ఫాతిమా ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా ఆఫీసుకు వచ్చింది. ఆమెకు జావెద్‌తో పెండ్లి జరిగి ఐదేండ్లు అవుతుంది. భర్త ఆమెను, పిల్లలను వదిలేసి రెండో పెండ్లి చేసుకున్నాడు. ఆ పెండ్లి చేసుకొని కూడా నాలుగేండ్లు కావొస్తుంది. అయితే ఈ విషయం ఆమెకు ఈ మధ్యనే తెలిసింది. జావేద్‌ను ఆమె నిలదీస్తే ‘మన ఇస్లాంలో ఐదు పెండిండ్లు చేసుకునే అనుమతి వుంది కదా! అందుకే నేను రెండో పెండ్లి చేసుకున్నాను. నీతో పాటుగా ఆమెను కూడా చూసుకుంటాను. నాకు ఇద్దరూ కావాలి’ అన్నాడు. జావెద్ మాటలు ఫాతిమాకు నచ్చలేదు. ‘ప్రేమించి పెండ్లి చేసుకొని, పెండ్లి జరిగిన ఏడాదికే ఇంకో అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. నన్ను నిజంగా ప్రేమించి వుంటే ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంకో పెండ్లి ఎలా చేసుకుంటాడు. నాకు న్యాయం కావాలి’ అంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. మేము జావెద్‌ను రమ్మనమని లెటర్ పంపాము. తర్వాతి వారం అతను వచ్చి ‘నేను ఫాతిమాను ప్రేమించి పెండ్లి చేసుకున్న మాట వాస్తవమే, కానీ నేను అనుకున్న విధంగా ఆమె లేదు. ఫాతిమాకు ఇంట్లో పని చేయడం రాదు. పైగా ఎప్పుడూ వాళ్ల పుట్టింట్లోనే ఉంటుంది.
భర్తగా నా అవసరాలు ఏమీ పట్టించుకోదు. నా మాట అస్సలు లెక్క చేయదు. ఆమె ఇంత చేస్తున్నా ప్రేమించి పెండ్లి చేసుకున్నాను కాబట్టే భరిస్తున్నాను. లేకపోతే ఎప్పుడో వదిలేసే వాడిని. అయినా మా ఇస్లాం ప్రకారం ఇంకా నేను మూడు పెండిండ్లు చేసుకోగలను. కానీ అలా చేయదలచుకోలేదు. ఫాతిమా ఇది అర్థం చేసుకోకుండా ఇలా పంచాయితి పెట్టడం సరైన పద్ధతి కాదు. అయినా ఆమెకు కావల్సినవన్నీ చేస్తూనే ఉన్నాను. మా నిబంధనల ప్రకారం నేను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికే ఫాతిమా ఇలా మీ దగ్గరకు వచ్చింది. అంతకు ముందు పెద్దల దగ్గరకు, పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లింది. ఇప్పటికైనా ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోతే ఇకపై ఆమెకు నాకూ ఎలాంటి సంబంధం ఉండదు. నేను తప్ప ఆమెకు ఇంకో దిక్కు లేదు. కాబట్టి నాతో కలిసి ఉంటుందో విడిపోతుందో తేల్చుకోమనండి’ అన్నాడు.
దాంతో ఫాతిమా ‘నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేనను కోవడం నీ మూర్ఖత్వం. నీకు మగాడిని అనే అహంకారం ఎక్కువ. రెండో పెండ్లి చేసుకొని కూడా నా తప్పు లేదు అంటున్నావు. నీ దయా దాక్షిణ్యాలపై నేను ఆధారపడి బతకాలని నీ ఉద్దేశం. నాకు ఆ అవసరం లేదు. ఇలా మాటలు పడుతూ నీతో బతకడం కంటే ఉద్యోగం చేసి నా బతుకు నేను బతుకుతాను’ అంది. దానికి జావేద్ ‘అలాంటప్పుడు నన్ను వదిలేసి నీ జీవితం నువ్వు చూసుకో, ఎందుకు ఇన్ని సార్లు పంచాయితీ పెడుతున్నావు’ అన్నాడు. దానికి మేము ‘జావేద్ నువ్వు రెండో పెండ్లి చేసుకొని తప్పు చేయడమే కాకుండా మళ్లీ ఆమెదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. అయినా మాట్లాడితే మా ఇస్లాం చెప్పింది, నేను చేసుకున్నాను అంటున్నావు.
ఇస్లాం అసలు ఏం చెప్పిందో నీకు తెలుసా? రెండో పెండ్లి చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందు వాటి గురించి తెలుసుకో. భర్త రెండో పెండ్లి చేసుకోవాలంటే కచ్చితంగా మొదటి భార్య అనుమతి తీసుకోవాలి. లేదంటే మొదటి భార్య అనారోగ్యమో, ఫిజికల్‌గా దూరంగా ఉండడమో, పిల్లలు కలగక పోవడమో ఇటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. కానీ మీ విషయంలో ఈ కారణాలు ఏమీ కనిపించడం లేదు. నువ్వు తప్పు చేసి నీ భార్యనే దబాయించి మాట్లాడుతున్నావు. నీపై కేసు పెట్టే హక్కు ఫాతిమాకు ఉంది. అయినా భర్త అనే ప్రేమతో ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలని తన ప్రయత్నాలు తాను చేస్తుంది. ఇవేవీ అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు’ అని గట్టిగా మాట్లాడాము.
అయితే ఫాతిమా మాత్రం ‘లేదు మేడం, నాకూ ఆత్మాభిమానం వుంది. జావెద్ నన్ను వద్దు అనుకుంటే అతనితో బలవంతంగా కలిసి బతకడం నా వల్ల కాదు. ఒకసారి ప్రేమించి తప్పు చేశాను. ఇప్పుడు ఇష్టం లేదంటున్న వాడితో కలిసి జీవించాలని మొండిగా మాట్లాడి మరో తప్పు చేయదలచుకోలేదు. నా పిల్లలను నేను చూసుకోగలను. ఎం.కాం చేశాను. పిల్లల కోసం నా కెరీర్ వదులు కున్నాను. ఇప్పుడు మళ్లీ నా పిల్లల కోసం, ఆత్మాభిమానంతో బతకడం కోసం జాబ్ చేస్తాను. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాను. ఇక అతనితో నేను కలిసి ఉండలేను. అతను నన్ను వదిలేయడం కాదు, నేనే అతన్ని మీ సమక్షంలో వదిలేస్తున్నాను. ఆయనకు నచ్చినట్టు బతకమనండి’ అంది.
ఫాతిమా అంత ధైర్యంగా, కచ్చితమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కూడా ఆమెకే సపోర్ట్ చేశాము. కానీ జావేద్‌లో మాత్రం తప్పు చేశాను అనే బాధ అస్సలు కనిపించలేదు. ఏ మతమైనా మహిళలను కించపరచమని, చిన్నచూపు చూడమని చెప్పదు. ఎవరైనా అహం తగ్గించుకొని ఎదుటి వారి భావాలను అర్థం చేసుకోవాలి. కానీ జావేద్‌లో అది కొంచెం కూడా కనిపించలేదు. మగాళ్లి అనే అహంకారం మాత్రం అతని నిలువెల్లా ఉంది. ‘భార్య, పిల్లలకు ప్రేమ, గౌరవం, విలువ ఇవ్వని వాడు నాకు మాత్రం ఎందుకు’ అని కొంత కాలానికి రెండో భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఫాతిమా మాత్రం ఉద్యోగంలో చేరి పిల్లలతో సంతోషంగా ఉంటుంది.
చివరకు జావెద్ దిక్కులేని వాడిలా మిగిలిపోయాడు. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలన్నీ దాదాపుగా ఒకేలా వుంటాయి. ఇక లింగ వివక్ష, గృహహింస, నిర్ణయాధికారం లేకపోవడం వంటి సమస్యలకు కులం, మతం, ప్రాంతంతో సబంధం లేదు. దాదాపు ప్రతి మహిళా తన జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే కొందరు మగాళ్లు మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. పైగా తాము చేసిందే సరైనదన్నట్టు బూకాయిస్తుంటారు. అలాంటి ఓ సమస్య గురించే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చదువుదాం…
ఫాతిమాకు ఇంట్లో పని చేయడం రాదు. పైగా ఎప్పుడూ వాళ్ల పుట్టింట్లోనే ఉంటుంది. భర్తగా నా అవసరాలు ఏమీ పట్టించుకోదు. నా మాట అస్సలు లెక్క చేయదు. ఆమె ఇంత చేస్తున్నా ప్రేమించి పెండ్లి చేసుకున్నాను కాబట్టే భరిస్తున్నాను. లేకపోతే ఎప్పుడో వదిలేసే వాడిని.
నువ్వు లేకుండా నేను ఉండలేననుకోవడం నీ మూర్ఖత్వం. నీకు మగాడిని అనే అహంకారం ఎక్కువ. రెండో పెండ్లి చేసుకొని కూడా నా తప్పు లేదు అంటున్నావు. నీ దయాదాక్షిణ్యాలపై నేను ఆధారపడి బతకాలని నీ ఉద్దేశం. నాకు ఆ అవసరం లేదు. ఇలా మాటలు పడుతూ నీతో బతకడం కంటే ఉద్యోగం చేసి నా బతుకు నేను బతుకుతాను’ అంది.
- వై వరలక్ష్మి,
9948794051



