– మరొకరి పరిస్థితి విషమం
– సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద ఘటన
– మృతదేహాలు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రి మార్చిరికి తరలింపు
నవతెలంగాణ – సత్తుపల్లి
అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద బుధవారం ఉదయం 5 గంటలకు జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పెనుబల్లి నుంచి సత్తుపల్లి వైపు అతివేగంగా వచ్చిన కారు కిష్టారంలోని అంబేద్కర్ నగర్ కాలనీ వద్ద రాష్ట్రీయ రహదారిపై డివైడరును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృత్యువాతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సాదిక్ (21), సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన సిద్దేసి జాయ్ (21), మర్సకట్ల శశి వర్ధన్ (12) అక్కడికక్కడే మృతి చెందారు. అన్నపురెడ్డిపల్లికి చెందిన తలారి అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. చండ్రుగొండ మండలం మహాబాద్ కాలనీకి చెందిన ఎస్కే ఇమ్రాన్ కు స్వల్ప గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన అజయ్ ను, ఇమ్రాన్ ను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. మృతి చెందిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి మార్చురీకి తరలించారు. డివైడరును ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జయి శకలాలు 50 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి. ఏసీపీ వసుంధర యాదవ్, సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్ఐలు ప్రదీప్, అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ సంఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద దృశ్యాన్ని వారంతా కంటతడి పెట్టారు. ప్రమాద విషయం తెలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా నాగమణి దయానంద్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద దృశ్యాన్ని పరిశీలించారు.



