Wednesday, July 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికుల దురహంకార హత్యలు-సమాధానం కోరుతున్న ప్రశ్నలు

కుల దురహంకార హత్యలు-సమాధానం కోరుతున్న ప్రశ్నలు

- Advertisement -

ఇప్పుడు కులం ఎక్కడుంది? అనే వాళ్లకి జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం కిషన్‌రావుపేటలో 17జులై 2025న హత్యగావించబడ్డ నేతకాని కులానికి చెందిన సల్లూరి మల్లేష్‌ హత్య తిరుగులేని సమాధానంగా నిలుస్తున్నది. అంతేకాదు కులవ్యవస్థ సహజ లక్షణమైన నిమ్నోన్నతాల భేదభావం మనుషులను పశుతుల్యులుగా ఎలా మార్చగలదో, మానవత్వం కన్నా పరువు ప్రతిష్టలే విలువైనవన్న వికృత ఆలోచనలు మనుషుల బుర్రల్లో తిష్టవేస్తే ఏం జరగగలదన్న దానికి ఈ సంఘటనే తిరుగులేని ఉదాహరణ. దీనిపై ప్రశ్నలకు, సందేహాలకు సమాధానంగా నిలవడంలో మొదటిది మాత్రం కాదు, చివరిది కూడా కాకపోవచ్చు.
సల్లూరి మల్లేష్‌ షెడ్యూల్డ్‌ కులమైన నేతకాని కులానికి చెందిన, ఇంటర్‌ వరకు మాత్రమే చదువుకున్న యువకుడు. తను స్వయంగా ట్రాక్టర్లను, డోజర్లను, హార్వెస్టర్లను అద్దెకు తీసుకొని గ్రామంలో అవసరం ఉన్నవాళ్లకి వాటితో పనిచేసి పెట్టి పొట్టపోసుకుంటున్నాడు. ఇలా స్వశక్తితో ఉపాధి కల్పించుకుని ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. ఇతనికి అదే గ్రామంలో మున్నూరు కాపు కులస్తుడైన నైనాల రాజిరెడ్డి కూతురితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇది రెండేండ్లపాటు సజావుగానే సాగింది.ఇంట్లో పెద్దలకి తెలిసిన తర్వాత కష్టాలు మొదల య్యాయి. సహజంగానే నిచ్చల మెట్ల కులవ్యవస్థలో మధ్య స్థాయిలో ఉన్న అమ్మాయి అట్టడుగున ఉన్న అబ్బాయికి మధ్య స్నేహాన్ని అమ్మాయి కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. మరీ ముఖ్యంగా తండ్రి రాజిరెడ్డికి ఈ వ్యవహారం సుతరాము నచ్చలేదు. 2022లో ఈ ప్రేమ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని అమ్మాయి తండ్రి రాజిరెడ్డి, మల్లేష్‌పై తీవ్రంగా దాడిచేసి గాయపరిచాడు. అప్పుడు మల్లేష్‌ ఫిర్యాదు మేరకు అమ్మాయి తండ్రి రాజిరెడ్డి అతని తమ్ముడు మల్లారెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశాడు. ఇది ఓవైపు నడుస్త్తుండగానే కొన్నాళ్ల తర్వాత వారి మధ్య ప్రేమ తిరిగి యధావిధిగా కొనసాగింది. ఇది గిట్టని రాజిరెడ్డి అమ్మాయితో బలవంతంగా నాలుగు వేధింపు కేసులు కూడా మల్లేష్‌పై నమోదు చేయించాడు. అమ్మాయి తండ్రి నైనాల రాజిరెడ్డి ఆటో నడుపుకుంటూ ఉంటాడు. ఇరవై గుంటల భూమి మాత్రమే ఉంది. ఆర్థికపరంగా చూస్తే మల్లేష్‌ కాస్త ఆర్థికంగా బాగానే ఉన్నాడు.ఇక్కడే మనం సమస్యను అర్థం చేసుకోవ డానికి కీలకమైన విషయం గమనించాలి. రాజిరెడ్డి కూటికి పేదవాడైతే కావచ్చు గాని కులానికి కాదు కదా! ఈ కుల దురహంకారం జీర్ణించుకున్న ఆయన పలుమార్లు మల్లేశ్‌ను బెదిరించాడు, ఘర్షణకు దిగాడు. దీనికితోడు పోలీసులు కూడా పక్షపాత వైఖరి అవలంభించి మల్లేశ్‌ పై రౌడీషీట్‌ తెరిచారు. ఈ నేపథ్యాన్ని అంతా పరిశీలిస్తే వారిద్దరి పెండ్లికి అడ్డొస్తున్నదేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు, కులం.
విషయం ఇలా కొనసాగుతుండగా తనపై 2022లో దాడి చేసినందుకుగాను రాజిరెడ్డి అతని సోదరుడు మల్లారెడ్డిలపై మల్లేష్‌ పెట్టిన ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కేసు ఈ నెల18న మల్లేష్‌ సాక్షాన్ని నమోదు చేయాల్సిన హియరింగ్‌ ఉంది. బహుశా అది నమోదైతే తనకు శిక్ష ఖాయమని రాజిరెడ్డి నిశ్చయించుకున్నాడు. రాజిరెడ్డి మల్లేష్‌ను హత్య చేస్తే కూడా అదే శిక్ష పడుతుందని, పైగా ఒకవేళ తన కూతురు మల్లేష్‌ను వివాహం చేసుకుంటే పోయే పరువు, తనకు జరిగే అవమానం కూడా తప్పిపోతుందన్న కుల దురహంకారంతో వి చక్షణ కోల్పోయిన రాజిరెడ్డి 17వ తేదీన మల్లేష్‌ను తన సోదరుడు మల్లారెడ్డి, వారి సన్నిహితులు కొందరితో కలిసి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపాడు. ఇది విషాదకర ఘటన. అయినప్పటికీ దీన్ని సాధారణంగానే చూసే సమాజం అనేక ప్రశ్నల్ని సందిస్తున్నది. తనకన్నా పైన ఒకరున్నారన్న దాని కన్నా, తన కంటే కింద ఒకరున్నారన్న విషయం మనిషిని ఇన్ని వేల ఏండ్లుగా ఎలా తృప్తి పరచగలు గుతున్నది? కుల వ్యవస్థ స్వయంచాలితం, స్వయం ఉత్పాదకం కావడానికి ఎలా దోహదపడుతున్నది? పరువు అనే భావన, మనిషి ఆలోచన, చైతన్యాలను ఎలా ఏమార్చగలుగుతున్నది?
వారు ఆయా స్థానాల్లో ఉండి వందల ఏండ్లుగా అమలై, తమ జీవితాల్లో భాగమై ఒక సంస్కృతిగా స్థిరపడి వ్యతిరేకించటానికి వీలు లేని ఒక బలవత్తరమైన ఛట్రంలో ఇమిడిపోయి ఉండటం దానికి ప్రధాన కారణం. అందులో నుంచి బయటపడటానికి మార్గం ఏదీ లేక పోవడం వల్ల తమ జీవితాల్లో పేరుకుపోయిన ఒత్తిడిని, పీడనని కింది కులాలపై ప్రయోగించడం ద్వారా రిలీజ్‌ చేసుకునే నిర్మాణ స్వరూపం ఈ కుల వ్యవస్థలో ఇమిడి ఉండటం మరో అంశం. ఈ కారణం వల్లనే వందల ఏండ్లపాటు ఈ వ్యవస్థ కొనసాగుతున్నది. తప్పించుకోలేని పీడన, ఒత్తిడి కలిగించే ఏ వ్యవస్థ అయినా దాన్ని తగ్గించడానికి ఎదో ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని అంతర్గతంగా సృష్టించటం తప్పనిసరి కదా, లేకపోతే ఆ వ్యవస్థ బద్దలవుతుంది. అయితే కుల వ్యవస్థ తనను తాను స్వయంఉత్పాదకం చేసుకోవడానికి పై కులాలకు తలొగ్గి ఉండటం, గౌరవించడం మాత్రమే కాదు, కింది కులాల నుంచి గౌరవం పొందడం కూడా ఒక ప్రధాన కారణం.
