Monday, January 19, 2026
E-PAPER
Homeజాతీయంవర్సిటీల్లో పెరుగుతున్న కులవివక్ష

వర్సిటీల్లో పెరుగుతున్న కులవివక్ష

- Advertisement -

118 శాతం పెరిగిన ఫిర్యాదులు : యూజీసీ
పార్లమెంటరీ కమిటీ, సుప్రీంకోర్టుకు డేటా అందజేత

న్యూఢిల్లీ : గత ఐదేండ్ల కాలంలో దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలల్లో కులవివక్షకు సంబంధించిన ఫిర్యాదులు 118.4 శాతం పెరిగాయి. పార్లమెంటరీ కమిటీకి, సుప్రీంకోర్టుకు సమర్పించిన డేటాలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఈ విషయాన్ని తెలియజేసింది. కులవివక్షకు సంబంధించి 2019-20లో 173 ఘటనలు నమోదు కాగా, 2023-24లో ఆ సంఖ్య 378కి పెరిగింది. 704 యూనివర్సిటీలు, 1,553 కళాశాలలకు సంబంధించి ఈక్వల్‌ ఆపర్చునిటీస్‌ సెల్స్‌ (ఈఓసీలు), ఎస్సీ, ఎస్టీ సెల్స్‌ నుంచి 2019-20, 2023-24 మధ్యకాలంలో యూజీసీకి 1,160 ఫిర్యాదులు అందాయి. వీటిలో 1,052 ఫిర్యాదులను (90.68 శాతం) పరిష్కరించారు. ఇదే కాలంలో పెండింగ్‌ కేసుల సంఖ్య 18 నుంచి 108కి పెరిగింది.

నిలకడగా పెరుగుతున్న కేసులు
విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సంవత్సరాల వారీగా యూజీసీ అందజేసిన డేటాను పరిశీలిస్తే కులవివక్ష కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2020-21లో 182, 2021-22లో 186, 2022-23లో 241 కేసులు నమోదయ్యాయి. 2023-24లో అవి మరింతగా పెరిగి 378కి చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఈక్వల్‌ ఆపర్చునిటీస్‌ సెల్స్‌ పనితీరుపై విద్యార్థుల్లో అవగాహన పెరగడంతో ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని యూజీసీ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ విభాగాలు కేసులను క్రియాశీలకంగా పరిష్కరిస్తున్నాయని ఆయన తెలిపారు.

నిష్పాక్షికతపై ప్రశ్నలు
ఫిర్యాదులు అందుతున్నా, వాటి పరిష్కారం నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఎన్‌. సుకుమార్‌ ది వైర్‌తో మాట్లాడుతూ చాలా ఎస్సీ, ఎస్టీ సెల్స్‌ పరిపాలనా యంత్రాంగం నియంత్రణలో పనిచేస్తాయని చెప్పారు. వాటి సభ్యులు పరిపాలనా యంత్రాంగం చేత నామినేట్‌ చేయబడినందున వారికి నిర్ణయాధికారాలు లేవని తెలిపారు. ఇది తీవ్రమైన కేసులలో నిష్పాక్షికతపై ప్రభావితం చేస్తుందని చెప్పారు. జవహర్లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) ఫ్యాకల్టీ మెంబర్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ మాజీ సభ్యుడు డికె లోబోయల్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సెల్స్‌ స్వయంప్రతిపత్తి కాలక్రమేణా క్షీణించిందని అన్నారు. కొనసాగుతున్న వివక్ష, వాటిపై ఫిర్యాదు చేయడం పెరిగాయని అన్నారు.

ముసాయిదా నియంత్రణలపై నోటిఫికేషన్‌
గతేడాది సుప్రీంకోర్టుకు యూజీసీ సమర్పించిన ముసాయిదా ఈక్విటీ నియంత్రణలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పిటిషనర్లలో ఒకరైన రోహిత్‌ వేముల తల్లి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో యూజీసీ గత వారం ముసాయిదా నియంత్రణలను నోటిఫై చేసింది. విమర్శకులు లేవనెత్తిన కొన్ని అంశాలకు వాటిలో పరిష్కారాలు చూపింది. ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ ఆపర్చునిటీస్‌ సెంటర్లు, 24/7 హెల్ప్‌లైన్లు, ఇతర ఆన్‌లైన్‌ ఫిర్యాదుల యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది.

రోహిత్‌ వేముల మరణం తర్వాత…
గత సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు యూజీసీ ఈ డేటాను సమర్పించింది. హైదరాబాద్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల మరణించిన తర్వాత దాఖలైన పిటిషన్‌ ఆధారంగా… 2012 నిబంధనల ప్రకారం కులవివక్ష డేటాను సేకరించాలని సుప్రీంకోర్టు గత ఏడాది యుజిసిని ఆదేశించింది. యూనివర్సిటీ ప్రాంగణాలలో జరుగుతున్న కుల ఆధారత వివక్షను నివారించడానికి యూజీసీ జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని పిటిషనర్‌ కోరారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో యూజీసీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశంలోని 3,522 ఉన్నత విద్యా సంస్థల నుంచి స్పందన లభించిందని అందులో తెలిపింది. ఈక్వల్‌ ఆపర్చునిటీస్‌ సెల్స్‌, ఎస్సీ, ఎస్టీ సెల్స్‌ నుంచి 1,503 ఫిర్యాదులు అందగా 1,426 ఫిర్యాదులను పరిష్కరించామని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -