నిండు గర్భిణి అయిన కోడలిని నరికి చంపిన మామ
ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-దహెగాం
కొడుకు వేరే సామాజిక తరగతికి చెందిన యువతిని ప్రేమ పెండ్లి చేసుకోవడం ఇష్టంలేని తండ్రి.. పగ పెంచుకుని.. నిండు గర్భిణిగా ఉన్న కోడలిని నరికి చంపాడు. ఈ ఘటన కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గెర్రె గ్రామానికి చెందిన శివార్ల శేఖర్ (బీసీ), ఎదురింటి రాణి(ఎస్టీ) ప్రేమించుకున్నారు. అయితే, వేర్వేరు సామాజిక తరగతులు కావడంతో శేఖర్ తల్లిదండ్రులు పెండ్లికి ఒప్పుకోలేదు. అయినా, ప్రేమికులిద్దరూ పెండ్లి చేసుకుని యువతి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. ఇది శేఖర్ తండ్రి సత్తయ్యకు ఇష్టం లేదు. సత్తయ్య శేఖర్ ఎదురుపడ్డప్పుడల్లా ప్రతిరోజూ కులం తక్కువ అమ్మాయిని చేసుకున్నావంటూ దుర్భాషలాడేవాడు.
ఊరిలో పరువు పోయిందని గొడవ పడుతుండేవాడు. రాణి ప్రస్తుతం నిండు గర్భిణి. శనివారం శేఖర్ తన అత్తమామతో కలిసి సమీప అడవిలోకి కట్టెల కోసం వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన సత్తయ్య.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలు రాణి వద్దకెళ్లి గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. రేపోమాపో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణి హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి చెన్నయ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదొద్దీన్, సీఐ కుమారస్వామి, పెంచికల్‌పేట్ ఎస్‌ఓ అనిల్, తహసీల్దార్ మునావర్ షరీఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు సత్తయ్య పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.