దీనర్థం ఏమిటంటే కుల వ్యవస్థ ఏ అంచెలో చూసినా ప్రతి అంచ తీవ్రమైన పీడనను పొందుతూ దాన్ని కిందికి నెట్టివేస్తూ తిరిగి కింది నుండి కాస్త రిలీఫ్‌ పొందుతూ పై వర్గాలకు రిలీఫ్‌ అందిస్తూ తనను తాను సంతులితం చేసుకోవడం, ఈ విష వలయం నుంచి బయటపడే మార్గాలను మూసివేయడం ఈ వ్యవస్థ దశాబ్దాలపాటు కొనసాగటానికి కారణమైంది, మన్నికైన వ్యవస్థగా ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పించింది. సుదృఢమైన ఈ కుల వ్యవస్థ భారతదేశాన్ని ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక్కటిగా నిలబెట్టిందని గాంధీ అనగలిగారంటే కారణం ఇదే.ఈ వ్యవస్థ సృష్టించిన పరువు అనే భావన, మానవత్వాన్ని, చైతన్యాన్ని ఏమార్చి, మనుషులు విచక్షణా రహితమైన హింసకు పాల్పడడానికి ఎలా కారణం కాగలుగుతున్నది? అన్న ప్రశ్న మిగిలే ఉంది. మనిషి స్వార్థజీవి అన్న అభిప్రాయానికి జనసామాన్యంలో మాత్రమే కాదు, ఆలోచనపరుల్లో సైతం విస్తృతమైన ఆమోదమే ఉంది.
మనుషులు పరువు కోసం చేసే హత్య వల్ల వారికి శిక్ష పడుతుందన్నది తెలిసే ఆ పని చేస్తున్నారు. శిక్ష అనుభవించటం సుఖమేమీ కాదు. సాధారణంగా స్వార్థం అంటే మనిషి సౌఖ్యం కోసం వెంపర్లాడటం, తాను, తన వాళ్లు మాత్రమే సుఖంగా ఉండాలని అనుకోవడం అనే అర్థం చెప్పుకోవచ్చు.అయితే పరువు కోసం లేదా కుటుంబ గౌరవం కోసం పాల్పడే హింస ఆయా వ్యక్తులకు సౌఖ్యాన్ని ఏమి తెచ్చిపెట్టదు, శిక్షలనే తెచ్చిపెడుతుంది. అయినా మనుషులు తమకున్న ఆధిప్యత వైఖరితో కష్టాలను ఎందుకు తెచ్చుకుం టున్నారు? కుల వ్యవస్థ స్వరూపంలో, మానవ స్వభావంలో, ఆచరణలో ఈ వైరుధ్యాన్ని సృష్టించగల నిర్మాణం ఏదైనా దాగి ఉందా? కుల వ్యవస్థలో దాగి ఉన్న హెచ్చుతగ్గుల భావన మనుషులను ముక్కలు ముక్కలుగా నరికి, చీల్చి వేసి ఏకాకులను చేసిన మాట కాదనలేని వాస్తవం. తమ అస్తిత్వాన్ని, తమ స్వేచ్ఛను సమూహపు అస్తిత్వంలో సమూహపు స్వేచ్ఛలో వెతుక్కునే సామాజిక నిర్మాణం ఉండి ఉంటే అందరి మధ్య ఐక్యతకు మానవత్వం ఒక అం తర్లీన సూత్రీ కరణగా ఉండేది. కానీ ఈ దేశంలో నిర్మాణంలో ఉన్న కులం మనుషులను పక్కవాళ్లతో ఎటువంటి సంబంధం లేకుండా తమ విశిష్టతను కాపాడుకో వటమే అత్యున్నతమైన జీవిత విధానంగా మారడం. అదే వారి జీవితపు పరమావధిగా భావించే విధంగా ఆలోచన సరళిని రూపొందిం చడం. దాన్ని కట్టుదిట్టంగా, నిరంకుశంగా అమలు చేయడం మనుషులు ఇంత అమానవీయంగా వ్యవహరించడానికి కారణం.

టి.హరికృష్ణ
9494037288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -