ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు నిరసన
నవతెలంగాణ – హైదరాబాద్
క్యాబ్ అగ్రిగేటర్ల దోపిడీని నిరసిస్తూ.. తమ సమస్యలను పరిష్కరించాలని క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు డ్రైవర్ల నుంచి అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయని.. పైగా తక్కువ చెల్లింపులు చేస్తున్నాయని డ్రైవర్లు, గిగ్‌వర్కర్ల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఫిబ్రవరి 7న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని డ్రైవర్లు, గిగ్‌వర్కర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని యూనియన్ల ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్‌తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఆర్టీఏ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సమ్మెను చేపడుతున్నట్టు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. కనీస చార్జీలు, గిగ్ వర్కర్ల పని పరిస్థితులను నిరసిస్తూ ఈ ఆందోళన చేపడుతున్నట్టు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల యూనియన్ పేర్కొంది.
క్యాబ్ సేవలను నియంత్రించేందుకు తీసుకొచ్చిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025 ఉన్నప్పటికీ ఆయా ప్లాట్‌ఫామ్స్ మాత్రం ఇష్టానుసారం చార్జీలు నిర్ణయిస్తున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీనిపై ప్రభుత్వమే జోక్యం చేసుకుని కనీస చార్జీలను నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రయివేటు వాహనాలను కమర్షియల్ అవసరాలకు వినియోగించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. డ్రైవర్ల ఆదాయానికి రక్షణ కల్పించడంతో పాటు, పని పరిస్థితుల మెరుగు కోరుతూ ఈ సమ్మె చేపడుతున్నారు. 2025 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ వర్కర్లు సమ్మె చేపట్టి పలు డిమాండ్‌లను నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో 10 నిమిషాల హామీని తొలగించాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు కూడా ఆ వైపున సమ్మెకు పిలుపునివ్వడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన భారత్ ట్యాక్సీ సేవలను డ్రైవర్లకు పూర్తిగా అందుబాటులోకి తేవాలని జైడ్రైవర్ అన్న అసోసియేషన్ ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు ఉసిరికాయల సిద్దార్థ గౌడ్ తెలిపారు. తెలంగాణ, ఏపీలోని 2.5 లక్షల మంది డ్రైవర్లు ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారన్నారు. డ్రైవర్లందరికీ యాక్సిడెంటల్ బీమా, జీవిత బీమాను అందించాలన్నారు. ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన క్యాబ్‌అగ్రిగేటర్లు ఓలా, ఉబర్, ర్యాపిడో సిండికేట్ కావడం ద్వారా డ్రైవర్లకు తక్కువ చెల్లింపులు చేస్తున్నారని టీఎస్‌ఎఫ్‌సీఎస్‌ఏ ప్రెసిడెంట్ నక్కపోతు శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కిలోమీటర్‌కు రూ.20మేర ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ.9కి తగ్గించారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని డ్రైవర్లకు కచ్చితమైన ఆదాయ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
నేడు క్యాబ్ డ్రైవర్ల దేశ వ్యాప్త సమ్మె
- Advertisement -
- Advertisement -



