Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుల ఆధారిత వివక్ష సరికాదు

కుల ఆధారిత వివక్ష సరికాదు

- Advertisement -

– రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానహక్కులు : ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య
– దళితులతో ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు
– ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటన
నవతెలంగాణ-కామారెడ్డి/కంఠేశ్వర్‌

భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రతిపాదించిందని, సమాజంలో కులాల ఆధారంగా ఉన్న వివక్షలు, విభేదాలు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించే హక్కులు కలిగి ఉన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను నిర్మూలించడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని నర్సన్నపల్లి గ్రామంలో దళితులు దేవాలయంలోకి రాకూడదని కులం పేరుతో దూషించిన విషయమై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయగా.. విచారణకు అధికారులు వస్తామని రాకపోవడంతో గ్రామ దళితులంతా కలిసి చలో కలెక్టరేట్‌కు వెళ్లడం.. పోలీసులు అడ్డుకోవడంతో గొడవలు చోటుచేసుకున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ భక్తి వెంకటయ్య బుధవారం నరసన్నపల్లి గ్రామానికి వచ్చి.. సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని దళితులకు అన్ని దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంతోపాటు సహపంక్తి భోజనాలు నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు, సామాజిక కార్యక్రమాలు, పండుగలు వంటి అన్ని వేదికల్లో ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కుల వివక్ష లేదా దళితులపై ఏ విధమైన అన్యాయం జరిగినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ విక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం సమానత్వం, సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో సామాజిక ఐక్యత పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్‌ రవి, డీటీడివో సౌజన్య, తహసీల్దార్‌ హిమబిందు, ఎంపీడీవో, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రశ్నించి పోరాడితేనే దళితుల సమస్యలకు పరిష్కారం
తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క దళితుడూ ప్రశ్నించాలని, లక్ష్యసాధన కోసం శ్రమిస్తే ఫలితం తప్పక సిద్ధిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ ఒక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్స్‌ భవన్‌లో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కె.రామ్మోహన్‌ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనేక శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో పనిచేస్తున్న సిబ్బందికి ఇంక్రిమెంట్లు, రెగ్యులరైజేషన్‌, ప్రొబేషన్‌ ఉత్తర్వులు ఇవ్వటానికి గత మూడు సంవత్సరాలుగా అధికారులు వేధించారని, కమిషన్‌ జోక్యం చేసుకొని ఆ సమస్యని పరిష్కరించిందని 223మందికి న్యాయం చేసినట్టు చెప్పారు. తెలంగాణ యూనివర్సిటీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌, జిల్లా కలెక్టరేట్‌లో రిజర్వేషన్ల అమలు, ప్రమోషన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యక్షంగా తాను రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -