Sunday, May 11, 2025
Homeజాతీయంకాల్పుల విరమణ

కాల్పుల విరమణ

- Advertisement -

– భారత్‌, పాక్‌ అంగీకారం
– ఇరుదేశాల డీజీఎంఓ స్థాయి చర్చల్లో రాజీ : విక్రమ్‌ మిస్రీ
– అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి : ట్రంప్‌
– ఉగ్రవాదంపై రాజీపడం : కేంద్రమంత్రి జైశంకర్‌
గత కొన్ని రోజులుగా భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్టు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌- పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన స్వల్పవ్యవధిలోనే పాక్‌ క్షిపణులతో జమ్మూకాశ్మీర్‌పై విరుచుకుపడింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో బ్లాక్‌ అవుట్‌ ప్రకటించింది.
న్యూఢిల్లీ:
భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ.. ”మధ్యాహ్నం 3.35 గంటలకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్తాన్‌ డీజీఎంఓ భారత డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
భూ, గగన, సముద్రతలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారు” అని విదేశాంగ మంత్రి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు.
ఉగ్రవాదంపై రాజీపడం: జైశంకర్‌
ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్‌, పాక్‌ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
పాక్‌ కాల్పుల్లో ఐదుగురు మృతి
జమ్మూకాశ్మీర్‌ సీనియర్‌ అధికారి సహా…
సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు
తిప్పికొట్టిన భారత దళాలు
తాను ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను భారతదళాలు సమర్థవంతంగా నేలకూలుస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్‌ సరిహద్దు వెంబడి భారీ కాల్పులకు తెగబడుతోంది. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో పాక్‌ దళాలు శతఘ్నులతో జరిపిన కాల్పులలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన సీనియర్‌ అధికారి కూడా ఉన్నారు. భారతదళాల వైమానిక దాడులకు ప్రతిగా పాకిస్తాన్‌ శుక్రవారం రాత్రంతా సరిహద్దు ప్రాంతాలపై కాల్పులు జరుపుతూనే ఉంది. పాకిస్తాన్‌ సైనికులు పేల్చిన తుపాకీ గుండు ఒకటి రాజౌరి అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థాపా (55) నివాసంలో పడింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు. థాపా జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 1989లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. జమ్మూ శివారులోని రారుపూర్‌ ప్రాంతంలో జకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ఇంటిపై కూడా ఓ తుపాకీ గుండు పడింది. ఈ ఘటనలో ఆయన కన్నుమూయగా కుటుంబ సభ్యులు గాయపడ్డారు. పాక్‌ దళాల కాల్పులలో ఖేరీ జట్టాన్‌కు చెందిన అశోక్‌ కుమార్‌, ఆయన ముగ్గురు బంధువులు కూడా గాయాలపాలయ్యారు. దీంతో వారు సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. తాజా ఘటనలతో జమ్మూ ప్రాంతంలో పాక్‌ కాల్పులు, డ్రోన్‌-క్షిపణి దాడులలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో రాజౌరి పట్టణంలో ఉంటున్న ఇద్దరు బీహారీలు, పూంచ్‌లోని మెంధార్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఉన్నారు. తాజా ఘటనపై జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. థాపా శుక్రవారం ఉప ముఖ్యమంత్రి సురీందర్‌ కుమార్‌ చౌదరితో కలిసి జిల్లాలో పర్యటించారని గుర్తు చేసుకున్నారు. తన అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌ సమావేశానికి కూడా థాపా హాజరయ్యారని చెప్పారు. ‘రాజౌరి నుండి విషాదకరమైన వార్త అందింది. జమ్మూకాశ్మీర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసులకు చెందిన ఓ అంకితభావం కలిగిన అధికారిని కోల్పోయారు. దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇండ్ల నుంచి బయటికి రావద్దని ఆయన ప్రజలను కోరారు. వదంతులు నమ్మవద్దని, నిరాధారమైన కథనాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు.
రాత్రంతా దాడులు
ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని వివిధ నగరాలలో సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్‌ దళాలు డ్రోన్లతో శుక్రవారం రాత్రంతా దాడులు చేశాయి. పాకిస్తాన్‌ విమానాలు శ్రీనగర్‌పై క్షిపణి దాడి జరిపాయి. భారత్‌ దీటుగా బదులివ్వడంతో పాకిస్తాన్‌కు భారీ నష్టం సంభవించింది. కాశ్మీర్‌ లోయలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దాల్‌ సరస్సులో ఓ గుర్తు తెలియని వస్తువు పడిపోయింది. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ విమానాశ్రయ ప్రాంతం, జమ్మూ నగరం, బారాముల్లాలోనూ, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌లోనూ, రాజస్థాన్‌లోని బర్మర్‌లోనూ శుక్రవారం రాత్రి పేలుళ్లు సంభవించాయి.
సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలను నివారించేందుకు రెండు దేశాలు కృషి చేయాలని సూచించారు. కాగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న 60 దేశీయ విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని 32 విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 15వ తేదీ వరకూ ఈ ఎయిర్‌పోర్టులను మూసివేస్తారు. మొదటిసారిగా ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి.
మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
ఉగ్రవాద చర్యను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని భారత్‌ ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సరిహద్దులలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషీ, వైమానిక దళ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆపరేషన్‌ సిందూర్‌పై వివరాలు అందజేశారు. గత రెండు మూడు రోజులుగా పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు పెంచుతోందని మిస్రీ ఆరోపించారు. వివిధ ప్రదేశాలలో గగనతలం మీదుగా భారత్‌లో ప్రవేశించేందుకు చొరబాటుదారులు ప్రయత్నించారని కల్నల్‌ సోఫియా చెప్పారు. ఉధంపూర్‌, భుజ్‌, పఠాన్‌కోట్‌, భటిండాలోని వైమానిక స్థావరాలలో సామగ్రికి, సిబ్బందికి నష్టం కలిగించడమే వారి ఉద్దేశమని తెలిపారు. పాకిస్తాన్‌ తన దళాలను సరిహద్దుల వద్దకు తరలిస్తోందని అన్నారు. పంజాబ్‌లోని వైమానిక స్థావరంపై దాడికి కూడా పాక్‌ ప్రయత్నించిందని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ కాల్పులు : సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌
శ్రీనగర్‌: కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే జమ్మూ కాశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతున్నట్టు సమాచారం. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్టు సమాచారం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్న వేళ పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫెరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బార్మర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు.
సానుకూల పరిణామం : సీపీఐ (ఎం)
న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంపై సీపీఐ (ఎం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ కాల్పుల విరమణ వెంటనే అమలులోకి వస్తుందని భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు ప్రకటించడం సానుకూల పరిమాణం. రెండు దేశాలకు శాంతి అవసరం. రెండు దేశాలు అభివృద్ధి చెందాలన్నా, సుసంపన్నంగా ఉండాలన్నా శాంతి పరిఢవిల్లాలి. భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు ఆ దిశగా ముందుకు కదులుతాయని మేము ఆశిస్తున్నాం. తన భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -