కాన్సర్ అంటే గ్రీకు భాషలో పీత అని అర్థం! మానవ శరీరంలో కాన్సర్ అంటే ప్రాణాంతకమైన కణితి!!! మరి ఇది ఏ విధంగా మనిషి శరీరంలో సంభవించే ఒక ప్రాణాంతక పరిస్థితిని సూచించే పదంగా మారింది?
మన ప్రాచీన వైద్యశాస్త్రవేత్తలు, వారు అప్పట్లో గమనించిన కణితి, గట్టిగా, ఉబ్బినట్టుగా ఉండి, పైన పాకే రక్తనాళాలతో, చూడడానికి పీత లాగా కనిపించడంతో, దానికి కాన్సర్ అని పేరు పెట్టడం జరిగినట్టుగా మెడికల్ చరిత్ర సూచిస్తుంది. ఆ పేరే దానికి స్థిరపడిపోయింది.
ఎవ్వరికైనా, వారి ఆత్మీయులకు కాన్సర్ ఉన్నదని తెలిసిన క్షణంలో అది శరీరంలో ఎక్కడ, ఏ స్టేజ్‌లో ఉన్నదీ తెలుసుకునే ప్రయత్నం కంటే ముందు ‘క్యాన్సరా?’ అన్న భావనతో షాక్ తిన్నట్టయి, ఒక క్షణం స్తబ్దత, నిశ్చేష్టత కలగక మానదు.
కుటుంబంలో ఏ ఒక్కరు, ఎటువంటి కాన్సర్ బారిన పడినా, మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా అందరినీ కృంగతీసే శారీరిక స్థితి ఇది.
కాన్సర్ ఎందుకు వస్తుంది?
2025 గణాంకాలు, కొన్ని అధ్యయనాల అనుసారం ప్రపంచ వ్యాప్తంగా 18.6 మిలియన్ల కాన్సర్ పేషెంట్లు మతి చెందినట్టు వెల్లడైంది.
వైద్య బృందాలు, శాస్త్రవేత్తలు, కారణాలను వెదికి, వాటి నిర్ములన దిశగా ప్రయత్నాలు కొనసాగించకపోతే, భవిష్యత్తులో ఈ సంఖ్య గణనీయంగా పెరగవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
కారణాల్లో ముఖ్యమైనవి- జన్యు పరమైనవి- మ్యుటేషన్స్ అంటారు. ఇవి జన్మతః ఉండవచ్చు. మద్యపానం, పొగతాగడం, జర్దా నమలడం వంటి అలవాట్లు, అల్సరేటివ్ కోలైటిస్ వంటి పేగులకి సంబంధించిన కొన్ని జబ్బులు, జీవన శైలి, ఆహారపరంగా ఫాస్ట్‌ఫుడ్లలో వాడే రసాయనాలు, కొన్ని రకాల అంటువ్యాధులు, శారీరక స్తబ్దత, డ్రగ్స్, ఊబకాయం, వత్తిపరంగా హానికరమైన జీవసంబంధ పదార్థాలు, రసాయనాల, పర్యావరణపరంగా శబ్ద తీవ్రత, వేడి, సూర్యరశ్మి, పొగ, న్యూక్లియర్ రేడియేషన్ పదార్థాలకు గురి కావడం-ఇటువంటివే తరచుగా తటస్థపడే కారకాలు.
కాన్సర్ ఎలా వృద్ధి చెందుతుంది?
శరీరంలోని అన్ని అవయవాలు కణసముదాయాలు. సామాన్యంగా కణాలు నిరంతరంగా, ఒక ప్రణాళికానుసారంగా, ప్రత్యేక పద్ధతిలో విభజన చెందుతుంటాయి.
పైన పేర్కొన్న ఒకటి/ అంతకు మించిన కారణాల వలన ప్రణాళికను ఉల్లంఘించి, కణాలు గజిబిజిగా ఎప్పుడైతే విభజించడం మొదలుపెడతాయో, అప్పుడు ఆ కణసముదాయం కాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది. ఆ క్రమంలో కణాల్లో జరిగే మార్పులని కార్సినోజెనిక్ మార్పులు అంటారు. ఒకసారి అలా మార్పు చెందిన తరువాత ఆ కణాల పనితీరు మారిపోతుంది. వీటి మెడికల్ టెర్మినాలజీ ‘మెలిగెంట్ ట్యూమర్స్’.
ప్రాణాంతకం కానటువంటి కణితులు కూడా శరీరంలో ఎన్నో చోట్లలో పెరగవచ్చు. అవి పెద్దగా హాని చేయవు. కానీ వాటి సూచికలు కాన్సర్ లాగే అనిపించడం వలన నిపుణులను సంప్రదించ వలసి వస్తుంది. పరీక్షల ద్వారా వాటిని ‘బినైన్ ట్యూమర్లు’గా గుర్తిస్తారు.
శరీరంలోని ఏ కాణాల్లోనైనా కాన్సర్ మార్పులు జరగవచ్చా?
మదులాస్థి (కార్టిలేజ్) కణాల్లో, గుండెకు సంబంధించిన కొన్ని కణాల్లో, కొన్ని నరాల్లో, కొన్ని రకాల కండరాలను మినహాయించి శరీరంలోని అన్ని కణజాలాలు కాన్సర్ మార్పులకు గురి కావచ్చు. మూల కారణాలకు అనుకూల పరిస్థితులు తోడైతే ప్రకటితమౌతాయి.
ఉదాహరణకు, జన్యుపరంగా వచ్చే అవకాశమున్న పెద్దపేగు కాన్సర్ ఒక కుటుంబంలోని వారందరికీ రాకపోవచ్చు; ఆహారపు అలవాట్లు సరిగా లేని సభ్యుల్లో మాత్రమే ప్రకటితమవ్వచ్చు. అదే విధంగా రొమ్ము, ఓవరీయన్ క్యాన్సర్లు కూడా జన్యుపర కారణాలు మూలమైతే, దానికి ఒత్తిడి వంటి జీవన శైలి సంబంధిత కారకాలు తోడైతే కాన్సర్‌కి దారితీయవచ్చు.

కాన్సర్ సూచికలు:
ఆరంభదశలో ఎటువంటి సూచికలు ఉండకపోవచ్చు. ఉన్నా, వాటిపై దష్టి పెట్టేటంత తీవ్రత లోపించవచ్చు. మాములు అస్వస్థతగా పరిగణించవచ్చు.
కానీ, కొన్ని కార్డినల్ సైన్స్ అనబడే సూచికలు ఉన్నాయి. అకారణంగా ఆకలి కాక పోవడం, నీరసం, బరువు తగ్గటం, కొద్దిపాటి శ్రమకే తీవ్ర అలసట కలగటం, విశ్రాంతి తరువాత కూడా అలసట కొనసాగటం, మందులతో తగ్గని, మళ్ళీ మళ్ళీ తిరగబెట్టే జ్వరము, తీవ్ర రక్తస్రావం, మలంలో, మూత్రంలో రక్తం, చర్మంలో మార్పులు, కణితులు, కొత్తగా మచ్చలు, ఉన్న మచ్చలు పెరగడం, నలుపురంగులోకి మారడం, శరీరంలో పలు చోట్ల మందుతో తగ్గని, భరించలేని నొప్పి, గొంతులో మార్పు, దగ్గు, విరేచనాలు… ఇలా మందులకు లొంగకుండా కొంతకాలంగా బాధపెడుతుంటే, చికిత్స తీసుకొన్న తరువాత కూడా ఇవే సూచికలు వస్తూనే ఉన్నట్లయితే అవి ఎర్ర జెండాలే! తప్పక వైద్య నిపుణులను సంప్రతించాలి!
ఈ సూచికలు కాన్సర్‌కి మాత్రమే పరిమితం కావు. ఇతర మాములు అనారోగ్యాన్ని కూడా సూచిస్తాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయించుకోవాలి.
కాన్సర్ నిర్ధారణ?
సూచికలు, శారీరక తనిఖీని బట్టి వైద్య నిపుణులు సంబంధిత కొన్ని ముఖ్యమైన స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తారు.
మమ్మోగ్రఫీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్, ఎండోస్కోపీ, బయాప్సీ, ట్యూమర్ మార్కెర్స్, పాప్ స్మియర్స్, ఫ్లో సైటోమెట్రీ-ఇలా ఎన్నో రకాల కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మరింకెన్నో రకాల అధునాతనమైన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అవసరాన్ని బట్టి కాన్సర్ నిర్ధారణ కొరకు నిపుణులు వినియోగియించుకొంటారు.
ఆడవారు ముందస్తు జాగ్రత్త చర్యగా మమ్మోగ్రఫీ ప్రతి సంవత్సరానికి ఒకసారి తప్పకుండ చేయించుకోవాలి.
కాన్సర్ దశలు; చికిత్స పరంగా ఉపయోగం
సాధారణంగా కణితి పరిమాణం, పెరుగుదల, స్థావరం, ఎంతవరకు/ ఎక్కడివరకు పాకిందన్నదాన్ని బట్టి, ముఖ్యంగా కాన్సర్ శరీరంలో ఎంతవరకు వ్యాప్తి చెందిందన్న దాని బట్టి నాలుగు దశలుగా విభజించి, తదనుగుణంగా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు.
మొదటి దశలో మార్పులు అవయవాల్లో కొన్ని కణాల సమూహానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. కాబట్టి స్థిరమైన సూచికలు ఉండకపోవచ్చు. కానీ ఈ దశలో నిర్ధారణ చేయగలిగితే, శస్త్ర చికిత్సకి చాల సానుకూలమౌతుంది. కాన్సర్ పురోగమించకుండా ఆపడం సులువౌతుంది.
రెండవ దశలో కాన్సర్ కణాల సంఖ్య చాలా వద్ధి చెంది, అవయవాన్ని కబళించే స్థాయిలో ఉండవచ్చు. ఈ దశ కూడా చికిత్సకు లొంగవచ్చు. కొన్ని రకాల కాన్సర్ కొరకు శస్త్ర చికిత్సతో పాటు కీమోథెరపీ అవసరం పడవచ్చు.
మూడు, నాలుగు దశల్లో, కాన్సర్ కణాలు అవయవం నుండి బయటకు వ్యాప్తి చెంది, రక్తప్రవాహం ద్వారా దూరంగా ఉన్న అవయవాలకు చేరవచ్చు; కాన్సర్ చికిత్స క్లిష్టతరమై, పలురకాల చికిత్సలు అవసరమవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ చికిత్సకు కూడా లొంగకపోవచ్చు.
చికిత్స?
రెండు రకాలు :సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్మ్యూనోథెరఫీ, బోన్మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, పెయిన్ మానేజ్మెంట్, న్యూట్రిషన్, ఎమోషనల్, సైకో- సొషల్ సపోర్ట్, పునరావతం నివారణ చర్యలు చేపట్టడం వంటి వివిధరంగాల మేళవింపు కంప్రెహెన్సివ్/ సమగ్ర/ విస్తత చికిత్స.
టార్గెటెడ్ థెరపీ, ఫోటోడైనమిక్ థెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్ వంటివి అత్యధునాతనమైన పురోగమ చికిత్స పద్ధతులు.
కాన్సర్ వృద్ధి చెందిన అవయవం, కణితి పరిమాణం, దశ, రోగి స్థితి వంటి కొన్ని కారకాలను పరిగణలోకి తీసుకొని నిపుణులు చికిత్స విధానాన్ని ఎన్నుకుంటారు.
రోగికి, వారి ఆత్మీయులకు కాన్సర్ నిర్ధారణ ఎంత ఆందోళనజనితమో, దాని చికిత్స అంతకన్నా భయాందోళనలు, ఒత్తిడి కలిగిస్తాయి. కాన్సర్ చికిత్సలో కణాలను ధ్వంసం చేయడం, అవి పునర్జీవం పోసుకోకుండా చేయడం ఎంత కీలకమో అంతే ముఖ్యమమైనది రోగి మానసిక ఆరోగ్య సంరక్షణ.
ఇతర జబ్బుల వల్ల వచ్చే కష్టాలన్నీ కాన్సర్ కష్టాల ముందు దిగదుడుపే!
అందుకే, కాన్సర్ జనిత అల్లకల్లోలాలను పరిగణలోకి తీసుకొని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవగాహనతో, రాజకీయ మద్దతుతో, ఆరోగ్య నిపుణులు, ‘యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కాన్సర్ కంట్రోల్’ వంటి పలు ప్రత్యేక సంస్థలనూ, ఆరోగ్య బృందాలనూ స్థాపించడమే కాకుండా, ‘యునైటెడ్ బై యూనిక్’ వంటి నినాదాలను, కాన్సర్ అవేర్నెస్ రంగులు, రిబ్బన్లు, దుస్తులు, పచ్చబొట్లు వంటి వినూత్న పద్ధతుల్లో కాన్సర్ బారిన పడిన వారికే కాకుండా, వారికి సేవనందించేవారిలోనూ ఉత్సాహం నింపే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉంటారు.
అంతే కాక, కాన్సర్ బారిన పడిన వారికి ఉల్లాసం కలిగించే విధంగా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు సమాజం కూడా దోహదపడే విధంగా ఎన్నో ఫౌండేషన్లు, ఎన్‌జీఓలు పాటుపడుతున్నాయి. వారికి మనమూ ‘నేను సైతం’ అనుకుంటూ చేయూతనివ్వాలి!!!
డాక్టర్ మీరా,
రిటైర్డ్ ప్రొఫెసర్ అఫ్ మైక్రోబయాలజీ,
ఫీవర్ హాస్పిటల్ / ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్.



