నవతెలంగాణ-హైదరాబాద్: ఎర్ర సముద్రంలో కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్థాన్ సహా మధ్య ప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పాకిస్థాన్, యూఏఈ దేశాల్లో ఇంటర్నెట్ వేగం మందగించిందని ప్రముఖ వాచ్ డాగ్ ఆర్గనైజేషన్ నెట్ బ్లాక్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెడ్డా సమీపంలో కేబుల్స్ కట్ అయినట్లు పేర్కొంది. అయితే, సముద్రం అడుగున్న ఉన్న ఈ కేబుల్స్ ఎలా తెగాయనే దానిపై స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు. మరొక వాదన ప్రకారం.. హౌతీ రెబెల్స్ ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపి కేబుల్స్ కట్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌతీ రెబెల్స్ గతంలో ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడులు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకే హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారని ఆరోపణలు రాగా హౌతీ రెబెల్స్ ఖండించారు. తాజా ఘటనపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ, యూఏఈ, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.