– బాధితులకు వ్యయ ప్రయాసల నుంచి ఉపశమనం
– ‘ఎంఎన్‌జే’కు తగ్గనున్న రోగుల తాకిడి
– గ్రేటర్‌లో మూడు సెంటర్ల ఏర్పాటుకు ఛాన్స్!
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నేపథ్యంలో జిల్లా ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి (హైదరాబాద్), మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి (మేడ్చల్- మల్కాజిగిరి), కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రి(రంగారెడ్డి)లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో 3 క్యాన్సర్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ‘ఎంఎన్‌జే’ క్యాన్సర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గడంతోపాటు రోగుల తాకిడి కూడా తగ్గనుంది.
క్యాన్సర్ చికిత్సకు కేరాఫ్ ‘ఎంఎన్‌జే’
నగరంలోని ‘ఎంఎన్‌జే’ హాస్పిటల్ క్యాన్సర్ చికిత్సలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద సర్కార్ క్యాన్సర్ సెంటర్ కూడా ఇదే. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతిరోజూ ఇక్కడికి వందలాది మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఒక్కోసారి ఓపీ కోసం నిలబడేందుకు స్థలం కూడా దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తిరిగి ఇంటికి వెళ్లడానికి అనే ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం వైద్య సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తుంది. జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
సిబ్బందికి శిక్షణ పూర్తి
జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడే కీమో థెరఫీ యూనిట్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి ఆయా ఆస్పత్రుల సిబ్బందికి ఎంఎన్ వైద్యులతో శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. క్యాన్సర్‌ను గుర్తించడం, అవసరమైన మేరకు చికిత్సలు అందించడం, ప్రమాదకరమైన, అత్యవసర సేవలకు ‘ఎంఎన్‌జే’కు రెఫర్ చేసే విధంగా జిల్లా ఆస్పత్రుల్లోని క్యాన్సర్ కేంద్రాలు పని చేయనున్నాయి. ‘ఎంఎన్‌జే’ హాస్పిటల్‌కు వచ్చిన రోగులను సైతం అవసరమైన పరీక్షలు నిర్వహించి చిన్నచిన్న చికిత్సల కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకే రెఫర్ చేయనున్నారు.
రొమ్ము క్యాన్సర్‌కు కేరాఫ్ హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ నగరం రొమ్ము క్యాన్సర్‌కు కేరాఫ్‌గా మారుతోంది. దేశంలోనే నగరం మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నరు నగరాలు ఉన్నాయి. దేశంలో ప్రతి ఏటా నమోదవుతున్న 7 లక్షల క్యాన్సర్ కేసుల్లో మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్‌లో దేశంలోనే అత్యధికంగా గ్రేటర్ పరిధిలోనే నమోదవుతున్నాయి. చిన్నపిల్లల క్యాన్సర్లు (14 ఏండ్లలోపు) కేసులు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు క్యాన్సర్ కేంద్రాలు అందుబాటులోకి రానుండటంతో మెరుగైన చికిత్స అందుతుందని ప్రజలు భావిస్తున్నారు.
‘ఎంఎన్‌జే’పై తగ్గనున్న ఒత్తిడి
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో రోజుకు సుమారుగా 600-1000 వరకు ఓపీ నమోదవుతోంది. స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ ఏ స్థాయిలో ఉంది.. వారికి ఏ రకమైన చికిత్స అందించాలనేది నిర్ణయించడానికి కనీసం 4-7 రోజుల సమయం పడుతోంది. ఈ సమయంలో బాధితులు అక్కడే ఉండలేక, ఇంటికి వెళ్లి మళ్లీ రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు కీమో థెరపీ చేయించుకోవడానికి పెద్ద జాబితానే ఉంటోంది. కొంతమంది వారం వారం నగరానికి వచ్చి కీమోథెరఫీ చేయించుకుని తిరిగి వెళ్లాలంటే డబ్బులు ఖర్చు, ప్రయాణాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆపరేషన్ అవసరమైన వారు 15 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు సర్కార్ ఎక్కడికక్కడే జిల్లాల్లోనే క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
జిల్లా ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ కేంద్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



