– జరిమానా చెల్లించాలి
– ఫెమా ఉల్లంఘనపై ఫ్లిప్‌కార్ట్‌కు ఈడీ బంఫర్ ఆఫర్
న్యూఢిల్లీ : విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘలను ఒప్పుకొని, జరిమానా చెల్లిస్తే కేసును మూసివేస్తామని ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బంఫర్ ఆఫర్ ఇచ్చింది. బహుళజాతి కంపెనీ వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌పై ఫెమా ఉల్లంఘనల కేసు దాదాపు నాలుగేండ్ల నుంచి కొనసాగుతోంది. ఈ కేసును పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పిస్తోన్నట్టు ఈడీ పేర్కొంది. ప్లిప్‌కార్ట్ తన తప్పును అంగీకరించి జరిమానా చెల్లించడం ద్వారా సుదీర్ఘ న్యాయపరమైన చిక్కులు లేకుండా కేసును మూసివేయడానికి ఈడీ హామీ ఇచ్చింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా రెండింటి పెట్టుబడులు, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ చాలా కాలంగా దర్యాప్తు చేస్తోంది. రెండు కంపెనీలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించాయని, వారి ప్లాట్‌ఫామ్‌లపై డిస్కౌంట్లను అందించడం ద్వారా అమ్మకాలను పెంచడానికి ప్రయత్నించాయని ప్రధాన ఆరోపణ. విదేశీ పెట్టుబడి నిబంధనల ఉల్లంఘనలపై తొలిసారి 2021లో ఫ్లిప్‌కార్ట్, దాని అనుబంధ సంస్థలు, కొంతమంది వ్యక్తులకు ఇడి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు 2009 నుంచి 2015 మధ్య కార్యకలాపాలకు సంబంధించినవి. కాగా.. ఆ సమయంలో అమెరికన్ దిగ్గజం వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడి పెట్టలేదు. 2018లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. అయితే 2016 నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఏప్రిల్ 2025లో కంపెనీకి కొత్త నోటీసు పంపింది. కాంపౌండింగ్ అనేది ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద ఒక నిబంధన. ఇది ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలు వాటి తప్పును స్వచ్ఛందంగా అంగీకరించడానికి, నిర్ణీత జరిమానా చెల్లించడానికి, తద్వారా క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా సుదీర్ఘ న్యాయపరమైన అడ్డంకులను నివారించడానికి వీలు కల్పిస్తుంది. రెగ్యులేటరీ సంస్థలు కేసులను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించడానికి ఇది ఒక మార్గం.ఈడీ ఇచ్చిన ఈ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అంగీకరిస్తుందా..? లేదా..? వేచి చూడాలి.
తప్పొప్పుకుంటే కేసు మూసివేత
- Advertisement -
- Advertisement -