– సుముఖంగా ఉన్న ఇరు పక్షాలు
– ట్రంప్‌తో నెతన్యాహూ భేటీ
వాషింగ్టన్ : గాజాలో కాల్పుల విరమణ దిశగా హమాస్, ఇజ్రాయిల్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ సోమవారం వాషింగ్టన్ చేరుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభించారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇజ్రాయిల్‌పై ట్రంప్ ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. 21 నెలలుగా సాగిస్తున్న ఘర్షణలకు నెతన్యాహూ స్వస్తి చెబుతారని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని ట్రంప్ గతంలోనే చెప్పారు. ఈ వారంలోనే ఓ ఒప్పందం కుదురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు కూడా. వాషింగ్టన్ బయలుదేరే ముందు నెతన్యాహూ విలేకరులతో మాట్లాడుతూ ‘ఇప్పటికే ఒప్పందంపై చర్చించాం. షరతులకు అంగీకరించాం. ఇప్పుడు ఒప్పందంపై కసరత్తు చేస్తాం’ అని తెలిపారు. ట్రంప్‌తో జరిపే సంప్రదింపులు సత్ఫలితాన్ని ఇస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. కొన్ని దేశాలతో కొత్తగా దౌత్య సంబంధాలు నెలకొల్పుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన నర్మగర్భంగా చెప్పారు. దీర్ఘకాల శత్రువైన సిరియాతో భద్రతా సంబంధమైన ఒప్పందం కుదుర్చుకోవాలని ఇజ్రాయిల్ భావిస్తోంది.
ట్రంప్, నెతన్యాహూ మధ్య సంప్రదింపులు ముగిసిన తర్వాత కాల్పుల విరమణపై ప్రకటన చేయవచ్చునని తెలుస్తోంది. గత నెలలో ఇరాన్ అణు స్థావరాలపై ఇరు దేశాలు దాడి చేసిన తర్వాత అమెరికాలో నెతన్యాహూ తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఇదిలావుండగా 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని, బందీలను విడుదల చేయాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఖతార్‌లో ఆదివారం సాయంత్రం తిరిగి పరోక్ష చర్చలు మొదలయ్యాయి. అయితే కీలక అంశాలపై నెలకొన్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకొని ఇరు పక్షాలు ఒప్పందం కుదుర్చుకుంటాయా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయితే గాజాపై జరుగుతున్న చర్చలు సానుకూలంగానే ఉన్నాయని ఇజ్రాయిల్ అధికారి ఒకరు తెలిపారు. ఖతార్ సమావేశంలో మానవతా సాయంపై కూడా చర్చ జరిగింది ఆని ఆయన చెప్పారు. యుద్ధానికి స్వస్తి చెప్పేందుకు ఇరు పక్షాలు సుముఖంగానే ఉన్నాయి. తన వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేస్తానని, అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ ఘర్షణలను పూర్తిగా ఆపేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. అయితే హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను విడిచిపెట్టే వరకూ పోరాటం కొనసాగిస్తానని ఇజ్రాయిల్ చెబుతోంది. నెతన్యాహూ సంకీర్ణ భాగస్వాములు కొందరు పోరాటాన్ని ఆపవద్దని పట్టుబడుతున్నారు. అయితే 21 నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా అలసిపోయిన ఇజ్రాయిల్ కాల్పుల విరమణకే మొగ్గు చూపుతోంది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమ ణ ఒప్పందం ప్రకారం హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఎనిమిది మందిని విడుదల చేస్తుంది. కాల్పుల విరమణ మొదలవగానే బందీల విడుదల జరుగుతుంది. కాల్పుల విరమణ 50వ రోజుకు చేరినప్పుడు మరో ఇద్దరు బందీలు విడుదలవుతారు. అటు ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.