- – బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద కాలువలను తవ్వకుండా వదిలేశారు
– చెరువులు కుంటలు నింపడానికి అసంపూర్తి కాలువలు వెంటనే పూర్తి చేయాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి.తుమ్మల వీరారెడ్డి డిమాండ్
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అసంపూర్తి కాలువలను పరిశీలించిన బృందం - నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
- 18 సంవత్సరాలు గడిచిన బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని అసంపూర్తిగా వదిలేసిన కాలువలను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామం లో అసంపూర్తిగా వదిలేసిన కాలువలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బృందం పరిశీలించారు .
- ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టులను పూర్తి చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని గాలి మోటార్ లో తిరుగుతున్నారని అన్నారు. శ్రీశైలం స్వరంగ మార్గం పూర్తి చేస్తామని కనీసం చనిపోయిన శవాలను కూడా బయటకు తీయలేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. బి వెల్లంల ప్రాజెక్టు కేవలం పర్యాటక కేంద్రంగా మారే పరిస్థితి ఉందని ప్రాజెక్ట్ క్రింద కాలువలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసమర్థత వల్లనే కాలువలు పూర్తి కావడం లేదని దుయ్యబట్టారు.
- ప్రాజెక్టులకు కాలువలకు డబ్బు లేదనే సాకు సరికాదని తమకు ఇష్టమైన వాటికి నిధులు కేటాయిస్తూ రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు ఎస్ఎల్బీసీ క్రింద ఉన్న అనేక కాలువలకు నిధులు కేటాయించకుండా పిల్ల కాలువలను వదిలేశారని కేవలం చెరువులు కుంటలు నింపడానికి మాత్రమే ప్రాజెక్టు పనికొచ్చే విధంగా చేశారని అన్నారు వెంటనే పిల్ల కాలువలు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నిరంధించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు ఇదే పరిస్థితి కొన సాగితే భవిష్యత్తులో ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ బి వెల్లంల ప్రాజెక్టు క్రింద నల్లగొండ మండలంలో చెరువులు కుంటలు నింపడానికి అవసరమైన పిల్ల కాలువలను రోడ్ల వెంట మాత్రమే తీసి మధ్యలో వదిలేయడం ఏమిటని ప్రశ్నించారు. వర్షాలు అధికంగా పడడంతో సాగర్ నీళ్లు సముద్రం పాలవుతున్న ఆ నీటిని నల్లగొండ జిల్లా రైతాంగానికి అందించడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రామాలలో కాలువల వద్దకు వచ్చి రైతులతో మాట్లాడితే పరిస్థితి అర్థం అవుతుందని కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని సమీక్ష చేస్తే ఏమి తెలుస్తుందని అన్నారు.
వెల్లంల ప్రాజెక్టు పరిసర గ్రామాల . రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వెంటనే కాలువలను పూర్తి చేయకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని రైతులు హెచ్చరించారు. కాలువల పూర్తి చేయడానికి సిపిఐ ఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న,బొల్లు రవీందర్, మచ్చా యాదయ్య, గ్రామ ల రైతులు మచ్చ యాదయ్య, పందుల బిక్షం, దొడ్లపాటి ప్రతాపరెడ్డి, నాంపల్లి యాదయ్య, ఈర్ల నాగేష్, పీర్ల రాంబాబు, దొడ్లపాటి నర్సిరెడ్డి, దైద భూషణ్ రెడ్డి, కాసర్ల రమాశంకర్, ఎరకలి నరసింహ పాల్గొన్నారు.