టెల్ అవీవ్‌లో భారీ నిరసన
గాజాలో చిన్నారుల మరణాలపై మౌన ప్రదర్శన
టెల్ అవీవ్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అంతర్జాతీయ సమాజం నుంచే కాదు.. స్వంత దేశంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. గాజాపై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌లోని టెల్‌అవీవ్‌లో ప్రజలు ఆందోళనలు చేశారు. ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడుల కారణంగా గాజాలో మరణించిన చిన్నారుల కోసం వారు మౌన ప్రదర్శనను నిర్వహించారు. మరణాల సంఖ్య పెరుగుతున్నందున కాల్పులను విరమించాలని వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ దాడులలో చనిపోయిన పిల్లల పట్ల నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులను చేతబట్టుకొని నిరసనను తెలియజేశారు. ఈ ఆందోళనల్లో మహిళలతో పాటు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కాల్పులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ సైన్యం జరిపిన కాల్పుల్లో శనివారం 31 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా అధికారులు చెప్పారు. ఇజ్రాయిల్ వైమానికదాడుల్లో 28 మందికి పైనా చనిపోయారనీ, ఇందులో నలుగురు చిన్నారులూ ఉన్నారని తెలిపారు. ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి 57,762 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సగం మందికి పైగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు వివరించింది. 2023, అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయిల్ తీవ్రంగా విరుచుకుపడుతున్నది. హమాస్ టార్గెట్‌గా చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే.. సామాన్య ప్రజలపై విరుచుకుప డుతున్నది. చిన్నారులు, మహిళలు, పౌరులు అనే తేడా లేకుండా కాల్పులు, డ్రోన్లతో యుద్ధోన్మాన్ని ప్రదర్శిస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇజ్రాయిల్ తీరును అంతర్జాతీయ సమాజం, పౌర సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. అయి నా.. ఇజ్రాయిల్ తీరు మారలేదు. అమెరికా మద్దతుతో ఒక్క గాజా మీదనే కాకుండా ఇతర దేశాలపై యుద్ధాలకు దిగుతున్నదని మేధావులు ఆందోళనను వ్యక్తం చేశారు.ఇజ్రాయిల్ జరుపుతోన్న యుద్ధానికి వ్యతిరేకంగా ఆ దేశంలో గతంలోనూ ఆందోళనలు జరిగాయి. యుద్ధానికి ముగింపు పలకాలంటూ మేలో వేలాది మంది ఆందోళనకారులు ఆ దేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ”ఇజ్రాయిల్‌కు నిజమైన శుత్రవు హమాస్ కాదు.. ప్రజాస్వామ్య దేశాన్ని నాశనం చేస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహునే..” అని ఆందోళనకారులు చెప్పారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఇంకా సాగిస్తున్నారని తెలిపారు. గాజాలో తమ ఆపరేషన్‌లను మరింత విస్తరిస్తామని ఇజ్రాయిల్ అధికారులు చెప్తున్నారు. ఈ చర్యలను మాత్రం బందీల కుటుంబీకులు, ఇజ్రాయిల్‌లోని పౌర సమాజం అంగీకరించటంలేదు. నెతన్యాహు తన చర్యలతో బందీలను బలిచేస్తున్నారని ఇజ్రాయిల్ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాల్పులు విరమించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES