Monday, July 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగీత, రాత పూర్తిగా తెలిసిన కార్టూనిస్ట్‌ శేఖర్‌

గీత, రాత పూర్తిగా తెలిసిన కార్టూనిస్ట్‌ శేఖర్‌

- Advertisement -

త్వరలో ఆయన కార్టూన్ల ప్రదర్శన :
శేఖర్‌ మెమోరియల్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఎస్‌.వినయకుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గీత, రాత పూర్తిగా తెలిసిన కార్టూనిస్ట్‌ శేఖర్‌ అని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్‌.వినయకుమార్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శేఖర్‌ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఫోరం ఫర్‌ పొలిటికల్‌ కార్టూనిస్ట్స్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో కార్టూనిస్ట్‌ శేఖర్‌ మెమోరియల్‌ అవార్డులు-2025 ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక కార్టూనిస్ట్‌ మత్యుంజయ, చిత్రకారులు చిత్ర కార్టూనిస్ట్‌ శేఖర్‌ మెమోరియల్‌ అవార్డు -2025ను అందుకున్నారు. అవార్డుతో పాటు రూ.10,116 నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను నిర్వాహకులు అందజేసి ఇరువురిని సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినయకుమార్‌ మాట్లాడుతూ ప్రజాశక్తిలో హైదరాబాద్‌ ఇన్‌చార్జిగా తాను, కార్టూనిస్ట్‌గా శేఖర్‌ కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. శేఖర్‌ కార్టూన్‌ వేస్తే మార్చాల్సిన అవసరముండేది కాదన్నారు. చాలా మంది కార్టూనిస్ట్‌ల గీత బాగుంటే రాత బాగుండదనీ, రాత బాగుంటే గీత బాగుండదని తెలిపారు. ఆ తరం కార్టూనిస్టులు నవలలు, సాహిత్యం ఎక్కువగా చదివేవారని తెలిపారు. నేటి తరం అలాంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. శేఖర్‌ లేని లోటు తెలుగు కార్టూన్లను చూస్తుంటే తెలుస్తున్నదని చెప్పారు. హిందీ కార్టూన్‌లలో వస్తున్నట్టు వ్యాఖ్యలు తెలుగు కార్టూన్లలో కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. నాటి కరుకుదనమూ కనిపించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు కార్టూన్లు రావడం లేదని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శేఖర్‌ కార్టూన్ల ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆయన విలువలను కొనసాగిద్దాం
తన జీవితాంతం ప్రజల కోసం కార్టూన్లు వేసిన శేఖర్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని సీనియర్‌ జర్నలిస్టు, రచయిత కె.వి.కూర్మనాథ్‌ అన్నారు. కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసం ఇచ్చారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి 45 వేల కార్టూన్లు వేశారని తెలిపారు. ఆ కార్టూన్లు ఉమ్మడి రాష్ట్రంలోని మూడు దశాబ్దాల చరిత్రకు అద్దం పడతాయని తెలిపారు. మత, కుల రాజకీయాలు, సమాజంలో అసమానతలు, శ్రామికుల శ్రమ దోపిడీని తన కార్టూన్లతో ఎండగట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ విధానాలను నిలదీసేవారని తెలిపారు. లౌకికవాదాన్ని అంకితభావంతో ఆచరించారని చెప్పారు. మత విద్వేష భావజాలం పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో శేఖర్‌ కార్టూన్‌ వేస్తే అరెస్టు చేసేవారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మెన్‌ తిప్పర్తి యాదయ్య, కార్టూనిస్ట్‌ శంకర్‌, చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్‌, ప్రజా వాగ్గేయకారులు చింతల యాదగిరి, హైదరాబాద్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి రమణారెడ్డి, శేఖర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శేఖర్‌ సతీమణి చంద్రకళా శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -