Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిమన సాంకేతిక ప్రతిభను వినియోగించుకోలేమా?

మన సాంకేతిక ప్రతిభను వినియోగించుకోలేమా?

- Advertisement -

భారతదేశ స్వాతంత్య్రా నంతరం సాంకేతిక విద్యా రంగం బాగా బలపడింది. సాప్ట్‌వేర్‌, సమాచార సాంకేతిక విజ్ఞానం, డిజిటల్‌ మార్పులు దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపాయి. అయితే, నేటి యువతలో ఉన్న ప్రతిభ, విశ్వస్థాయి అవకాశాల కోసం విదేశాల వైపు మొగ్గడం ప్రధాన సమస్యగా మారింది. దీనిపై కేంద్ర మంత్రిత్వశాఖ కూడా దృష్టిపెట్టడం లేదు. వారిని ఇక్కడే ఉంచేందుకు కావాల్సిన అవకాశాలు కల్పించడం లేదు. ఈ పరిణామాలు భారతదేశ అభివృద్ధి, పరిశ్రమల ప్రగతి, ఆర్థిక పరిణామాలకు కొత్త విధానాలను సృష్టిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రముఖ విద్యాసంస్థలుు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కళాశాలలుు, సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దాయి. తొలినాళ్లలో ఈ విద్య ప్రధానంగా యంత్రాంగం, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి విభాగాల్లోనే ఉండేది. కానీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అనే కొత్త రంగం పుట్టుకొచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారు తమ విద్యను పూర్తిచేసిన వెంటనే, కొంత అనుభవం సంపాదించాక, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఒక అలవాటు కాకుండా, అనేక కారణాలతో కూడిన సామాజిక-ఆర్థిక వాస్తవం. ఇక్కడ నాణ్యమైన సాంకేతిక విద్యపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ విద్యార్థులు తమ భవిష్యత్తు అవకాశాల కోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌ వంటి దేశాలను ఎంచుకుంటున్నారు. అక్కడ ఉన్న సాప్ట్‌వేర్‌ పరిశ్రమలు వారికి అధిక జీతాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో ముందువరుసలో పనిచేసే అవకాశం, పరిశోధనలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాయి.

దేశంలోని అనేక సాప్ట్‌వేర్‌ సంస్థలు ప్రపంచస్థాయి ప్రాజెక్టులపై పనిచేస్తున్నా, అక్కడి వేతనాలు, సౌకర్యాలు విదేశీ కంపెనీల స్థాయిలో ఉండవు. ఉద్యోగ భద్రత, వర్క్‌ కల్చర్‌, జీవన ప్రమాణాల విషయంలో కూడా యువత విదేశాలను మరింత ఆకర్షణీయంగా భావిస్తు న్నారు. పైగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణా అవకాశాలు వారిని బలంగా లాగుతున్నాయి. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో ఉన్న కోర్సులు అక్కడ విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ విద్య, అనుభవం ద్వారా వారు ప్రపంచస్థాయి పోటీకి సిద్ధమవుతున్నారు.కానీ, ఈ ధోరణి మన దేశానికి ఒక సవాలుగా మారింది. ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లిపోవడం వల్ల దేశంలో సాంకేతిక పరిశోధన, కొత్త ఆవిష్కరణలకు కొంత వెనుకబాటు ఏర్పడుతోంది. దీనిపై కేంద్రం స్పందన అంతంత మాత్రమే ఉన్నది. దీంతో మనవారి ప్రతిభ విదేశాల సొంతమవుతోంది. దీనికితోడు ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనాలు, సాంకేతిక పరిశోధన వాతావరణం, జీవన ప్రమాణా లు కూడా మనకంటే మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది.

నేటి యువత సాంకేతిక విద్యలో అద్భుతమైన నైపుణ్యాలు సంపాదిస్తున్నారు. కానీ వారు ఆ ప్రతిభను పూర్తిగా మన దేశంలోనే విని యోగించక, విదేశాలకు వెళ్లి విద్య, ఉద్యోగాలు, స్థిరపడే అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఇది అనేక కోణాల్లో, రంగాల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇంకో పరిణామం విదేశీ మారకద్రవ్య ప్రవాహం. భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు విదేశాలలో సంపాదించిన డబ్బును ఇక్కడి కుటుంబాలకు పంపుతారు. ఈ రెమిటెన్స్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన తోడ్పాటందిస్తున్నాయనేది విశ్లేషకుల మాట. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి ఇది పెద్ద సహకారం.కానీ దీని ప్రతికూ లతను కూడా మరిచిపోరాదు. ప్రతిభావం తులైన యువత దేశంలో ఉండకపోవడం వల్ల స్థానిక పరిశ్రమలు కొంతమేర వెనుకబడతాయి. విద్యార్థులు విదేశాల్లో స్థిరపడడం వల్ల భారతదేశానికి ఒకవైపు ప్రతిభా పరంగా నష్టం వాటిల్లుతుందని విశ్లేషకుల అభిప్రాయం. దేశ సాంకేతిక విద్య అభివృద్ధి, సాప్ట్‌వేర్‌ రంగంలో విజయాలు, విద్యార్థులు పొందిన నైపుణ్యా లు, అంతర్జాతీయ అనుభవం దేశానికి నేరుగా ఉపయోగకరంగా మారగలవనే వాదన కూడా ఉంది. కానీ ఇక్కడే అవకాశాలు కల్పిస్తే మరింత నైపుణ్యం వారినుంచి తీసుకోవచ్చనే అభిప్రాయం కూడా వస్తున్నది. ఈ పరిణామాల మధ్య సమతుల్యతను కాపాడటం భారతదేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం. విదేశాల్లోని అవకాశాలను సద్వినియోగం చేసుకుని, సంపాదించిన అనుభవాన్ని దేశ అభివృద్ధికి అన్వయిం చడం, కొత్త పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు, సాంకేతిక రంగాల్లో యువతకు అవకాశాలు సృష్టిం చడం, ఇవి సరైన దిశలో మన యువతను, దేశాన్ని నడిపించే మార్గాలు. ఇలా మన సాంకేతిక విద్య, యువత ప్రతిభ, ప్రపంచ సాంకేతిక సముదాయంలో మన దేశ అభివృద్ధికి చేర్చినపుడే నిజమైన మార్పు, శాశ్వత ప్రగతి సాధ్యం.దీనికి కృషి చేయాల్సింది విద్యార్థులతో పాటు ప్రభుత్వాలే.
డా.చిటికెన కిరణ్‌ కుమార్‌
9490841284

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad