రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-అలంపూర్
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ప్రచారోద్యమంలో పాల్గొనాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జి.రాజు అధ్యక్షతన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు అంటే ప్రజా సమస్యలను పరిష్కరించేదిగా, ప్రజా ప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో ముందుకు నడవాలని, కానీ బీజేపీ పార్లమెంటులో ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఉపాధి దెబ్బతీయడం కోసం, అఖిల పక్ష పార్టీలతో చర్చించకుండా పార్లమెంటులో ఏకపక్షంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, వికసిత్ భారత్ గ్రామ్ జీ బిల్లు ఆమోదం చేసుకున్నారని తెలిపారు.
విద్యుత్ సవరణ బిల్లు అమలులోకి వస్తే అట్టడుగు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు దూరం అవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. విత్తన సవరణ బిల్లు వల్ల వ్యవసాయరంగం బాధ్యత నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకొని, కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. ఓటర్ సవరణ వల్ల రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సైతం ప్రజలకు దూరం చేస్తున్నదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు, చట్టాలను బీజేపీ.. సవరించి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని తెలిపారు. ఇలాంటి ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై మార్చి 1 నుంచి జరిగే ప్రచార క్యాంపీయన్‌లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆర్థిక పరిస్థితి పేరుతో తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనం కోసం వెళ్ళిన మహిళను దుర్భాషాలాడటమే కాకుండా, చిన్నారి మృతికి కారణమయిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కులదుర హంకారంతో దాడి చేయడమే కాకుండా అధికార పెత్తనంతో బాధితులపైనే కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఘటనకు కారణమయిన ఎస్‌ఐ, సీఐపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఉన్న ప్రతి గ్రామం నుంచి పోటీ చేయాలన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అంతకుముందు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నాయకులు సింగరాజు మద్దిలేటి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సమా వేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు శ్రీరామ్ నాయక్, సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పరం జ్యోతి, వీవీ నరసింహ, ఉప్పేర్ నరసింహ, నర్మద, మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



