ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్ నమోదు
హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయోగం
బాధితులకు భరోసాగా ‘వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు’
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరాలు రూపాలు మార్చుకుంటూ పెరిగిపోతున్నాయి. డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతోపాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ నేరస్థుల బారినపడిన బాధితులకు క్లిష్ట సమయాల్లో అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. బాధితులు ఎక్కడికీ వెళ్ల కుండా, ఆందోళనకు గురికాకుండా ‘సీ-మిత్ర’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుంది. సాంకేతికత ద్వారా పోలీసులే బాధితుల వద్దకు వచ్చే అద్భుతమైన ‘వర్చువల్‌గా పరిష్కారం’ లభిస్తుంది. ఈ మేరకు శుక్రవారం ‘సీ-మిత్ర’ యాప్‌ను హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు
సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఒక ‘వర్చువల్ హెల్ప్‌డెస్క్’ ఈ సీ-మిత్ర. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియను పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా సైబర్ మోసం జరిగి నప్పుడు బాధితులు ‘1930’ నంబర్‌కు ఫోన్ చేయడంగానీ, జాతీయ సైబర్ పోర్టల్ (www.cybercrime.gov.in) లోగానీ ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం కచ్చితంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ‘సీ-మిత్ర’ యాప్ వచ్చాక ఇక ఆ సమస్య ఉండదు. బాధితుల ఫిర్యాదు ప్రక్రియ ఇంటి నుంచే పూర్తవుతుంది.
‘సీ-మిత్ర’ బృందమే స్వయంగా ఫోన్
చాలామంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి ‘సీ-మిత్ర’ బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్‌బాగ్, హైదరాబాద్-500029 అడ్రస్‌కు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి.
అంతేకాదు, సైబర్ క్రైం పీఎస్ వద్ద డ్రాప్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సంతకం చేసిన ఫిర్యాదు కాపీలను అందులో వెయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఆ వివరాలను సందేశ రూపంలో బాధితులకు పంపిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సీ-మిత్ర సేవలను పొందేందుకు అర్హులు. భవిష్యత్‌లో డిజిటల్ సంతకం ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 24మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ఏఐ పరిజ్ఞానంతో బాధితులకు సేవలు అందిస్తుంది.
జీరో ఎఫ్‌ఐఆర్
ప్రస్తుతం లక్ష రూపాయలకు మించిన సైబర్ మోసాలను సైబర్ క్రైమ్ స్టేషన్‌లో, అంతకంటే తక్కువైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ నమోదు చేస్తున్నారు. అయితే, ఇకపై ‘సీ-మిత్ర’ విధానం ద్వారా 3 లక్షల్లోపు ఉన్న కేసులను జీరో ఎఫ్‌ఐఆర్ చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తారు. రూ.3 లక్షలకుపైన ఉన్న ఫిర్యాదులను సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేస్తారు.
ఓటీపీలు, డబ్బులు ఎట్టిపరిస్థితుల్లో పోలీసులు అడగరు
పోలీసులు ఓటీపీలు, డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ‘సీ-మిత్ర’ యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా సీపీ మాట్లాడారు. సీ-మిత్రా అంటే సైబర్ మిత్రా అని తెలిపారు. బాధితుల ఆందోళనను దూరం చేసేందుకే సీ-మిత్రను ప్రారంభించామని, దేశంలోనే ఇలాంటి సేవలు ఎక్కడా లేవన్నారు. సైబర్ నేరస్థుల బారిన పడిన వారు గోల్డెన్ అవర్లలో (వెంటనే) ఫిర్యాదు చేస్తే సైబర్ నేరస్థుల ఆగడాలను అరికట్టొచ్చని, బాధితుల డబ్బులను సీజ్ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీ-మిత్ర అధికారిక ల్యాండ్‌లైన్ నంబర్: 040-4189-3111 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయని, వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్ నంబర్ల నుంచే వస్తుందన్నారు.
సీ-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీ-మిత్ర కేసును దర్యాప్తు చేయదని, పోయిన డబ్బును వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇవ్వదని, చట్టపరమైన సలహాలు కూడా ఇవ్వదన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు సహకరిస్తుందన్నారు. కేసు స్టేటస్ తెలుసుకో వాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌నే సంప్రదిం చాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, డీసీపీ (సైబర్ క్రైమ్) ఏ.అరవింద్ బాబు, ఐపీఎస్‌లు కిరణ్ ప్రభాకర్, కె.అపూర్వరావు, శ్రీగైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సిహెచ్.రూపేశ్, బి.వెంకేశ్వర్లు, ఏ.రమణారెడ్డితో పాటు ఇతర డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. సైబర్‌క్రైమ్ ఏసీపీ శివమారుతీతో పాటు సైబర్‌క్రైమ్ బృందాన్ని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఎఫ్‌ఐఆర్‌లు 18శాతమే..
సీ-మిత్ర విధానం వల్ల పౌరుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, స్టేషన్ సిబ్బందికి దర్యాప్తుపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. 1930కి, జాతీయ సైబర్ పోర్టల్‌కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18శాతం మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదవుతున్నాయి. 100 శాతం సైబర్ నేరాలు జరిగితే.. అందులో కొందరు ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఫిర్యాదులు తగ్గుతున్నాయి. సీ-మిత్ర యాప్ ద్వారా దీనిని 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



