అందరి నిగ్గుతేలుస్తాం.. ఒక్కొక్కరి సంగతి చూస్తాం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక బయటపెడతాం
2014 జూన్ 2 నుంచి లీజు నిర్ణయాలపై దర్యాప్తు
బీఆర్‌ఎస్ హయాంలో హరీశ్‌రావు, కేటీఆర్ అక్రమాలు
మంత్రులను బెదిరించి లొంగదీసుకోవాలనే ప్రయత్నం
పొంగులేటికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధం లేదు
ఆస్తి తగాదాలతో కవితను బయటికి పంపిన కేటీఆర్
అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరితీయండి : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
పొంగులేటి రాజీనామా చేయాలి.. రాఘవ కన్‌స్ట్రక్షన్ అక్రమాలపై హౌజ్‌కమిటీ వేయాలి.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2014, జూన్ రెండు నుంచి ఇప్పటి వరకు ఇసుక, అక్రమ మైనింగ్ నిర్ణయాలపై దర్యాప్తు జరుపుతామని వివ రించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను బయటపెడతామన్నారు. అందరి నిగ్గుతేలుస్తామనీ, ఒక్కొక్కరి సంగతి చూస్తామని అన్నారు. శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సంద
ర్భంగా అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభ దద్దరిల్లింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సభ వేడెక్కింది. బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే కొందరు బైఠాయించారు. చప్పట్లు కొడుతూ పొంగులేటి రాజీనామా చేయాలనీ, తప్పు చేయకుంటే హౌజ్ కమిటీ వేయడానికి భయమెందుకు అని నినాదాలు చేశారు.
బీఆర్‌ఎస్ సభ్యులు వారి స్థానాల్లో కూర్చోవాలనీ, వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం సరైంది కాదని ప్యానెల్ స్పీకర్ బాలునాయక్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్ వెంకటస్వామి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అక్రమాలపై హౌజ్‌కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరింది. తాను అసత్య ఆరోపణలు చేస్తే ఉరితీయాలనీ, సభ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు గండిపడ్డా ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవరినీ ఉపేక్షించబోమని అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి నోటీసు ఇచ్చింది, చర్యలు తీసుకో వాలని చెప్పింది ప్రభుత్వమేనని చెప్పారు.
సీనరేజ్ ఫీజు కింద రూ.1,52,97,825, పర్మిట్ ఫీజు కింద రూ.1,22,25,446 మైనింగ్ శాఖకు ఆ కంపెనీ చెల్లించిందని వివరించారు. విపక్ష సభ్యులెవరూ దీనిపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఆదాయాన్ని రాబట్టామని అన్నారు. మంత్రిపై బురద జల్లాలనీ, పైరవీలు చేసుకోవాలనీ, బ్లాక్‌మెయిల్ చేయాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బ్లాక్‌మెయిల్‌కు ఈ ప్రభుత్వం భయపడబోదని స్పష్టం చేశారు. మంత్రికి ఇందులో పాత్ర ఉంటే నోటీసులు ఇచ్చేవాళ్లమా?అని ప్రశ్నించారు. ప్రతిరూపాయి ఖజానాకు రావాలని అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక మాఫియాపై సంతోష్‌రావు తండ్రి రవీందర్ రావుపై, శిరీష జియో గ్రానైట్స్ అక్రమాలు, హరీశ్‌రావు తమ్ముడు మహేశ్‌రావు మిడ్‌వెస్ట్ గ్రానైట్స్ దోపిడీ, గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్‌పై ఈడీ విచారణ జరుగుతున్నదనీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గాయత్రి గ్రానైట్స్‌పై విచారణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తోపాటు వీటిన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. విచారణలో నిజాలు నిగ్గుతేలు స్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేండ్లపాటు ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పేరుతో కేటీఆర్, హరీశ్‌రావు సంపదను కొల్లగొట్టారని అన్నారు. అందుకే 2014 జూన్ రెండు నుంచి ఇసుక, మైనింగ్ లీజులు, ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ జరుపుతామని చెప్పారు. లొంగని మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో మంత్రికిగానీ, వారి కుటుంబానికిగానీ ఎలాంటి సంబంధంలేదన్నారు. కేటీఆర్, కవితకు ఆస్తితగా దాలున్నాయని చెప్పారు. సొంత చెల్లెలిని ఇంటినుంచి బయటికి పంపారని అన్నారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : హరీశ్‌రావు
మినరల్ డీలర్ లైసెన్స్, పీసీబీ అనుమతి లేకుండా శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత టి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.పది వేలు జరిమానా, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.25 వేలు జరిమానాతోపాటు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించాలని చట్టంలో ఉందన్నారు. లైసెన్స్, ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు పీసీబీ, మైనింగ్ శాఖలు రెండుసార్లు షోకాజు నోటీసులు పంపాయనీ, ఆ క్రషర్‌ను సీజ్ చేయాలని కోరాయని గుర్తు చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ ఎవరిదో తెలియదా?అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై తాను ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓ పత్రికలో దానిపై స్పందించారని వివరించారు. మైనింగ్ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా కూడా ఉందన్నారు.
