Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికాతో ఒప్పందాలపై జాగ్రత్త

అమెరికాతో ఒప్పందాలపై జాగ్రత్త

- Advertisement -

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ :
అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేటపుడు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో భారత్‌ చాలా తెలివిగా, జాగ్రత్తగా ఆలోచించి, వ్యవహరించాల్సి వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ శుక్రవారం హెచ్చరించారు. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 6-7శాతం మధ్య స్థిరపడిందని, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న కారణంగా చాలా స్వల్పమైన శాతంలో ప్రభావితమై వుండొచ్చునని రాజన్‌ పేర్కొన్నారు. పీటీఐ వీడియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. సాధారణంగా వ్యవసాయ రంగానికి సంపన్న దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తూ వుంటాయి. దాదాపు ప్రతి దేశం తన రైతాంగానికి ఎంతో కొంత సబ్సిడీ ఇస్తూ వుంటుంది. వారితో పోలిస్తే మన రైతులు చాలా స్వల్ప మొత్తాల్లోనే రాయితీలను పొందవచ్చు, లేదా వారికన్నా తక్కువ కూడా వుండొచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా బయట నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వెల్లువ దేశంలోకి వచ్చిపడితే మన రైతాంగానికి అనేక సమస్యలు తలెత్తవచ్చని అన్నారు. దేశంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించవచ్చని ఆయన సూచించారు. ముఖ్యంగా డెయిరీ ఉత్పత్తుల రంగంలో ఇందుకు పరిస్థితులు సానుకూలంగా వున్నాయన్నారు. కేవలం ముడి పదార్ధాలు ఎగుమతి చేయడానికి బదులుగా విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తే స్థానిక రైతాంగం ప్రయోజనాలు పొందుతారని, తమ ఉత్పత్తులకు మరింత విలువను జోడించి మరింత డబ్బును ఆర్జిస్తారని అన్నారు. ”విదేశీ పాల దిగుమతులను స్వాగతించే బదులు ఇతర మార్గాలను అన్వేషించాలి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా, తెలివిగా చర్చించాలి. వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం ఎగుమతులు, పెట్టుబడుల రెండింటికీ ప్రతికూలంగా ఉంటుంది. అమెరికా చైనాపై, ఆసియాలోని కొన్ని ఇతర దేశాలపై విధించే సుంకాలు భారతదేశంపై విధించే సుంకాల కంటే ఎక్కువగా ఉంటే.. తయారీ రంగం భారత్‌కు మళ్లవచ్చు.” అని రాజన్‌ తెలిపారు.
ప్రస్తుత వాణిజ్య చర్చల్లో భారత్‌ తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవ డానికి తెలివిగా వ్యవహరించాలని ఆయన పునరుద్గాటించారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ప్రస్తుతం వాషింగ్టన్‌లో భారత బృందం ఐదవ రౌండ్‌ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ వారం ప్రారంభంలోనే భారత బృందం ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) పై ఐదవ దఫా చర్చలు కోసం వాషింగ్టన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -