రూ.10కోట్లు మోసం చేసినట్టు అడ్వకేట్ ఫిర్యాదు
నవతెలంగాణ- బంజారాహిల్స్ / గండిపేట్
ప్రముఖ గాయని మంగ్లీపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన వద్ద నుంచి రూ.10 కోట్లు తీసుకుని మోసం చేయడంతోపాటు, డబ్బులు అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 150 మందిని ఇదే విధంగా ఆమె మోసం చేసినట్టు ఆరోపించారు. ఈ వ్యవహారంలో దర్శకుడు వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా భాగస్వాములని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు బీఎన్ఎస్ 351(2), 352 సెక్షన్ల కింద మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
తప్పుడు ఆరోపణలు : నార్సింగి పీఎస్లో మంగ్లీ ఫిర్యాదు
తమపై తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయవాది శుభాసింగ బోస్పై ప్రముఖ సింగర్ మంగ్లీ శనివారం రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేశారు. తాను ఇతరుల నుంచి రూ.150 కోట్లు వసూలు చేసి మోసం చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న శుభాసింగబోస్ పేరుతో తనను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, ఆ తరువాత బెదిరించడంతోపాటు అమర్యాదగా మాట్లాడారని తెలిపారు. దాంతో అతన్ని మందలిస్తే.. తనను అప్రతిష్ట పాలుచేస్తానని బెదిరించినట్టు మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఎలాంటి సంబంధమూ లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తనపై పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. మంగ్లీ ఫిర్యాదు మేరకు శుభాసింగ బోస్పై 79, 351 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సింగర్ మంగ్లీపై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



