ఖమ్మం డిపో మేనేజర్ శివ ప్రసాద్ కు వినతి
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే గోవిందాపురం(ఎల్)గ్రామానికి ప్రజల రవాణా సౌకర్యార్థం బస్ సౌకర్యం కల్పించాలని ఖమ్మం బస్ డిపో మేనేజర్ శివప్రసాద్ ను గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం గురువారం ఖమ్మం లో కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా కంటే ముందు ఖమ్మం డిపో నుంచి ప్రొద్దుటూరు, గోవిందాపురం ఎల్ మీదుగా బోనకల్ వెళ్లేదని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కరోనా అనంతరం బస్సు సౌకర్యాన్ని నిలిపివేశారన్నారు. అయితే ఖమ్మం నుంచి ప్రొద్దుటూరు వరకే బస్సు వస్తుందని, అక్కడ నుంచి తిరిగి వెళ్తుందన్నారు. అదేవిధంగా ఖమ్మం నుంచి బోనకల్లు మీదుగా గార్లపాడు వరకు ఆర్టీసీ బస్సు వస్తుందన్నారు.
ప్రొద్దుటూరు, గార్లపాడు గ్రామాల మధ్య గోవిందాపురం ఎల్ లక్ష్మీపురం గ్రామాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ రెండు గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రధానంగా చిరు వ్యాపారులు, బోనకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్లే విద్యార్థులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయనకు వివరించారు. దీంతో డిపో మేనేజర్ శివప్రసాద్ సానుకూలంగా స్పందించారు. అవసరమైన మేరకు త్వరలోనే చర్యలు తీసుకోమంటామని హామీ ఇచ్చినట్లు లక్ష్మీపురం సొసైటీ మాజీ అధ్యక్షులు మాదినేని వీరభద్ర రావు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో ఆ గ్రామ సీపీఐ(ఎం) నాయకులు తమ్మారపు లక్ష్మణ్ రావు, నల్లమోతు నాగేశ్వరరావు, వల్లంకొండ సురేష్, గోళ్ళ వెంకటేష్ తదితరులు ఉన్నారు.



