నేడు చెక్‌లు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణ గర్వపడేలా చేసిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులు అందించనుంది. ఈ మేరకు ఈ రెండేండ్లలో సత్తా చాటి మెడల్స్ గెలుచుకున్న క్రీడాకారుల జాబితాను సిద్ధం చేసిన తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు జాబితా సిద్ధం చేసింది. డెఫ్ ఒలింపిక్స్‌లో మెడల్స్ నెగ్గిన ధనుశ్ శ్రీకాంత్‌తో పాటు పలు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన ఆర్చర్ చికిత, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, అథ్లెట్ అగసార నందిని సహా 50-60 మంది క్రీడాకారులకు నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెక్‌లను అందజేయనున్నారు.
శుక్రవారం సీఎంను ఆయన నివాసంలో కలిసిన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, శాట్జ్ ఎండీ సోనీబాలా దేవిలు గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో ప్రతిభావంతులైన తెలంగాణ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు.