తాను అసత్య ఆరోపణలు చేస్తే ఉరితీయాలనీ, సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. కానీ రాష్ట్ర ఖజానాకు నష్టం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే తమ్ముడు తప్పు చేశారంటూ నెలరోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కుటుంబానికి ఒక న్యాయం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు మరో న్యాయమా?అని ప్రశ్నించారు. మూసీ కాలుష్యం ఉండొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని అన్నారు. పేదల ఇండ్లు కూలగొడుతున్నారని చెప్పారు. గండిపేట, ఉస్మాన్‌సాగర్ జంటజలాశయాల నీటి కాలుష్యానికి రాఘవ కన్‌స్ట్రక్షన్ కారణమని మైనింగ్ శాఖకు పీసీబీ లేఖ రాసిందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశాక విచారణ జరపాలని కోరారు. గతంలో ఓబుళాపురం గనుల అక్రమాలపై నాగం జనార్ధన్‌రెడ్డి హౌజ్‌కమిటీ వేయాలని ప్రశ్నిం చారని గుర్తు చేశారు. నాగం చైర్మెన్‌గా నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హౌజ్‌కమిటీ వేశారని చెప్పారు. అదే తరహాలో ఈ ప్రభుత్వం ముందు కొచ్చి ప్రతిపక్ష సభ్యుడు చైర్మెన్‌గా హౌజ్‌కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.
చిన్నపిల్లల్లా అల్లరి సరికాదు : భట్టి
వెల్‌లోకి వచ్చి నిరసన తెలపడం, చప్పట్లు కొట్టడంతో గతంలో సభలో ఎప్పుడైనా జరిగిందా?అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. చిన్నపిల్లల్లా అల్లరి చేయడమెంటని అడిగారు. వాకౌట్ చేయడానికే వారు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారని అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు సభను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం సరైంది కాదన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఒక వ్యక్తిని, కంపెనీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. ఆ మంత్రి రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు డైరెక్టర్ కాదనీ, చైర్మెన్ కాదని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉండొద్దా?అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరారు.
హరీశ్‌రావు స్పందిస్తూ మంత్రుల కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉండడం తప్పు కాదన్నారు. అనుమతి లేకుండా, లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం సరైంది కాదన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాం నుంచి మైనింగ్ లీజులు, ఇసుక నిర్ణయాలపై శాఖాపరమైన విచారణ జరుపుతామని చెప్పారు. హౌజ్‌కమిటీ అవసరం లేదన్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియాపై విచారణ జరుపుతామని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా రోడ్లపై ధర్నాలు చేశామని గుర్తు చేశారు. కనీసం పాఠశాలల సమయంలోనైనా లారీలను ఆపాలంటూ కోరినా ఎవరూ స్పందించలేదని అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ఓ మంత్రిపై వ్యక్తిగతంగా ఏదో పెట్టుకుని హరీశ్‌రావు మాట్లాడ్డం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రుల పై ఆరోపణలు వచ్చాయనీ, అప్పుడు చర్యలు తీసుకుంటే ఆదర్శంగా ఉండేదని గుర్తు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ నేరెళ్ల ఘటనలో ఇసుక మాఫియా దళితులను లారీలతో తొక్కి చంపిందని అన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రిపై అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి అంశానికీ హౌజ్ కమిటీ అవసరం లేదన్నారు. అనంతరం విత్త పాలన, ప్రణాళిక, సర్వేలు, ఇంధన శాఖలకు సంబంధించిన పద్దులను ఆమోదిస్తున్నట్టు ప్యానెల్ స్పీకర్ బాలునాయక్ చెప్పారు. సభను ఆదివారం ఉదయం పది గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.



