– నల్లగొండలో విచ్చలవిడిగా క్రయవిక్రయాలు
– ఒక్కో ప్యాకెట్ రూ.500 చొప్పున అమ్మకం
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత.. గంజాయి మత్తులో చిత్తవుతోంది. సరదాగా మొదలవుతున్న గంజాయి అలవాటు వ్యసనంగా మారుతోంది. నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిషాలో తూగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పై చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన యువత గంజాయి వినియోగంతో జీవితాలను అగాధంలోకి నెట్టుకుంటోంది. గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా వాస్తవరూపం దాల్చడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరఫరా జరుగుతూనే ఉంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ పట్టణంలో 2 టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జులై 14న గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా.. 1టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరుగురు విద్యార్థులను అదుపులో తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
కఠిన చర్యలు తీసుకోక పోవడం వల్లే..
ఎన్టీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టాన్సెస్) చట్టం ప్రకారం.. గంజాయి కిలో అంతకంటే తక్కువ పరిమాణంతో పట్టుబడితే.. ఆ వ్యక్తిని వినియోగదారుగా పరిగణిస్తూ చట్టంలోని 26, 27 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో నేరాభియోగం తక్కువగా ఉండటంతో బెయిల్ వెంటనే లభిస్తోంది. గంజాయితో పట్టుబడినా పెద్ద సమస్య లేకుండా బయటకు వస్తున్నామని భావించే కొందరు మళ్లీ అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు కళాశాలల విద్యార్థులూ అందులో ఇరుక్కుంటున్నారు.
కమీషన్ల ఎర!
నెట్‌వర్క్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న గంజాయి స్మగ్లర్లు.. సరుకు రవాణా కోసం కమీషన్ల ఆశ చూపి.. అమాయకులను ఈ దందాలోకి లాగుతున్నారు. ప్రధానంగా కళాశాలల విద్యార్థులను అందుకోసం ఎంపిక చేసుకుంటున్నారు. రహస్యంగా గంజాయి తీసుకొస్తే కమీషన్ ముట్టజెబుతున్నట్టు సమాచారం. రెండ్రోజుల కిందట నల్లగొండ పట్టణ శివారులో ఆరుగురు విద్యార్థులు గంజాయి తాగుతూ పోలీసులకు దొరకగా.. వారిలో ఒకరు విక్రయించేవారు, మరొకరు కొత్తగా అలవాటు చేసుకున్న వ్యక్తి ఉండటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అడపాదడపా గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోవడం తప్పితే.. ఆ దందా వెనకున్న బడా వ్యాపారుల పై పోలీసులు దృష్టిపెట్టడం లేదన్న విమర్శ లున్నాయి. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? రవాణాకు సహకరిస్తున్నది ఎవరు? అన్నది గుర్తిస్తేనే పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడే అవకాశముంది. అసలు మూలాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు పెరిగితేనే అమాయక యువత, విద్యార్థులు, ప్రజలు మత్తు బారినపడకుండా ఉండే అవకాశముంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి తీసుకొచ్చే వారిని గుర్తించడంతోపాటు స్మగ్లర్ల గొలుసు కట్టును తెగ్గొట్టాల్సి ఉంది.
పట్టణంలో మత్తు వ్యాపారం ఇలా..
గంజాయికి అలవాటు పడుతున్న యువత, విద్యార్థులు హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కొనుగోలు చేస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆరు నెలలుగా హైదరాబాద్, ధూల్‌పేట, సికింద్రాబాద్, గుంటూరు, దామరచర్లలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కిలో రూ.10వేల చొప్పున కొనుగోలు చేసి ఆ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నల్లగొండలో ప్యాకెట్ రూ.500 చొప్పున అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల విద్యార్థులు సైతం నల్లగొండ కేంద్రానికి వచ్చి కొనుగోలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
గంజాయి పట్టివేత..
జనవరి 2025 నుంచి జులై 28 వరకు జిల్లాలో మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. 26 మందిని అరెస్టు చేసి 14 కిలోల 65 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. గంజాయితోపాటు గంజాయి చాక్లెట్లు, 2304 టాబ్లెట్లు సైతం లభించడం ఆందోళనకు గురిచేస్తోంది. 30 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతాం
మత్తు పదార్థాలను సేవించడం, క్రయవిక్రయాలు జరిపే వారిపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి సేవించడం ద్వారా శరీరంలో మానసిక మార్పులు వస్తాయన్న అపోహతో చాలామంది విద్యార్థులు అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి అపోహలకు పోకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలి. నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కోసం మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాలకు అలవాటు పడిన అనేక మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకొచ్చాం.
– జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్
గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి
గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. మత్తు పదార్థాలపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరముంది. యువత పెడదారి పట్టకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
– డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
గంజాయి మత్తు.. యువత చిత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES