– మిగులు బడ్జెట్ అంటూ కాంగ్రెస్ మోసం
– రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ ఎదుట చేయిచాచాల్సిన దుస్థితి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందనీ, రోజువారీ ఖర్చుల కోసం ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితి తీసుకువచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాగ్ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం బట్టబయలైం దనీ, ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా మిగులు బడ్జెట్ అని చెప్పుకోవటం ప్రజలను మోసగించటమేనని ఆమె విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికారంలోకి రాకముందు ”సంపద పెంచుతాం.. పేదలకు పంచుతాం” అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చేయిచాచాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా మిగతా అన్ని రోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపారు. ఏడాది కాలంలో రూ.1.30 లక్షల కోట్లు చేబదులు అప్పులు తెచ్చి సర్కారును నడిపించటమంటే కచ్చితంగా అది చేతకానితనమేనని విమర్శించారు. తెచ్చిన అప్పుల్లో మరో రూ.6వేల కోట్లు ఆర్థిక సంవత్సరం ముగిసినా చెల్లించలేదనే విషయాన్ని కాగ్ బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. నెలకు రూ.12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న తెలంగాణలో రోజువారీ కనీస అవసరాల కోసం రూ.1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటెన్ చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇప్పటికే అడ్డగోలుగా రూ.8.65 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై దాదాపు రూ.9 లక్షల భారాన్ని మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రచార ఆర్భాటాలు ఆపి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, మామిడి కాయలు నేలరాలాయన్నారు. నువ్వులు, పసుపు, వరి పంటలకు తీరని నష్టం జరిగిందని వివరించారు. సోమ వారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారు జామున కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నేటి నుంచి పార్టీ ఏర్పాటుపై క్యాడర్‌తో కవిత సమాలోచనలు
రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి క్యాడర్‌తో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాలోచనలు జరుపనున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు వరుసగా ఉమ్మడి జిల్లాల వారీగా నాయ కులు, కార్యకర్తలతో చర్చించనున్నారు. పార్టీ ఏర్పాటు కోసం వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు, తెలంగాణ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించాల్సిన బ్లూ ప్రింట్‌పై 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేసిన కవిత క్యాడర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. జాగృతి నాయకులు, కార్యకర్తలతో కవిత సమావేశాల షెడ్యూల్‌ను మంగళవారం జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి విడుదల చేశారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశాలు కొనసాగుతా యన్నారు. బుధవారం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో, గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు, శుక్రవారం నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశం కానున్నారు.
కాగ్ నివేదికతో ఆర్థిక విధ్వంసం బట్టబయలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



