– ‘ఉపాధి’ ఉద్యోగులకు మళ్లీ అందని జీతాలు
– పెండింగ్‌లో మూడు నెలలు వేతనాలు
– 3,874 మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఎదురుచూపులు
– కుటుంబ పోషణ, ఈఎంఐ భారాలతో మానసిక ఒత్తిడికి గురి
– పాలకుర్తిలో గుండెపోటుతో ఏపీవో కె.శ్రీనివాస్ మృతి
– ఈ మధ్య కాలంలోనే పదుల సంఖ్యలో చనిపోయిన ఉద్యోగులు: ప్రతి నెలా జీతాలిచ్చేలా చూడాలని మంత్రి సీతక్కకు వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన దేవరుప్పల ఏపీవో కమ్మగాని శ్రీనివాస్‌గౌడ్.. ‘మూడు నెలల నుంచి జీతం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను’ అని కొడకొండ్ల ఏపీఓతో ఆదివారం రాత్రి తన ఆర్థిక కష్టాలను మొరపెట్టుకున్నాడు. కుటుంబ సాదకబాధకాలను పాలుపంచుకున్నాడు. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలోనూ అవే ఆలోచనలతో గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డునపడ్డది. ఉపాధి ఉద్యోగులంతా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఆందోళనకు దిగిన పరిస్థితి. ఈయనే కాదు ఉపాధి హామీ చట్టంలో భాగంగా రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా పర్మినెంట్ కాక… వచ్చే అరకొర వేతనం కూడా నెలల తరబడి అందక…ఓవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు ఆర్థిక కష్టాలు వెరసి ఆ ఉద్యోగులు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఆ చట్టంలో భాగంగా పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులు చనిపోవడం బాధాకరం.
ఉపాధి హామీ చట్టంలో భాగంగా రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 3,874 మంది ఉద్యోగులు దాదాపు 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. వీరంతా ఉపాధి హామీ కూలీలతో పనులను చేయించడంలో, బిల్లింగ్ చేయడంలో, కూలీలకు వేతనాలు అందించడంలో జరిగే అన్ని ప్రక్రియల్లోనూ పాలు పంచుకుంటారు. ఉపాధి
హామీ పనులను క్రమం తప్పకుండా చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు ఎక్కువ నిధులను రప్పించడంలో వీరే కీలక భూమిక పోషిస్తున్నారు. ఉపాధి హామీ పనులు, హరితహారం, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మల్బరీ తోటల పర్యవేక్షణ, నర్సరీల నిర్వహణ, ఇలా 220 రకాల పనులను పర్యవేక్షిస్తున్నారు. 16 శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చట్టం ఏర్పడినప్పటి నుంచి పనిచేస్తున్న తమకు ఏనాడైనా పర్మినెంట్ కాకపోతుందా అన్న ఒకేఒక్క చిన్న ఆశతో వారు పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వమేమో వారికి నెలనెలా వేతనాలివ్వకుండా తిప్పలు పెడుతున్నది. ఎప్పుడు చూసినా నెలల తరబడి జీతాలను పెండింగ్‌లో పెడుతున్నది. మంత్రి సీతక్కకు, కనిపించిన ఉన్నతాధికారులకల్లా మొరపెట్టుకుంటే ఏప్రిల్ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇవ్వడం మానేసింది. మళ్లీ మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో ఆ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు పడుతున్న వ్యథలు అన్నీఇన్నీ కావు. జీతాలు అందకున్నా..అప్పులు చేసుకుని మరీ బతుకులు వెళ్లదీస్తున్నారు. దాదాపు 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమను రాష్ట్ర సర్కారు ఎప్పటికైనా పర్మినెంట్ చేయకపోతుందా? అనే చిన్న ఆశతో కష్టనష్టాలకోరుస్తూ నెట్టుకొస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ పీఆర్‌సీ అమలుచేసి జీతాలు పెంచుతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం పీఆర్‌సీ అమలు చేసింది. అయితే ఉపాధి సిబ్బంది విషయంలో మాత్రం ఇంకా ప్రకటన చేయకపోవడంతో ఉపాధి హామీ చట్టంలో భాగంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. వారికి ఆరేండ్లుగా పైసా జీతం పెరగలేదు. ఒకవైపు అరకొర జీతం, అదీ సకాలంలో అందకపోవడంతో వారు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. గుండెపోట్లు, ఇతర అనారోగ్య సమస్యలకు అది దారితీస్తున్నది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోట్లు, అనారోగ్య సమస్యలతో ఇటీవలి కాలంలో 15 మందికిపైగా ఉద్యోగులు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. అందులో ఆరుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు సీఓలు, ఇద్దరు అటెండర్లు, ఒక ఏపీడీ, ఒక అడిషనల్ పీఓ, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. తమ దీని స్థితి గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని జేఏసీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేద్దామంటే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో అన్న భయంలో వారున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలిప్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క)ను చేతులెత్తి వేడుకుంటున్నారు.
మూడు నెలలకోసారి జీతమిస్తే బతికేదెట్టా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES