– ప్రభుత్వం ప్లాట్లు ఇస్తుందని పేదల నుంచి డబ్బులు వసూలు
– పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
నవతెలంగాణ-ఖమ్మం కలేక్టరేట్/ రఘునాథపాలెం
ఖమ్మం పరిధిలోని వెలుగుమట్ల భూముల ఆక్రమణ ఘటనపై శనివారం రాత్రి ఆరుగురిపై రఘునాధపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఎస్‌హెచ్‌ఓ ఎండి.ఉస్మాన్ షరీఫ్ తెలిపిన, బాధితురాలి ఫిర్యాదు వివరాల ప్రకారం.. వెలుగుమట్ల ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి 30 వేల రూపాయలు వసూలు చేసిన ఆరుగురిపై చెక్కల రామలక్ష్మి ఫిర్యాదు చేశారు. ప్లాట్లు ఇప్పిస్తామంటూ 2021 నవంబర్ నుంచి 2023 వరకు ఏన్కూర్‌కి చెందిన పొన్నబోయిన బేబీ(గ్రామదీపిక), కల్తీ రామచంద్రయ్య, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి తాళ్లూరు కృష్ణ, పోలబోయిన ముత్తయ్య, ఎర్రయ్య, పాస్టర్ బాబురావు పేదలను నమ్మించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల రెవెన్యూ సర్వేనెంబర్ 147, 148, 149లో సుమారు 62 ఎకరాల భూదాన్ భూమి ఉందని, దానిని ప్రభుత్వం ప్లాట్లు చేసి పేదలకు ఇచ్చేందుకు తమకు అప్పగించిందని చెప్పారు. ప్రస్తుతం కొత్త కలెక్టరేట్ ఆఫీసు దగ్గరలో ఉన్న మట్టిగుట్ట వద్ద ఇండ్ల ప్లాట్లు ఉన్నాయని, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) సంస్థలో పేర్లు నమోదు చేసుకొని డబ్బులు కడితే 100 గజాల స్థలానికి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టాలిస్తారని నమ్మించారు. వారి మాటలు నమ్మిన వేపకుంట్ల గ్రామానికి చెందిన చెక్కల రామలక్ష్మి రూ.30 వేలు కట్టారు. తర్వాత వారందరూ ఆమెను వెలుగుమట్లలోని స్థలం వద్దకు తీసుకెళ్లి చూపించి.. ఇదే ప్లాటు అని చెప్పారు. ఆమె వారి మాటలు నమ్మి అక్కడ రేకుల షెడ్లు వేసుకొని పట్టాల కోసం ఎదురు చూడసాగింది. కానీ, ఇంతవరకు ఆమెకు పట్టా, స్థలం ఇవ్వలేదు. తాను కట్టిన డబ్బులు తీసుకున్న, ఇప్పించిన వారిని ఎన్నిసార్లు అడిగినా సమాధానం దాటవేయడంతోపాటు అసభ్యకరంగా తిట్టారు. ‘మీ దిక్కున్న చోట చెప్పుకోండి..” అని బెదిరిస్తున్నారని భాదితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెలుగుమట్ల భూముల ఆక్రమణ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



