రేపు మూడు రాష్ట్రాల్లో పోలింగ్
న్యూఢిల్లీ : కేరళం, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ రాష్ట్రాల శాసనసభలకు ఒకే విడతలో గురువారం పోలింగ్ జరుగనుంది. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ జరుగుతుండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. 2021 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 97 శాతం నెరవేర్చామంటూ ఎల్డీఎఫ్ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేసింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ గత దశాబ్ద కాలంగా కేరళంలో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 2021 ఎన్నికలలో ఎల్డీఎఫ్ 99 స్థానాలలో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టింది. 1977 తర్వాత ఆ రాష్ట్రంలో ఏ పార్టీ లేదా కూటమి వరుసగా రెండుసార్లు విజయం సాధించడం అదే మొదటిసారి. కాగా అసోంలో 126, కేరళంలో 140, పాండిచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అసోంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. 2021 ఎన్నికలలో ఆ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించింది. ప్రచారం ముగుస్తుండడంతో వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో ఈ నెల 23న ఒకే విడతలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 23, 29 తేదీలలో రెండు దశలుగా పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలోనూ వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
ముగిసిన ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



