Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయువతిని కాపాడిన సీఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌

యువతిని కాపాడిన సీఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌

- Advertisement -

శ్రీధర్‌ వర్మకు హెచ్‌ఆర్సీ అభినందన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మానవత్వంతో వ్యవహరించిన సీఏఆర్‌ కానిస్టేబుల్‌కు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీఎస్‌హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ప్రశంసించారు. గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక యువతిని రక్షించిన హైదరాబాదు సిటీ ఆర్మ్‌ రిజర్వ్‌ (సీఏఆర్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌ వర్మ ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన సేవలను ప్రశంసిస్తూ జస్టిస్‌ షమీమ్‌ అభినందన పత్రం అందజేశారు. శ్రీధర్‌ వర్మ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌కు పైలట్‌ కమ్‌ ఎస్కార్ట్‌ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7న సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారాహిల్స్‌ రహదారులు నడుము లోతు వరద నీటితో మునిగిపోయాయి. ఆ సమయంలో బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.3 వద్ద బస్టాప్‌లో ఒంటరిగా నిలబడి భయాందోళనలకు లోనైన 22 ఏండ్ల యువతి నైనికను శ్రీధర్‌ వర్మ గమనించారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుతున్న నైనిక రామంతపూర్‌లో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి నగరానికి వచ్చింది. తన అన్న వదిలి వెళ్ళిన తర్వాత పెరుగుతున్న వరదలో ఇరుక్కుపోయింది. నీటి భయం (హైడ్రోఫోబియా)తో విలవిలలాడింది. మొబైల్‌ ఫోన్‌ పని చేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించలేని పరిస్థితిలో చిక్కుకుంది. ఈ సమయంలో శ్రీధర్‌ వర్మ నడుము లోతు నీటిలోకి వెళ్లి, ఆమెకు తన జెర్కిన్‌ ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రయాణ సౌకర్యాలు లభించకపోవడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆయన స్వయంగా నైనికను వానలతో ముంచెత్తిన రహదారులను దాటుకుంటూ వనస్థలీపురంలోని ఆమె ఇంటికి ఆ రాత్రి తీసుకెళ్లి తల్లి, చెల్లెలు వద్దకు క్షేమంగా చేర్చారు. ఈ సంఘటన పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది. దీనిపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ స్పందిస్తూ, శ్రీధర్‌ వర్మ సేవను విధి నిర్వహణకు మించి మానవత్వం, కర్తవ్యబద్ధతకు ప్రతీకగా అభినందించారు. ఆయన చూపిన నిస్వార్థ సేవ ఒక బాధలో ఉన్న పౌరుడి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడడమే కాకుండా, పోలీసింగ్‌, మానవ హక్కుల పరిరక్షణలోని అసలు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -