టీజీఎంసీ వైస్ చైర్మెన్ డాక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా 550 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసినట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) వైస్ చైర్మెన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, గర్భవిచ్చిత్తి మందులను తప్పుగా వాడుతుండటంతో కిడ్నీలు, లివర్, హార్మోన్ వ్యవస్థకు నష్టం కలుగుతోందని తెలిపారు.దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదం లో పడుతోందని హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఉమాగౌరి, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి నకిలీ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశంసించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ రవీందర్ నాయక్‌ను కలిసి, అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఓల సమన్వయంతో ముందుకెళ్ల నున్నట్టు తెలిపారు. మెడికల్ కౌన్సిల్ అందించిచిన ఫిర్యాదులు, నమోదు చేసిన క్రిమినల్ కేసుల ఆధారంగా రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ లలితాదేవి 17 నకిలీ క్లినిక్స్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై దాడులు జరిపి చట్ట ప్రకారం సీజ్ చేశారని అభినందించారు. ఆ కేంద్రాలపై కీసర, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.



