– టీఎంకేఎంకే డిమాండ్
– రేపు మత్స్యకారుల మహాధర్నాకు పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉచిత చేప పిల్లల కోసం సొసైటీ ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకే) డిమాండ్ చేసింది. మత్స్యకారుల ‘జాతీయ డిమాండ్స్ డే’ను పురస్కరించుకుని ఈనెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొరెంకల నర్సింహ్మ, లెల్లెల బాలకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకర్లతో మాట్లాడారు. గత పదేండ్ల నుంచి ఉచిత చేప పిల్లల పేరుతో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఉచిత చేప పిల్లల కోసం కేటాయించే బడ్జెట్‌లో 20శాతం కూడా మత్స్యకారుల సహకార సంఘాలకు అందలేదని విమర్శించారు. మత్స్యకారుల కోసం 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన 100 శాతం నిధులను మత్స్యకారుల సొసైటీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
దీంతోపాటు 50 ఏండ్లు నిండిన మత్స్యకారులకు రూ.5వేలు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని కోరారు. ప్రతి మత్స్యకార సొసైటీకి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. సహజంగా మరణించిన మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన డబ్బులు బ్రోకర్లకు, అవినీతి అధికారులకు కమీషన్ల రూపంలో ఉపయోగ పడ్డాయని విమర్శించారు. ఉచిత చేప పిల్లల పేరుతో టెండర్ల ద్వారా 80శాతం దళారీలు, అవినీతి అధికారులు దోచుకునే విధంగా ప్రభుత్వం అమలు చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మత్స్యకారులకు అన్యాయం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అడవులు, కంటోన్మెంట్ ఏరియాల్లో ఉన్న జల వనరుల్లో మత్స్యకారులు, మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశాలు కల్పించి ఆ వర్గాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాథమిక, జిల్లా మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అడహాక్ కమిటీలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాలు, ముదిరాజ్, గంగపుత్ర సంఘాలు భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఉచిత చేప పిల్లల కోసం సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES