ గా అస్రఫ్ అలీ మొహమ్మద్ ను మోహన్ ప్రతిపాదించగా నవీన్ గౌడ్ బలపరిచారు. మేయర్ డిప్యూటీ మేయర్ కు కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏ లాంటి పోటీ లేదని మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.




