బిజినెస్‌ బాబా

Business Baba”భక్తిని పెట్టుబడిచేసి, బాబా వ్యాపారం చేస్తాడు. మాటల మాయలు చూపి, వేల కోట్లు గడిస్తాడు” ఈ వాక్యాలు చాలు మన దేశంలో బాబాల అసలు రూపాలను వివరించడానికి. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో ఈ బాబాల ఆవిర్భావాలు విపరీతంగా పెరిగాయి. అందులో రాందేవ్‌ బాబా ఒకరు. ఇంకా ఆశారాంబాబా, డేరాబాబా.. ఇలా ఎంతమందినైనా పేర్కొనవచ్చు. కానీ రాందేవ్‌ బాబా మరీ జిమ్నాస్టిక్‌ యోగా గురువు నుండి కార్పొరేట్‌ వ్యాపార గురువుగా వెలుగొందుతూ మొన్న సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. సుప్రీంకోర్టుకు క్షమాపణలూ చెప్పి, తిరిగి అలాంటి తప్పు చేయనని వేడుకున్నారు. తన ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న పతంజలి ఆయుర్వేద మందులు, ఉత్పత్తుల సామర్థ్యంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆపేయమని కోర్టు ఆదేశాలిచ్చినా ఖాతరు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన మేరకు క్షమాపణలు చెప్పారు. కరోనా సమయంలో ఆధునిక వైద్యం, వ్యాక్సిన్లను కించపరచేలా బాబారాందేవ్‌ మాట్లాడారని ఐ.ఎం.ఏ. దావావేసింది. తాను కరోనాను నయం చేయగల మందును కనిపెట్టానని ఆనాడు విస్తృతంగా ప్రచారం చేశాడు కూడా. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆ ప్రచారమంతా సాగింది. ఆయన ఉత్పత్తుల్లో ఆ సామర్థ్యాలు లేవని పరిశోధనలో తేలింది. అంతేకాక ఉత్పత్తులు నాసిరకమైనవనీ తేల్చి చెప్పారు. వేలకోట్ల వ్యాపారానికి ఎదిగిన బాబా కోర్టునూ బేఖాతరు చేయడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు ఆయనకు.
మొదట ఆయన ఒక సామాన్య హిందూ సన్యాసి. తర్వాత అవినీతి వ్యతిరేక క్రూసేడర్‌. ఇప్పుడు పతంజలి సామ్రాజ్యానికి మార్గదర్శి. 1995లో హరిద్వార్‌లో దివ్య యోగా ట్రస్ట్‌ను స్థాపించి, శీర్షాసనాలు, హెడ్‌స్టాండ్‌లు, వివిధ విన్యాసాలతో యోగా గురువుగా జన సమూహాన్ని ఆకర్షించుకున్నారు. ఆ తర్వాత చిన్నగా ప్రజలకు వాణిజ్యపరమైన ఆధ్యాత్మిక కంటెంట్‌ను ప్రసారం చేయడానికి టీవీ చానెళ్లనూ ప్రారంభించారు. ఆస్థా టీవీ, సంస్కార్‌ టీవీ విజయవంతంగా మతపరమైన భక్తి వరదను పారిస్తూనే ఉంది. అంతేకాదు, మరో పది హిందీ భక్తి చానెళ్లలో నియంత్రణా వాటాలను ఆయన కలిగివున్నారు. ఇవి ఇప్పుడు ఆధ్యాత్మికతను వ్యాపారానికి ముడివేసి కళాత్మక ప్రసారాలను కొనసాగిస్తున్నది. ఇది విస్తరించి భారతదేశపు బహుళ బిలియన్‌ డాలర్‌ల వినియోగ వస్తువుల పరిశ్రమ దినదిన ప్రవర్థమానమై వెలిగిపోతున్నాయి. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు ఒక సంవత్సరపు టర్నోవర్‌ పదివేల కోట్లుగా వుంది. ఇన్ని సంవత్సరాలుగా తెస్తున్న పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులలో స్వచ్ఛత, నాణ్యతలేవీ లేవని పరిశోధనలు రుజువు చేశాయి. అయినా ప్రజల అమాయకత్వం, అజ్ఞానం ఆయనకు తరగని పెట్టుబడిగా మారింది. భయం, ఆశ, పేదరికం యొక్క భావోద్వేగాలపై ఆడుతున్న ఆటగా మూఢత్వాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు.
రాజకీయాలకు బాబాలకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. మన పాలకులను మీరు గమనించండి. ఎన్నికల్లో గెలవగానే బాబాలు, ఆశ్రమాల చుట్టూ తిరుగుతారు. ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాస్తవంగా నాయకులు కావటానికి, అధికారం దక్కటానికి ప్రజల ఆశీర్వాదం అవసరం. సామాన్య ప్రజల నిస్సహాయత, దారిద్య్రం, ఆసరా, భరోసా ఏదీ లేనితనంలోంచి ఏదో ఒక విశ్వాసంలో బతకటంకోసం ఈ బాబాలు, స్వాములు చెప్పిన మాటలను వింటుంటారు. వారి మోసాలకు, దగాలకు బలి అవుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పొందటం, అనారోగ్యానికి వైద్యం పొందటం తలకు మించిన భారమైన సందర్భంలో, బాబాల వైద్యానికి గిరాకి పెరిగింది. ఆరోగ్యానికి యోగాయే శరణ్యం అని బోధించే రాందేవ్‌ బాబా, నా ఉత్పత్తులు వాడండి, ఆరోగ్యంగా ఉండండి అని ప్రచారంచేసి కోట్లకు అధిపతి అయ్యాడు. ఇతనొక్కడే కాదు, ప్రతి ఒక్కరూ ఈ రోజు వాట్సప్‌ వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. అంతెందుకు ఇషా ఫౌండేషన్‌ గురు జగ్గీవాసుదేవ్‌ కూడా మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు, సవాళ్లకు చాలా అలవోకగా సమాధానాలిస్తారు. ఆరోగ్యాన్ని గురించీ బోధిస్తారు. కానీ ఆయన తలలో తలెత్తిన అనారోగ్యానికి ఆస్పత్రికి వెళ్లి ఆధునిక వైద్యాన్ని పొందక తప్పిందికాదు. మన రాందేవ్‌ కూడా ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యం గురించి చెప్పినా అనారోగ్యానికి ఆసుపత్రిలో అలోపతి వైద్యమే పొందాడు. ఇక్కడ ఆయుర్వేద వైద్య విధానాన్ని తక్కువ చేయటం కాదు, అవి కొన్నిరకాల అనారోగ్యాలకు పనిచేస్తాయి. కానీ వాటిని వాడుకుని అనవసరమైన అబద్దాలు ప్రచారం చేస్తూ వ్యాపారం చేయటమే ఒక సమస్య. ఆధ్యాత్మికత కార్పొరేటీకరణ చెందిన ఫలితమిది.
బాబాలకు నాయకులు దాసోహం అనటమూ, నాయకులకు బాబాలు ప్రచారం చేయటంవల్ల, అధికారానికి, బాబాలకు దగ్గరి సంబంధం ఉంది. వీళ్లిద్దరికీ ప్రజలు అజ్ఞానంలో ఉండటం, మూఢ విశ్వాసాల్లో పడిపోవడం అవసరం. అదే వారికి పునాది. దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఈ మాయా బాబాల వ్యాపార ప్రబోధాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజల అనారోగ్యానికి కారకమవుతున్న కాలుష్యాలను, కల్తీని అరికట్టటంలో కృషి చేయాలి.

Spread the love