అటవీ భూముల ఆక్రమణ వీడియో విడుదల చేసిన పవన్ కల్యాణ్
విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
అమరావతి: ఏపీ మాజీ మంత్రి, వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రంగా చిత్తూరు జిల్లా అటవీ భూముల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. ఎ1గా ఎంపి మిథున్‌రెడ్డిని పేర్కొంది. విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన డిప్యూటీ ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ పెద్దిరెడ్డితోపాటు, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అటవీభూములను ఆక్రమించారని పేర్కొంటూ గురువారం వీడియోను విడుదల చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన విడుదల చేసిన వీడియోలో మంగళంపేట అటవీ భూములను ఆక్రమించారని, రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలోనూ పవన్ కల్యాణ్ ఈ విషయాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడంతో పాటు, తక్షణమే విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవన్ కల్యాణ్ ఈ ఆదేశాలు జారీచేసిన కాసేపటికే అటవీశాఖ రంగంలోకి దిగింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత న్యాయసంహిత ప్రకారం రాష్ట్ర అటవీ చట్టంలోని 61(2), 20(1), (డి)(2), 52(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఎ1గాను, ఎ2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లను నమోదు చేశారు. గురువారం సాయంత్రం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ కేసులో అటవీచట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్టు (పివోఆర్) ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేశామని పేర్కొన్నారు.
1968 గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాలకు పట్టాలు ఉన్నాయని వివరించారు. అదనంగా 32.63 ఎకరాల అటవీ భూమిని కూడా కలిపేసుకొని కంచె వేశారని తెలిపారు. ఆ అటవీ భూముల్లో ఉద్యాన పంటలు వేసి సాగు చేసి ఆదాయం పొందారని పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ తవ్వారని, అటవీ వనరులు దుర్వినియోగం చేశారని తెలిపారు. ఈ చర్యల కారణంగా దాదాపు రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అటవీ భూములు ఆక్రమించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అటవీ భూముల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారని తెలిపారు. సర్వే మొత్తం పూర్తిచేసి స్థలాల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని వెల్లడించారు.
రాజకీయ కారణాలతోనే వీడియో విడుదల : మిధున్‌రెడ్డి
రాజకీయ కారణాలతోనే పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారని మిధున్‌రెడ్డి ఆరోపించారు. ఆరోపణలను ఆయన తిరస్కరించారు. భూములు వారసత్వంగా వచ్చినవని, చట్టబద్ధమైందని చెప్పారు.
ఏపీ మాజీమంత్రి పెద్దిరెడ్డిపై కేసు
- Advertisement -
- Advertisement -



