ఆధిక్యత ఉన్నా అధికార పార్టీకి సీట్ల వెలితి
రెబెల్స్ బెడద.. లీడర్ల మధ్య సమన్వయ లోపం
తుది దశ పోరు యమా సీరియస్!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు దఫాల కంటే తుది విడత ఎన్నికల్లో ప్రలోభాలు భారీగానే సాగుతున్నాయి. దీనిపై కేసులు కూడా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలోని ఓ పంచాయతీలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి రెండో దఫా ఎన్నికల్లో ఓటుకు రూ.10వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ దఫా ఎన్నికల్లోనూ అందుకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రలోభాలు జరుగుతున్నాయి. సోమ, మంగళవారం రాత్రుల్లో డబ్బులు, చీరెలు, ఇంట్లో ఉపయోగించే వివిధ రకాల సామగ్రిని పంచుతున్నారు. మద్యం విషయంలో వెనక్కి తగ్గటం లేదు. దావత్‌లు భారీగా షురూ చేశారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలో చికెన్, మటన్ ధరలు పెంచేశారు. అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా బల్క్ ఆర్డర్లు ఇస్తున్నారు.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఎంసీ విస్కీ 90 ఎంఎల్ బాటిల్స్‌ను భారీగా కొనుగోలు చేసి గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేస్తోన్నట్టు తెలిసింది. పాయింట్ జేబులు, బండి కవర్లు, డిక్కీల్లో పట్టేందుకు ఇవి అనువుగా ఉండటం.. పంపిణీ కూడా తేలికవుతుందని దీనిని ఎంచుకున్నారు. కొన్నిచోట్ల కులసంఘాల పెద్దల వద్ద డబ్బు, మద్యం ఉంచుతున్నారు. వారి ద్వారా పంపిణీలు చేయించి గంపగుత్తగా ఓట్లు వేయించుకునే టెక్నిక్ పాటిస్తున్నారు. మహిళా సంఘాలు, కూలీల గుంపుల విషయంలోనూ ఇదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల అభ్యర్థులు పంపిణీల విషయంలో ఓ అవగాహనకు వచ్చినా.. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరు అదనంగా పంచుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇలాంటి ప్రలోభాలకు సంబంధించిన చర్యలు ఆధారాలతో నిరూపితమైతే ఎన్నికలను రద్దు చేయొచ్చు. కానీ ఎక్కడా ఎలక్షన్ కమిషన్ అటువంటి చర్యలేవీ తీసుకున్న దాఖలాలు లేవు.
లీడర్స్ మధ్య సమన్వయ లోపం
ప్రధాన పార్టీల లీడర్ల మధ్య సమన్వయ లోపం ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అధికార పార్టీని రెబెల్స్ బెడద ఎక్కువగా వేధిస్తోంది. కొన్నిచోట్ల సస్పెన్షన్ చర్యలు తీసుకున్నా ఏమాత్రం వెరవకుండా తిరుగుబాటుదారులు పోటీకి సై అంటున్నారు. ఖమ్మం జిల్లాలో చివరి విడత ఎన్నికలు జరిగే సత్తుపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే అక్కడి ఎమ్మెల్యే మట్టా రాగమయి హెచ్చరించినా.. కొందరిపై సస్పెన్షన్ వేటువేసినా తిరుగుబాటుదారులు అదే పార్టీకి చెందిన ఓ గ్రూపు మద్దతుతో బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో కొన్నిచోట్ల ప్రధాన ప్రతిపక్షంతో అధికార పక్షం రెబెల్ అభ్యర్థులు అవగాహనకు వచ్చారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా కొన్నిస్థానాలను కోల్పోవాల్సి వచ్చింది.
కొన్నిచోట్ల పార్టీ నిలిపిన అభ్యర్థులు రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా ఇలాంటి సీనే రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. రెండు దఫాల ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం అయినా.. రెబెల్స్ కారణంగా రావాల్సిన స్థానాల్లో కొన్నింటిని కోల్పోయే ప్రమాదం ఉంది. క్రమశిక్షణా చర్యల విషయంలో అధికార పార్టీ అనుసరించే ఉదాసీన వైఖరి కూడా రెబెల్ అభ్యర్థుల్లో భయాందోళన లేకపోవటానికి కారణమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలోనూ ఇదే తరహాలో అధికార పార్టీ పరిస్థితి ఉన్నట్టుగా గత రెండు విడతల ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. మొదటి, రెండో విడత కంటే మలి దశ పోరు యమ సీరియస్‌గా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.



