ఎవరైనా ఎవరికైనా బహుమతి ఇవ్వాలని అనుకుంటే ఎదుటివారు ఇష్టపడే వస్తువునో లేదా ఇచ్చేవారి ఇష్టం మేరకో ఏదో ఒకటి ఇస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఈ యువకుడు మాత్రం కనపడిన వారికల్లా తాను రాసిన రచనలనే బహుమతిగా ఇస్తున్నాడు. ఎవరికి బహుమతి ఇవ్వాలని అనుకుంటాడో వాళ్ళ గురించే కథ రాసి, దాన్నే ప్రజెంట్ చేస్తున్నాడు. ఇచ్చిన తర్వాత అది వారికి నచ్చిందో లేదో తెలుసు కోవడానికి ముఖకవళికలనూ గమనిస్తుంటాడు ఈ ‘మిస్టర్ రైటర్’. ఒక విధంగా ముఖకవళికలు గమనించడానికే ఇతను రాసిన కథలను అందరికీ ఇస్తాడట! ఈ విచిత్ర టాలెంటెడ్ రచయిత పేరు కృష్ణా రవిశంకర్. ఇతనెవరో? చేసే పనేంటో? ఆ పనిలో ఉన్న జోష్ ఎంటో తెలుసుకుందాం…
”మీరు రచయితగా స్థిరపడాలి అనుకుంటున్నారా?” అని అడిగితే ‘అవును’ అని సమాధానం చెప్పే… నేటి యువతలో ఎంతమంది ఉంటారు? నిజానికి రచన చేసేవారు, రచనను వృత్తిగా ఎంచుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఇంగ్లీష్ టీచర్లను ఆకట్టుకోడానికి శంకర్ స్కూల్ డేస్ లోనే రచనలు చేయడం మొదలుపెట్టాడు. టీనేజ్‌లో కలిగే ఆత్రుత గురించి, ప్రపంచంపై పోరాటం చేసేవారి గురించి కవిత్వం రాసేవాడు. అయితే ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా మనుషుల్లో ఉండే సూక్ష్మమైన భేదాలను పరిశీలించాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఈ కుర్రోడు. దారి కోసం ప్రత్యక్షంగా బాధను చూపించకుండా గుండె బద్దలు చేయడం, నవ్వు లేకుండా సంతోషాన్ని కలిగించడం వంటి సామాజిక ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అశువుగా కవిత్వం చెప్పినట్టు ఆశువుగా కథలు రాసి ఇస్తాడు శంకర్ ఏ మనిషితోనైనా కొన్ని క్షణాలు గడిపితే వారిపై కధరాసి వారితే ఇస్తాడు. అలాగని కథ మరో కాపీని తన దగ్గరా ఉంచుకోడు. ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ ఇవ్వని విధంగా నా కోసం ప్రత్యేకమైన ఒక కథను రాసి బహుమతిగా ఇచ్చాడు’ అని జనాలు అనుకోవాలని శంకర్ ఆలోచన.
అరవై రోజుల ప్రయాణం
శంకర్ పనీపాటా లేక ఈ పని చేయట్లేదు. కొన్నేళ్ళ క్రితం అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి, రెండు నెలల పాటు యూరప్ పర్యటన చేశాడు. అన్నింటినీ తట్టుకొని, తనకు తానుగా నిలబడగలదో లేదో తెలుసుకోడానికి తనపై తాను చేసుకున్న ఒక ప్రయోగమే ఈ ప్రయాణం సౌకర్యవంతమైన జీవితాన్ని పరిచేసి, నమ్మశక్యం కాని మనుసులను కలుసుకుంటూ సాగిన ఈ ప్రయాణంలో ప్రతి మనిషి నుండీ ఎంతో కొంత స్పూర్తిని పొందానంటాడు శంకర్. పర్యటించిన ప్రతి నగరం గురించి ఒక కాల్పనిక కథ రాసుకుంటూ వాటిని ‘సేక్ట్స్ డేస్ ఇన్ యూరప్’ పేరుతో అతను రూపొందించిన ఫేస్ బుక్ పేజీలో ప్రచురించాడు. చూసిన అందరూ శంకర్ని అభినందించి మరిన్ని కథలు రాయమని ప్రోత్సహించారు. మరి ఈ రెండు నెలల పర్యటనలో నేచ్చింది ఏంటి? అని అడిగితే, సరైన నిర్దేశం, సంకల్పం ఉంటే నీ జీవితాన్ని, నువ్వు అనుకున్నట్టే బతకొచ్చు’ అంటాడు ఈ బస్కింగ్ బుల్లోడు.

బస్కింగ్ ఇన్ ఇండియా
రోడ్లపైన కళను ప్రదర్శించడాన్నే బస్కింగ్ అంటారు. ఇది అమెరికా, యూరప్ బాగా పాపులర్ అయిన అంశం.
సాధారణంగా గిటార్ లేదా వాయిలెన్‌తో ఒక వ్యక్తి ఒంటరిగా సంగీతం వాయించడాన్ని (ఒక విధంగా కళను ప్రదర్శించడాన్ని) బస్కింగ్ అంటారు. పశ్చిమ దేశాల్లో మెట్రో స్టేషన్ల దగ్గర, ఒక సందోహం ఉన్న ప్రదేశాల్లో బస్కర్లు ఉంటారు. రోడ్డున వెళ్ళేవాళ్లు వీళ్ళకు డబ్బులు కూడా ఇస్తుంటారు.
రచయితగా శంకర్ రోడ్ల వెంట తన రచనను ఎలా ప్రదర్శించగలడు?
అదే ఇతనిలో ఉన్న ప్రత్యేకత. స్ట్రీట్‌లో ఒక రచన చేయాలంటే దానికి చాలా సమయం పడుతుంది. అంతకుముందు రాసినదాన్ని వదిలేసి, ఆశువుగా మరో రచన చేయాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పని. సాధారణంగా ఇలాంటి రచనా శైలి ఇంటన్నెట్‌లో కనిపిస్తుంది కానీ, రోడ్ల వెంట కనిపించదు. ముక్కూమొఖం తెలియని వ్యక్తుల్ని కలుస్తూ, వారి అనుభవాలను తెలుసుకుంటూ, దానితో పాటు రోడ్డుపై కూర్చుని కథలు రాయడం అద్భుతమైన అనుభూతి అంటాడు శంకర్. నాలుగు గోడల మధ్య కూర్చుని రాయడం కన్నా తన టైప్ రైటర్‌తో రోడ్డు పక్కన కూర్చుని ప్రపంచాన్ని పరిశీలిస్తూ రాయడం సులువు అని ఇతని సమ్మకం.
వీధులే వేదిక
శంకర్ లాగా ఇండియాలో బస్కింగ్ చేసేవారు లేకపోలేదు. ఆనంద్ విజయసింహ అనే పాటల రచయిత, గాయకుడు బెంగళూరులో మొదటి బస్కర్ గుర్తింపు ఉన్న వ్యక్తి. అలాగే వాస్తుశిల్పి, ఫొటోగ్రాఫర్ యతీష్ వీటి కూడా జ్సంగ్ చేస్తాడు. ఇలాంటి వారందరూ కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ కొన్నాళ్ళు ఆసియా పర్యటన చేయాలని సంకల్పించుకున్నాడు. దానిలో భాగంగా ప్రతి నగరం గురించి ఒక కథ రాయాలనీ, ప్రాంతీయంగా కలిసిన మనుషుల స్పూర్తితో ఇంకొన్ని కథలు రాయలనీ ఉబలాట పడుతున్నాడు. టూరిస్ట్ ప్రదేశాల్లోనూ బస్కింగ్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే కొన్ని ప్రాంతాలో రోడ్డుపైన ఉండటానికి పోలీసుల అనుమతి తప్పనిసరి అవడం వలన శంకర్‌కి కొంత ఇబ్బంది కలుగుతుందంట!
ప్రజలే బలం
తనపై తాను కొనసాగిస్తున్న ఈ ప్రయోగానికి ప్రజలే బలం అంటారు శంకర్. సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులు ప్రోత్సాహం అందిస్తుంటే, తాను ఎవరి కోసం కథలు రాస్తాడో వాళ్ళు సరికొత్త ఆలోచన చేశానంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తన జార్‌లో డబ్బులేస్తున్న వాళ్ళు మాత్రం కేవలం కథ కోసమే కాదు, బహిరంగంగా నువ్వు చేస్తున్న ఈ పని బాగుంది అంటూ కాసులతో ఆశీర్వదిస్తున్నారు. అపరిచితులు చాలా మంది శంకర్ చేస్తున్న పనిని అభినందించి, మరిన్ని కథలు రాయాలని ఆశిస్తున్నారు.
‘ప్రజలకు బోర్ కొట్టి నన్ను తరిమే వరకూ ఇదే చేస్తుంటాను’ అంటాడు బస్కింగ్ బాయ్ రవి శంకర్.

మెట్రో మెడ్లీ
బస్కింగ్‌ను మెట్రో మెడ్లీ ద్వారా పూర్తి ప్రాచర్యంలోకి తెచ్చిన తొలి నగరం హైదరాబాద్. ఈ ఈవెంట్‌లో దాదాపు 100 మందికి పైగా సంగీత విద్వాంసులు పాల్గొంటున్నారు. రోజువారీ ప్రయాణికులను ఆనందపరుస్తోంది ఇది. అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబిఎస్, పరేడ్ గ్రౌండ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, ఉప్పల్ వంటి మెట్రో స్టేషన్లలో బస్కింగ్ ఈవెంట్ జరుగుతుంది. జాజ్, టాలీవుడ్, రాక్ నుంచి బాలీవుడ్ వరకూ వివిధ సంగీత శైలులు వీనుల విందు చేస్తాయన్నారు. కళాకారులకు ప్రత్యక్షంగా సంగీత ప్రియుల స్పందన తెలియజేయడం ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఒకవైపు ఎటువంటి ముందస్తు అంచనాలూ లేకుండా ప్రజలకు సంగీత విందును పంచడం, మరోవైపు కళాకారులకు ప్రోత్సాహం అందించడం… లక్ష్యాలుగా తొలిసారి నగరంలో బస్కింగ్ ట్రెండ్‌కి నాంది పలికింది. పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణమైన ఈ శైలికి ఈ స్థాయిలో వెల్‌కమ్ చెప్పిన తొలి నగరం మనదే.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417



