నవతెలంగాణ-హైదరాబాద్
జహీరాబాద్‌లో 2003లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు పోలీసులపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారంది. జహీరాబాద్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దొంగతనం జరిగిందని సమాచారం అందడంతో వాళ్లు ఘటనస్థలానికి చేరుకున్నారు. ఇద్దరు దొంగలు పారిపోతుండగా వెంబడించిన పోలీసులపై మహ్మద్ షఫీ అనే వ్యక్తి ఎదురుతిరిగాడు. కానిస్టేబుల్ గోపాల్‌పై కత్తితో పొడిచి రైఫిల్ లాక్కుని కాల్పులకు ప్రయత్నించాడు. ఏసీపీ శ్రీధర్‌రెడ్డి కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి మరణించాడు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిగాయని కలెక్టర్, ఆ తర్వాత సీఐడీ నివేదికలు ఇచ్చాయి. దీనిపై మహ్మద్ ఖాన్ అనే వ్యక్తి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. పోలీసులిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై పోలీస్ అధికారులు జిల్లా కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. తిరిగి ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఇటీవల జస్టిస్ శ్రీదేవి విచారణ పూర్తి చేసి పోలీసులపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ప్రాసిక్యూషన్‌కు ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరమనీ, అది ఈ కేసులో లేదని తీర్పు చెప్పారు.
కొండాపూర్‌లోని 57 ఎకరాలు ప్రభుత్వ భూములే : హైకోర్టు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని 57 ఎకరాలు ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పు చెప్పింది. అవి తమవేనంటూ ప్రయివేటు వ్యక్తులు వేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూములపై జస్టిస్ భీమపాక నగేష్ తీర్పు చెప్పారు. పిటిషనర్లు తమ భూములని ఆధారాలు చూపలేకపోయారు. అవి1988-89 నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. తమ ఆధీనంలో ఉన్నాయని పిటిషనర్లు నిరూపించలేదు. లావుణి పట్టాల ద్వారా పొందిన భూమికి మ్యుటేషన్ కోసం ప్రయివేటు వ్యక్తులు వేసిన పిటిషన్‌లో సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై డివిజన్ బెంచ్ విచారించి ఈ వ్యవహారాన్ని విచారణ చేయాలని సివిల్ కోర్టును ఆదేశించింది. భూములు ప్రయివేటు వ్యక్తులవేనని, మ్యూటేషన్ చేయాలని సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసిన పిటిషన్లపై పైవిధంగా న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తహసీల్దారు లావుణి పట్టా మంజూరు తేదీకి సంతకం చేసిన తేదీకీ తేడా ఉందన్నారు. 1958లో అసైన్‌మెంట్ భూముల కేటాయింపునకు జీవో తెచ్చిందనీ, 1961లో అమల్లో లేని లావుణి నిబంధనల కింద పట్టా పొందామని పిటిషనర్లు తప్పుగా చెప్పారని గుర్తించారు. 57 ఎకరాల్లో ప్రభుత్వం వివిధ సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు గతంలో కేటాయింపులు చేయగా మిగిలినది ప్రభుత్వ భూమేనని రాష్ట్రం చేసిన వాదనను ఆమోదించారు. పిటిషనర్లు తమ భూములను నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. పిటిషన్లతోపాటు 36 ఎకరాలను కొనేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నామనీ, రాజకీయ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబసభ్యులు, మరో రెండు ప్రయివేటు సంస్థలు వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టేశారు.