Tuesday, February 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఐరోపా ఏదైనా ప్రత్యామ్నాయం చూపగలుగుతుందా?

ఐరోపా ఏదైనా ప్రత్యామ్నాయం చూపగలుగుతుందా?

- Advertisement -

ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం విదేశాల నుండి వచ్చిన వారిపైన మాత్రమే కాకుండా అమెరికన్‌ పౌరుల మీద కూడా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. దాంతో ఇప్పుడు అమెరికాలో ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ సమర్ధ కులలో ఒక ధోరణి తలెత్తింది. అమెరికాకు, చైనాకు భిన్నంగా మూడోమార్గంగా ఐరోపా ఏదైనా ఒక కొత్త ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపగలుగుతుందా? అని వాళ్లు ఆ వైపు చూడడం ప్రారంభించారు. చైనా అను సరించే మార్గం ఒక ప్రత్యామ్నాయం అని వాళ్లు ముందు నుంచీ భావించడం లేదు. ఈ పెట్టుబడిదారీ ఉదారవాద మేథావులు ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని, సామాజిక న్యాయాన్ని- అన్నింటినీ కలిపి సమర్థవంతంగా నిర్వహించగల పరిస్థితి యూరప్‌కి ఉందేమోనని ఆశపడుతున్నారు. ఈ విధంగా నిర్వహించగల పరిస్థితి ఉండాలంటే ముందు ఐరోపా దేశాలు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దు కొంటూనే మరోవైపు మితవాద శక్తులు బలపడకుండా వాటిని అదుపు చేయగలిగివుండాలని కోరుతున్నారు.

అమెరికన్‌ ఉదారవాదులకు ఐరోపా దేశాలలోని ప్రజాస్వామ్యం ఆకర్షణీయంగా కనపడుతుందేమో గాని… మూడవ ప్రపంచ దేశాల వారికి మాత్రం ఆ దేశాలు సామ్రాజ్యవాద దేశాలుగానే కనిపిస్తాయి. పేరుకి వలస విధానం అంతరిం చినట్టు ఉండవచ్చు గాని, ఇప్పుడు కూడా వాటిని సామ్రాజ్యవాద దేశాలుగానే పరిగణిస్తాం. తమ పట్ల ‘విధేయత’ చూపని మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అమెరికన్‌ సామ్రాజ్య వాదం పన్నిన కుట్రల్లో అత్యధిక భాగం బ్రిటన్‌ సహకారంతో, సమర్ధనతో కొనసాగినవే. ఇరాన్‌్‌లో మొసద్దెక్‌ ప్రభుత్వం మొదలు, కాంగోలో లుముంబా, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ వరకూ అలా కుట్రలకు బలైనవే. వాటన్నింటినీ బ్రిటన్‌ సమర్ధించింది. చాలా ఆఫ్రికా దేశాల్లో, అక్కడ పేరుకి వలస పాలన అంతమైనట్టు చెప్తూన్నా, ఇప్పటికీ ఫ్రెంచి సైన్యాలు మోహరించే వున్నాయి.

బుర్కినా ఫాసోలో అక్కడి అధ్యక్షుడు థామస్‌ సంకారా తమ దేశం నుండి ఫ్రెంచి సేనలను ఖాళీ చేయమని ఆదేశించిన కొద్దిరోజులకే అతడిని కుట్రలో పదవీచ్యుతుడిని చేసి హతమార్చారు. ఆ కుట్ర వెనుక ఫ్రాన్స్‌ హస్తం ఉందన్న బలమైన అనుమానం నేటికీ ఉంది.ఇప్పుడిప్పుడే ఆ బుర్కినా ఫాసోతో సహా కొన్ని పశ్చిమ ఆఫ్రికా దేశాలు తమ వద్ద మోహరించి వున్న ఫ్రెంచి సేనలను వదిలించుకోడానికి మళ్లీ ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఈ ఐరోపా దేశాలన్నీ గాజాలో కొనసాగుతున్న సామూహిక నరహత్యలను సమర్ధిస్తూనే వున్నాయి. చాలా ఐరోపా దేశాల్లో ఉండే ఉదారవాద మేథావులు సైతం దానిని సమర్ధించే పనిలో పడ్డారు. బెర్లిన్‌ చలన చిత్రోత్సవాలకు న్యాయనిర్ణేతల కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉన్న జర్మన్‌ చిత్ర నిర్మాత విమ్‌ వెండర్స్‌ను గాజా నర మేథం గురించి అడిగితే, సినిమాలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని సమాధానమిచ్చారు.

ఇదంతా కాస్సేపు మరిచిపోదాం. ఉక్రెయిన్‌కు, రష్యాకు నడుమ యుద్ధ ప్రసక్తే తలెత్తకుండా మిన్స్క్‌లో కుదిరిన శాంతియుత ఒప్పందాన్ని ఈ ఐరోపా దేశాలే చెడగొట్టినవైనాన్నీ మరిచిపోదాం. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్యా ఎటువంటి శాంతి ఒప్పందమూ జరగకుండా అవి అడ్డుపడుడున్న సంగతీ మరిచిపోదాం. నాటో కూటమిని రష్యన్‌ సరిహద్దుల దాకా విస్తరించడానికి ఈ దేశాలు ప్రయత్నించిన వాస్తవాన్నీ మరిచిపోదాం. ఈ దేశాలు ఒబామా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అతడి ప్రభుత్వ తోడ్పాటుతో ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విక్టర్‌ యానుకోవిచ్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన కుట్రలో భాగస్వాములైన విషయాన్నీ మరిచిపోదాం (ఈ వాస్తవాన్ని అమెరికాలో ఉన్న కేటో ఇన్స్‌స్టిట్యూట్‌ బాహాటంగానే ఒప్పుకుంది). అన్నీ మరిచిపోయి, ఐరోపా ‘మూడో ప్రత్యామ్నాయాన్ని’ చూపగలదా అన్న వాదనకే మన పరిశీలనను పరిమితం చేద్దాం.

ఇలా ఐరోపా ప్రత్యామ్నాయం గురించి మాట్లాడు తున్న వారంతా అమెరికాలో ట్రంప్‌ చేస్తున్న అనుచిత, అసందర్భ కార్యకలాపాలన్నీ అతడి వ్యక్తిగత వైఫల్యాలుగానే పరిగణిస్తున్నారు. అసలు అటువంటి వ్యక్తి మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎలా ఎన్నిక కాగలిగాడన్నది వాళ్లు ప్రశ్నించుకోడం లేదు. అమెరికాలో ట్రంప్‌ ఎన్నికై నట్టుగానే, ఐరోపా దేశాల్లో కూడా ఉదారవాద మధ్యేవాద శక్తులు బలహీనపడి అక్కడ కూడా మితవాద శక్తులే ఎందుకు బలపడుతున్నాయన్నది వాళ్లుపరిశీలించడం లేదు. మరోవిధంగా చెప్పాలంటే, ట్రంప్‌ ఎన్నికను గాని, ఐరోపాలో రాజకీయ పరిణామాలుగాని ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతో సంబంధం లేనట్టుగానే వాళ్లు చూస్తున్నారు. వర్తమాన కాలపు పెట్టుబడిదారీ వ్యవస్థలో అమెరికాలోను, ఐరోపాలోను అన్నింటికన్నా కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణం ఒకటుంది. ఆ దేశాలన్నింటిలోనూ జాతీయ ఆదాయాల్లో కార్మిక వర్గపు వాటా చాలా పెద్ద ఎత్తున పడిపోతోంది.

2011లో ఒక సగటు అమెరికన్‌ కార్మికుడి వేతనం 1968లో అతడికి వచ్చిన వేతనం కన్నా కూడా తగ్గిపోయిందని జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ పేర్కొన్నారు. ఐరోపా కేంద్ర బ్యాంక్‌ చెప్పిన ప్రకారం, అక్కడి దేశాల్లో నిజవేతనాలు 2022-23లో చాలా తీవ్రంగా పడిపోయాయి. 2024 లో కూడా అవి కనీసం 2021 నాటి స్థాయికి కూడా చేరలేకపోయాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా జర్మనీలో ఇంధన సంక్షోభం తలెత్తింది. దాంతో అక్కడి కార్మికుల పరిస్థితి మరీ ఘోరంగాతయారైంది. నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన కారణంగా చౌకగా కార్మికులు లభించే మూడవ ప్రపంచ దేశాలకు చాలా సరుకుల ఉత్పత్తి తరలిపోవడం జరిగింది. దాని పర్యవసానంగా ఐరోపా, అమెరికా కార్మికులు తమ వేతనాలను అంతకు మునుపు పెంచుకోగ లిగినట్టు పెంచుకోలేని అశక్తులైపోయారు. ఆ కార్మికుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలను అక్కడి మితవాద శక్తులు ఉపయోగించుకుని బలపడ్డాయి. నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన ఉదారవాద, మథ్యేవాద పార్టీలు ఆ కార్మికుల ఆగ్రహానికి గురయ్యాయి. ఐరోపా ఖండంలో ఆ పార్టీలు బలహీనపడడానికి ఇదే కారణం.

నిజానికి ఈ మధ్యేవాద ఉదారవాద పార్టీల నాయకుల్లో చాలామందికి-వాళ్లలో అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్‌, బ్రిటన్‌లోని న్యూలేబర్‌ పార్టీ నాయకత్వం, ఫ్రాన్స్‌ నాయకుడు మాక్రాన్‌, జర్మనీలోని ఫ్రెడరిక్‌ మెర్జ్‌ వంటి వారికి-తమ తమ దేశాలలోని కార్మికుల దురవస్తలు పట్టవు. అందుచేత ఆ కార్మికుల పట్ల వారికి సానుభూతి కూడా లేదు. వీళ్లలో చాలామంది రాజకీయాల్లోకి రాకమునుపు బడా కార్పొరేషన్లలో పెద్దస్థాయి ఉద్యోగులుగా ఉన్నవాళ్లే. బ్లాక్‌రాక్‌ అనే బ్రహ్మాండమైన ఆర్థిక సంస్థలో ఉద్యోగిగా పనిచేసినవాడు ఈ ఫ్రెడరిక్‌ మెర్జ్‌. అందువల్లే ఆ కార్మికులంతా అటు మితవాద శక్తులవైపు గాని, ఇటు వామపక్ష శక్తుల వైపు గాని మళ్లారు. బ్రిటన్‌లో వామపక్షనేత అయిన జెరెమీ కోర్బిన్‌ వైపు కార్మికులు మొగ్గు చూపినప్పుడు అక్కడ ఉన్న ఈ మధ్యేవాద, ఉదారవాద నేతలందరూ కూడబలుక్కుని అతడికి వ్యతిరేకంగా మితవాదుల్ని బలపరిచారు. అమె రికాలో బెర్నీ శాండర్స్‌ విషయంలో కూడా అదే విధంగా జరిగింది. ఒక్క ఫ్రాన్స్‌లో మాత్రం వామపక్ష శక్తులు బలంగా ఉన్నందున అక్కడ మితవాద నాయకురాలు లీ పెన్‌ ను వారంతా రెండో స్థానానికి నెట్టగలిగారు.

ఇప్పుడు ఈ ఉదారవాద శక్తులు తమకు దూరమైన కార్మికవర్గం మద్దతు తిరిగి పొందగలగాలంటే ముందు ఆ కార్మికుల వేతనాల దిగజారుడు క్రమాన్ని ఆపగలగాలి. జాతీయాదాయంలో వారి వేతనాల వాటా పెరిగే దిశగా చర్యలు తీసుకోగలగాలి. అప్పుడే వారి మద్దతు పొందగలుగుతారు. అప్పుడే మితవాద శక్తుల విజృంభణకు కళ్లెం వేయగలుగుతారు. అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవడం అంటే ప్రభుత్వం ద్రవ్య వ్యవస్థలో చురుకుగా జోక్యం చేసుకోవాలి. కాని నయా ఉదారవాద విధానాల కాలంలో ప్రభుత్వం ఈ విధమైన జోక్యానికి గనుక పూనుకుంటే ఆ దేశం నుండి పెట్టుబడులు వెంటనే పలాయనం చిత్తగిస్తాయి. అటువంటి పరిస్థితిని ఈ పెట్టుబడిదారీ పార్టీలు, అవి ఎంత ప్రజాస్వామ్యం గురించి తాపత్రయపడేవి అయినప్పటికీ, తట్టు కోలేవు.

అందుచేత దేశ ద్రవ్య వ్యవస్థలో వాటి ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు బలంగా జోక్యం చేసుకోలేవు. ఈ పార్టీల మీద అసంతృప్తిని ఉపయోగించుకుని అధికారాన్ని చేజిక్కించుకున్న మితవాద పార్టీలు కూడా కార్మికుల స్థితిగతుల్ని మెరుగుపరచలేవు. అందుచేత ఎన్నికల ముందు కార్మికుల తరఫున మాట్లాడినా, హామీలిచ్చినా, గెలిచిన తర్వాత ఆ కార్మికులకు ద్రోహం చేస్తాయి. ఆ మితవాద పార్టీలకు గుత్తపెట్టుబడిదారుల మద్దతు ఉంటుంది. ఆ మద్దత్తును నిలుపుకోవాలంటే ఆ గుత్తపెట్టుబడి దారుల లాభాల వాటాను పెంచాలే తప్ప తగ్గించే చర్యలు తీసుకోకూడదు. అందుచేత నయా ఉదారవాద ఆర్థిక చట్రం నుండి విడగొట్టుకుని కార్మికవర్గానికి అను కూల దిశలో విధానాలను చేపట్టగలిగేది ఒక్క వామపక్ష శక్తులు మాత్రమే.

కీన్షియన్‌ విధానాల నుండి నయా ఉదారవాద విధానాలవైపు మళ్లిన తర్వాత అది అనివార్యంగా సమాజంలోని అసమానతలను, సంపద కేంద్రీకరణను అంతకంతకూ పెంచుతూ పోతుందని, అది కార్మికులను దారిద్య్రంలోకి నెడుతుందని, ఆ దుర్భర పరిస్థితుల పట్ల అసంతృప్తి చెందడం వలన కార్మికులు మితవాదం వైపు మొగ్గు చూపుతారు. ట్రంప్‌ విధానాలతో ఇబ్బందులు పడుతూ ప్రత్యామ్నాయంగా ఐరోపా వైపు చూస్తున్న బూర్జువా ఉదారవాద శక్తులకు ఈ వాస్తవం అవగతం కాదు. నయా ఉదారవాద విధానాల్లోనే అంతర్లీనంగా ఉన్న ఈ సంపద కేంద్రీకరణ లక్షణాన్ని విడిగా వదిలించుకోవడం సాధ్యపడదు. అందుచేత నయా ఉదారవాద విధానాలకే కట్టుబడ్డ ఐరోపా పార్టీలు అమెరికాకు ప్రత్యామ్నాయాన్ని చూపించలేవు. పెట్టుబడుల సంచారాన్ని నియంత్రించి బలంగా జోక్యం చేసుకుని ఆర్థిక వ్యవస్థను అసమానతలు తగ్గే దిశగా నడిపించగల వామపక్ష శక్తులు అధికారం చేపట్టినప్పుడు మాత్రమే ఇదిసాధ్యం.

ఈ అవగాహన కేవలం ఐరోపా దేశాలకు మాత్రమే వర్తించేది అనుకోరాదు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకంతటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత సంక్షోభ భరితంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం బతికిబట్ట కట్టాలంటే ఆ ప్రభుత్వానికి శ్రామికవర్గం(మూడవ ప్రపంచ దేశాలలో కార్మికులు, వృత్తిదారులు, రైతులు, చిన్న ఉత్పత్తిదారులు అందరూ కలిసి శ్రామికవర్గం అవుతారు) మద్దతు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఐరోపాలోని ప్రభుత్వాలు అన్నీ కలిసి ఒకే ఒక యూరపియన్‌ యూనియన్‌ (ఇ.యు)గా ఏర్పడ్డాయి కనుక ఐక్య ఐరోపా పెట్టుబడుల ప్రవాహాన్ని నిరోధించగలుగుతుంది అని అనుకోలేం. ఇ.యు కి ఉన్న పరిమితులను అక్కడి ప్రభుత్వాలన్నీ కలిసి వ్యవహరించినంత మాత్రాన అధిగమించలేవు. అవన్నీ కలిసినా, నయా ఉదారవాద చట్రానికి లోబడే వ్యవహరించల్సి వుంటుంది.

అందుచేత అమెరికాకి ఏ పరిమితి ఉందో, అదే ఐరోపా దేశాలకూ ఉంది. అమెరికా చరిత్ర వేరు, ఐరోపా చరిత్ర వేరు అయివుండొచ్చు. వాటి ఆర్థిక సాంప్రదాయాలు వేరై వుండవచ్చు. కాని ఇన్ని దశాబ్దాల పాటు నయా ఉదారవాద విధానాలను అమలు జరిపిన తర్వాత ఆ విధానాల స్వభావసిద్ధ ధోరణుల దుష్ప్రభావం ఇప్పుడు వాటన్నింటిమీద ఏదో విధంగా పడుతోంది. అందుచేత అమెరికాకు భిన్నంగా ఇ.యు వ్యవహ రించలేదు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంత తలతిక్కగా వ్యవహరిస్తున్నట్టు కనిపించినా, నయా ఉదారవాద విధానాల మూల సూత్రానికి (పెట్టుబడులు స్వేచ్ఛగా దేశాల ఎల్లల ప్రతిబంధకం లేకుండా సంచరించడం) మాత్రం బలంగా కట్టుబడే వ్యవహరిస్తున్నాడు.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -