Saturday, October 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబువ్వ పెట్టలేం..ఖర్చు భరించలేం..?

బువ్వ పెట్టలేం..ఖర్చు భరించలేం..?

- Advertisement -

మూడేండ్లుగా అందని నిధులు
ఇక పాఠశాలలు నడపలేమంటున్న యాజమాన్యాలు
క్లాసులో కొనసాగలేక.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక..
నెలల తరబడి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
పాఠశాల్లోకి విద్యార్థులను అనుమతించని వైనం
రాష్ట్రంలో బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల తీరిది

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌, మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధులు
”ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు బువ్వ పెట్టలేం.. వారి ఖర్చులనూ భరించలేం” అని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వంతో కరాఖండిగా చెప్పేస్తున్నాయి. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 237 ప్రయివేటు పాఠశాలలను బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో పేదలైన ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించింది. వారికయ్యే భోజనం, వసతులతో పాటు స్కూల్‌ ఫీజులు భరించేందుకు సిద్ధపడింది. కానీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన నిధులు ఆయా పాఠశాలలకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలకు రావద్దంటు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. కలెక్టర్‌, డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో (బీఏఎస్‌) ఉచితంగా విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా 1 నుంచి 5వ తరగతుల్లో విద్యార్థులను ఎంపిక చేస్తుంది. 1వ తరగతిలో చేరితే 10 వరకు డే స్కాలర్‌ కింద చదువుకోవాలి. 5వ తరగతిలో చేరితే గురుకుల పద్ధతిలో పదో తరగతి వరకు అదే పాఠశాలలో చదవాలి. డే స్కాలర్‌కు రూ.28 వేలు, గురుకుల పద్ధతికి రూ.42 వేలు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి చెల్లిస్తుంది. అలాగే ఇంటర్‌ రెండేండ్లకు గానూ రూ.1.25లక్షలు చెల్లిస్తోంది. కాగా, గత రెండు, మూడేండ్లుగా బీఏఎస్‌ పాఠశాలకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాలకు రెండు విడతల నిధులు, 2025-26 సంవత్సరానికి మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ పెట్టింది.

అయినా పాఠశాలల యాజమాన్యాలు.. ఓపక్క అప్పులు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్య, నోట్‌ బుక్స్‌, హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తున్నాయి. మరోపక్క నిధుల కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూనే వస్తున్నాయి. కానీ ప్రభుత్వం నేటికీ నయా పైసా విడుదల చేయలేదు. దాంతో విద్యార్థులకు బువ్వ పెట్టలేమని, చదువు చెప్పలేమని, ఖర్చులు భరించలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో కొంత ఫీజులు కట్టాలని, లేకపోతే ఇక పాఠశాలలను కొనసాగించలేమని విద్యార్థులను ఇంటింకి పంపించేస్తున్నారు. అంతా ఫ్రీ అనుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్థం కాక స్కూల్‌ యాజమాన్యాలతో చర్చించినా ప్రయోజనం లేకపోవడంతో విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఆరు నెలల్లో పది రోజులే పాఠశాలకు
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ఉచిత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు కొందరు పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా కేవలం 10-15 రోజులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారని తెలుస్తుంది. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ పాఠశాల ఫీజు, రెసిడెన్షియల్‌ ఖర్చులతోపాటు యూనిఫామ్స్‌, బూట్లు, సాక్సులు, నోటు, టెక్స్ట్‌ పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది విద్యార్థులే ఈ ఖర్చులన్నీ భరించాలని యాజమాన్యాలు ఆదేశించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులంతా పాఠ్యపుస్తకాలు కొనలేని పరిస్థితి దాపురించింది. పుస్తకాలు లేని కారణంగా క్లాస్‌రూమ్‌లో తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురవుతున్నామని భావించిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడమే మానేశారు. ఈ దుస్థితిపై జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవట్లేదు.

దసరా సెలవుల నుంచి ఇంటికే పరిమితం
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న 30 బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 7వ తేదీన సమావేశం నిర్వహించి విద్యార్థులను పాఠశాలలకు రానివ్వమంటూ తీర్మానం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 11.47కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కాగా దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులను తిరిగి పాఠశాలలు పున:ప్రారంభమైన తర్వాత పాఠశాలల్లోకి రానివ్వమని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి విద్యార్థులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. దాంతో పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు పాఠశాలకు రాకుంటే ఎలా చదువుకునేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవ తరగతి విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలల్లోకి రానివ్వకపోవడంతో చదువుకు దూరమవుతున్నారు.

ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని బయటికి పంపారు : అజయ్ కుమార్‌, 6వ తరగతి, రేడియం హైస్కూల్‌, వనపర్తి
ఉచిత విద్యను పొందుతున్న మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని, మీరైనా డబ్బులు చెల్లించి రెసిడెన్షియల్‌గా ఉంటూ పాఠశాలల్లో చదువుకోవాలని యాజమాన్యం చెప్పింది. డబ్బులు కట్టలేకపోతే పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పారు. అధికారులను అడుగుదామని డీఈఓ ఆఫీస్‌కు వచ్చాం.

ఆరు నెలల్లో పది రోజులే బువ్వ పెట్టిండ్రు: విద్యార్థి రాజు, 7వ తరగతి, మదనాపురం మండలం, కొత్తపల్లి గ్రామం
పాఠశాల ప్రారంభమై ఆరు నెలలు గడుస్తోంది. మొదటి పది రోజుల్లో మాత్రమే మాకు రెసిడెన్షియల్‌గా అవకాశం ఇచ్చి బువ్వ పెట్టారు. ఆ తరువాత డబ్బులు కట్టాలని ఇంటికి పంపారు. రోజూ 40 కిలో మీటర్లు ప్రయాణించి పాఠశాలకు వస్తున్న.

ఖర్చులు భరించలేకనే: గద్దె భాస్కర్‌, రేడియంట్‌ హైస్కూల్‌, వనపర్తి
ప్రభుత్వం రెండేండ్లుగా బడ్జెట్‌ విడుదల చేయడం లేదు. రూ. 97 లక్షలు రావాలి. ఈ ఏడాది మరో రూ.50 లక్షలు రావాలి. 120 మంది పిల్లలకు వసతి కల్పిస్తున్నాను. డబ్బులు లేకుండా ఎలా మెయింటైన్‌ చేయాలి. జూన్‌లో బకాయిలు చెల్లించకుండా పిల్లల ఖర్చులు భరించలేం. రెండు మూడు నెలల్లోనే వస్తాయని కలెక్టర్‌ చెప్పడంతో ఒప్పుకున్నా. ఆరు నెలలైనా నయా పైసా రాలేదు. అందుకే డే స్కాల ర్స్‌ను తీసుకుంటున్నాం. రెసిడెన్షియల్‌ పిల్లలను భరించలేమని చెప్పాం.

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు బడ్జెట్‌ వెంటనే కేటాయించాలి : భరత్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్‌
రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు బడ్జెట్‌ కేటాయించి విడుదల చేయాలి. రెండేండ్లుగా నిధులు లేకుండా పాఠశాలల నిర్వహణ ఎలా సాధ్యం. పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం లేవు. తోటి విద్యార్థులతో పొటీ పడలేకపోతున్నారు. రెసిడెన్సీ లేక 30, 40 కిలోమీటర్లు రాలేక చదువు మానేస్తున్నారు.

సర్కారు నిర్ణయాన్ని చెప్పలేకపోతున్నాం.. : అబ్దుల్‌ ఘని, డీఈఓ, వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా పాలసీ అది. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు రెండేండ్లుగా నిధులు రాకపోవడం నిజమే. అయినా పిల్లల విద్యకు ఎక్కడా ఆటంకం లేకుండా, వారిపై ఒత్తిడి చేయకుండా పాఠశాలల్లో కొనసాగనివ్వాలని యాజమాన్యాలకు సూచిస్తున్నాం. ఇంకొంతకాలం సర్దుకుపోవాలని సూచిస్తున్నాను.

యాజమాన్యాలు ఓపిక పట్టాలి : మల్లికార్జున్‌, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌, వనపర్తి
బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల కింద విద్యను అందిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా విద్యాబోధన చేయాలి. నిధుల విడుదలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించాం. యాజమాన్యాలు ఇంకొంతకాలం ఓపిక పట్టి విద్యార్థులకు సరైన విద్యా బోధన చేయాలి.

మంత్రి దామోదర్‌ను కలిసిన పాఠశాల యాజమాన్యాలు..
బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు మూడేండ్లుగా విడుదల చేయని నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్ధుల భవిష్యత్తును కాపాడాలంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను శుక్రవారం పాఠశాల యాజమాన్యాలు సంగారెడ్డిలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం రియంబర్స్‌మెంట్‌ ఇవ్వడంతో వేల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారని వివరించారు. కానీ మూడేండ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకుల్లో అప్పులు చేసి నెలనెలా ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారిందని వాపోయారు. ప్రయివేట్‌గా తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడం, నగలు తాకట్టు పెట్టడం, ఉన్న ఆస్తులు అమ్ముకుని విద్యార్థులకు ఏ లోటు రాకుండా అన్ని వసతులు కల్పించినట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, ఇక పాఠశాలలు నడిపే పరిస్థితి లేదని బిల్లులు ఇప్పించాలని మంత్రిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -