ఐదు డీఏలు చెల్లించాలి..రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలి
త్వరలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుస్తాం : తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా సీఎం రేవంత్‌రెడ్డి ముందడుగు వేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటీ కోరింది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు త్వరలో అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి మద్దతు కోరుతామని ప్రకటించింది. ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాలనీ, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను వెంటనే ఇవ్వాలని విన్నవించింది. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో టీఎన్జీఓ సంఘం మాజీ నేతలు, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, దేవీప్రసాద్, విఠల్, భుజంగరావు, హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పరిపాలనా ఖర్చులన్నీ ఉద్యోగుల జీతభత్యాలతో చూపెట్టడం సరిగాదన్నారు. కోసుకున్నా తనదగ్గర పైసా లేదన్నట్టుగా సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులపై ఇలాగే మాట్లాడి అబాసుపాలైన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగుల పరిష్కారం కోసం వేసిన మంత్రుల, నవీన్‌మిట్టల్ కమిటీలతో ఒరిగిందేమీ లేదనీ, వాటిపేరుతో కాలయాపన చేయాలని రాష్ట్ర సర్కారు చూస్తున్నదని విమర్శించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక 3 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. హెల్త్‌కార్డు ద్వారా ప్రతి ఉద్యోగికి కూడా నగదురహిత చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హోంగార్డులు, మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్లుకు ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లకు చెందిన రూ.8 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరు డీఏలను రిలీజ్ చేసిన ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఐదు డీఏలను విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES