Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఇంజనీరింగ్‌ విద్యను సంస్కరించుకోలేమా?

ఇంజనీరింగ్‌ విద్యను సంస్కరించుకోలేమా?

- Advertisement -

భారతదేశంలో ఒకప్పుడు ఇంజనీరింగ్‌ అంటే విజయానికి పాస్‌పోర్ట్‌ అని నమ్మకం. డిగ్రీ పొందిన వెంటనే ఉద్యోగం దొరుకుతుందని, స్థిరమైన జీవితం వస్తుందని ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థి కలలు కనేవారు. అయితే నేడు ఆ నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోంది. నాలుగేళ్ల కఠోరశ్రమ, లక్షల రూపాయల ఫీజులు చెల్లించినా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. ”మీకు డిగ్రీ ఉంది కానీ మాకు కావాల్సిన నైపుణ్యాలు లేవు” అంటున్న పరిశ్రమలు నేటి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ల దుస్థితిని సూటిగా చెబుతోంది. ఈ పరిస్థితికి కేవలం కాలం చెల్లిన సిలబస్‌ మాత్రమే కాదు, మన విద్యావ్యవస్థలో పాతుకుపోయిన అంతర్గత లోపాలు కూడా అనేకం కూడా కారణం. దేశం మొత్తం ఎదుర్కొంటున్న ఒక వ్యవస్థాగత వైఫల్యం. అధికారిక రిపోర్టులు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారం, ఇంజనీరింగ్‌ చదివిన వారిలో కేవలం నలభై శాతం మందికి మాత్రమే వారి విద్యకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొన్ని సర్వేలు అయితే దాదాపు ఎనభై శాతం మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌లకు సరైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగాలు లభించడం లేదని స్పష్టం చేస్తున్నాయి. అంటే మన కాలేజీల్లో నేర్పించే విద్యకు, పరిశ్రమ లకు అవసరమైన నైపుణ్యాలకు చాలా అంతరం ఉందన్నమాట.
నేటి పరిశ్రమ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వంటి విప్లవాత్మక సాంకేతికతలతో ముందుకు దూసుకుపోతుంటే, మన ఇంజనీరింగ్‌ కోర్సులు మాత్రం పాతకాలపు సిద్ధాంతాలకే పరిమితమయ్యాయి. ఈ కాలం చెల్లిన సిలబస్‌ కారణంగానే విద్యార్థులు ఆధునిక పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా తయారవట్లేదు. కంప్యూటర్‌ సైన్స్‌రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు మన సిలబస్‌ సరిపోవడం లేదు. విద్యార్థులు ఇప్పటికీ ‘సి’, ‘సి ప్లస్‌ ప్లస్‌’, జావా వంటి ప్రాథమిక భాషలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ పరిశ్రమలకు ఇప్పుడు పైథాన్‌, గో, రస్ట్‌ వంటి ఆధునిక భాషలు:రియాక్ట్‌, నోడ్‌.జెఎస్‌ వంటి ఫ్రేమ్‌వర్క్‌లుబీ ఎడబ్ల్యుఎస్‌, అజూర్‌ వంటి క్లౌడ్‌ ప్లాట్‌ఫారమ్‌లుబీ డాకర్‌, కుబెర్నెటీస్‌ వంటి డెవలపింగ్‌ సాధనాలపై పట్టున్న నిపుణులు కావాలి.ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో చాలా కళాశాలలు ఇంకా పాత మైక్రోప్రాసెసర్‌లైన 8085/8086కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ, నేటి ప్రపంచం విఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఆధునిక ఎఆర్‌ఎం కంట్రోలర్లు, 5జి టెక్నాలజీ, చిప్‌ డిజైనింగ్‌ వంటి అధునాతన రంగాల వైపు వేగంగా నడుస్తోంది. మెకానికల్‌ ఇంజ నీరింగ్‌లో సంప్రదాయ థర్మోడైనమిక్స్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ వంటి అంశాలు అవసరమే అయినా, పరిశ్రమకు కావాల్సింది సాలిడ్‌వర్క్స్‌, క్యాటి యా వంటి ఆధునిక సిఎడి, సిఎఎమ్‌ సాఫ్ట్‌వేర్లలో నైపుణ్యం, ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, త్రిడి ప్రింటింగ్‌పై అవగాహన ఉన్న ఇంజనీర్లు.

చాలా మంది అధ్యాపకులకు, ముఖ్యంగా చిన్న కళాశాలల్లో, పరిశ్రమ అనుభవం తక్కువగా ఉంది. వారు కేవలం టెస్ట్‌బుక్‌ నాలెడ్జ్‌ మాత్రమే బోధించడం వల్ల విద్యార్థులకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు.పైగా కాలేజీలకు, పరిశ్రమలకు మధ్య సరైన అనుసంధానం లేదు. ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమలతో కలిసి ప్రాజెక్టులు చేయడం, నిపుణులను ఆహ్వానించి మాట్లాడించడం వంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. దీనివల్ల విద్యా సంస్థలకు పరిశ్రమల అవసరాలు తెలియడం లేదు. ఇంకా మౌలిక సదుపాయాలు లేకపోవడం, చాలా కళాశాలల్లోని ప్రయోగశాలలు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా లేని పాత యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌లే అమర్చబడి ఉన్నాయి. అధునాతన డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌లు చాలా కళాశాలలో ఇప్పటికీ అందుబాటులో లేవు.
ఈ సమస్యలను అధిగమించడానికి ఒక సమగ్ర, బహుముఖ విధానం అవసరం. ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు అందరూ కలిసి కృషి చేయాలి.పరిశ్రమ-ఆధారిత సిలబస్‌: పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ను ఎప్పటికప్పుడు మార్చాలి. సిద్ధాంతాల మీద కాకుండా, ప్రాజెక్ట్‌ ఆధారిత అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కృత్రిమ మేధ , డేటా అనలిటిక్స్‌ వంటి ఆధునిక విషయాలను చేర్చాలి.అధ్యాపకులకు పరిశ్రమల్లో కొంతకాలం పనిచేసేలా ప్రోత్సహిం చాలి. దీనివల్ల వారికి అనుభవం వస్తుంది. పరిశ్రమల్లోని అనుభవజ్ఞులతో కళాశాలలో క్లాసులు క్లాసులు ఇప్పించాలి.
కాలేజీలు, కంపెనీలు కలిసి విద్యార్థులకు వాస్తవ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశాలు కల్పించాలి.బట్టీ పట్టడం నుంచి కేస్‌-స్టడీ, ప్రాజెక్ట్‌-ఆధారిత మూల్యాంకనం మన చదవులతీరు మారాలి. అత్యాధునిక ల్యాబ్‌లు, సాఫ్ట్‌వేర్‌ లైసెన్స్‌లు పరిశోధన సౌకర్యాలలో భారీగా పెట్టుబడి పెట్టాలి.ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి కేవలం టెక్నికల్‌ నైపుణ్యం సంపాదించడం కాదు. ”ఎందుకు ఇది ఇలా జరుగుతోంది?” అనే సందేహమే శాస్త్రానికి బీజం. ”ఇది మనిషికి ఎలా ఉపయోగపడుతుంది?” అనే ఆలోచన తత్వానికి మూలం. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే నిజమైన ఇంజినీరింగ్‌ పుడుతుంది.ఆ విధమైన మార్పులే ఈ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ధర్మాన రవితేజ
7093705620

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad