Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసొసైటీల అకౌంట్లలో నగదు జమ చేయాలి

సొసైటీల అకౌంట్లలో నగదు జమ చేయాలి

- Advertisement -

రాష్ట్ర మత్స్యశాఖ మాజీ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌

టెండర్ల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే సొసైటీల అకౌంట్లలో నగదు జమ చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ మాజీ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌, అభివృద్ధి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాలి సత్యనారాయణ, అఖిలభారత మత్స్యకారులు, మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మెన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టెండర్లు పిలిచినా, కేవలం 72 మంది మాత్రమే స్పందించారని, అనేక జిల్లాల్లో ఒక్కరే టెండర్‌ వేసిన పరిస్థితి ఉందని తెలిపారు. టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు, రింగ్‌లకు అవకాశం ఉండటంతో మత్స్యకారుల సొమ్ము దళారీలు, అధికార పార్టీ పెద్దలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల్లో మత్స్యకారుల పట్ల ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.

కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చుపెట్టే రూ.122.55 కోట్లను ప్రతి మత్స్య సొసైటీ ఖాతాలో జమ చేయాలని కోరారు. లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, ఎన్సీడీసీ, ఎన్‌ఎఫ్‌డీబీల ద్వారా రూ.1000 కోట్ల రుణాలు 90 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ, హైదరాబాద్‌ జిల్లా మత్స్యశాఖ ఫెడరేషన్‌ అధ్యక్షులు కొప్పు పద్మ, మత్స్య కార్మిక సంఘం మహిళా విభాగం రాష్ట్ర కో-కన్వీనర్లు బక్కి బాలమణి, గాండ్ల అమరావతి, రంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్‌ నీరటి అనురాధ, గోల్నాక మత్స్య సొసైటీ మహిళా నాయకులు మురారి పుష్పలత, వంగలి లక్ష్మీ, గౌటి లక్ష్మి, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం నాయకులు టి.కృష్ణమూర్తి, ఎం.సైదులు, సౌల్ల లలిత, సికింద్రాబాద్‌ తుకారం గేట్‌ నాయకులు కే.పుష్పలత, కే.లక్ష్మి, ముషీరాబాద్‌ నాయకులు టి అన్నపూర్ణ, రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -