కాంగ్రెస్ మాయలో ప్రజలు పడొద్దు : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబొల్లి మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్క రాష్ట్రమైన కేరళలో మాత్రం రూ.వందల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని మంచి నీళ్లలా పారబోస్తున్నారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ఆర్భాటాన్ని చేస్తున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోందని తెలిపారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ నమ్మించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ ప్రజల గొంతు కోసి, కేరళలో కలర్ పేజీల్లో యాడ్స్ ఇస్తోందని విమర్శించారు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే తెలివి లేదు గానీ, ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజల ధనం కేరళలో వృధా చేస్తారా?అని ప్రశ్నించారు. ఆడబిడ్డల కంట్లో మట్టికొట్టి కేరళ పత్రికల్లో మాత్రం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామంటూ దొంగ ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయకపోగా విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారని తెలిపారు. బడుల్లో చదువుకునే పిల్లలకు కనీస వసతులు లేవని పేర్కొన్నారు. ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి కొర్రీలు పెట్టి సగానికి పైగా రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. ఎకరాకు రూ.15 వేల రైతుభరోసాను రెండు సీజన్లకు ఎగ్గొట్టిందని తెలిపారు.
కనీసం యూరియా సరఫరా చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ రూ.నాలుగు వేలకు పెంపును గాలికొదిలేశారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను చెల్లించడం చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో మాత్రం అద్భుత పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. అధిష్టానాన్ని మెప్పించడానికి తెలంగాణ ఖజానాను కాంగ్రెస్ అక్షయ పాత్రగా మార్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడువలేని సీఎం రేవంత్‌రెడ్డి కేరళలో ప్రచారం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాయలో కేరళ ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇతర రాష్ట్రాల్లో దొంగ ప్రచారాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.



