– ఆన్‌లైన్ హాజరుపై అనేక అభ్యంతరాలు
– కూలీల హాజరుపై రోజూ తనిఖీ చేయాలని రాష్ట్రాలకు లేఖ
– ఫీల్డ్ అసిస్టెంటు నుంచి ఉన్నతాధికారుల వరకూ పర్యవేక్షించాల్సిందే
– పనిప్రదేశం నుంచే ఆన్‌లైన్ హాజరు నమోదు చేయాలని ఆదేశం
– నెట్ సిగల్స్ సరిగా రాక, యాప్ పనిచేయక ఇక్కట్లు
– హాజరు కోసం గంటల తరబడి కూలీల ఎదురుచూపులు
– మరింత మందిని ‘ఉపాధి’కి దూరం చేసేలా కేంద్రం ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, సామాజిక అంతరాలను తగ్గించేందుకు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ దాడి చేస్తూ వస్తున్నది. ఓ పక్క నిధులు పెంచాలనే డిమాండ్ వస్తుంటే మోడీ సర్కారు మాత్రం కేంద్ర బడ్జెట్‌లో ఏటేటా తగ్గిస్తూ పోతున్నది. చట్టం అమలు విషయంలో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. మొదటి అర్ధ వార్షికంలో రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో 60 శాతం మించి ఖర్చుపెట్టొద్దని ఇటీవలే కొర్రీలు పెట్టి కూర్చున్నది. తాజాగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్) అమలు సరిగా జరగట్లేదనీ, ఇక రోజువారీ తనిఖీలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లోని పని ప్రదేశాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ సరిగా అందుబాటులోలేక ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్ సరిగా పనిచేయట్లేదనే విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విషయంలో అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు ఇతోధికంగా దోహదపడాలనే ఉద్దేశంతో తెచ్చిన ఈ చట్టాన్ని ఇప్పుడు వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని కేంద్రం రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తున్న విషయమూ విదితమే. నిధులలేమితో తండ్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చెప్పిన విషయాలను చచ్చినట్టు అమలు చేస్తున్నాయి. ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్ అమలు విషయంలో కేంద్రం చెప్పినట్టు నడుచుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఇటీవల లేఖలు కూడా రాశారు.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు
కేంద్రం చెబుతున్నది క్షేత్రస్థాయిలో పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నెట్ సౌకర్యం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం ఫోన్లు కూడా కలవని పరిస్థితి. ఇప్పటికే ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్ అమలులో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకూ ఆన్‌లైన్ మస్టర్ యాప్‌పై కింది స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వలేదు. డేటా రీచార్జిని ఫీల్డు అసిస్టెంట్లు సొంత ఖర్చులతో చేయించుకుంటున్న పరిస్థితి. పనిప్రదేశంలో నెట్‌సరిగా రాక సిగల్ వచ్చే ప్రాంతాలకెళ్లి ఫీల్డు అసిస్టెంట్లు ఫొటోలు తీస్తున్న పరిస్థితి. దీంతో కూలీలు హాజరు కోసం గంటల తరబడి నిల్చోవలసిన దుస్థితి. ఒక కూలి నిమిషం సమయం తీసుకున్నా…అక్కడ పనిచేసే 200 కూలీల ఫొటోలు అప్‌లోడ్ చేయాలంటే కనీసం మూడు గంటల పడుతుంది. మళ్లీ మధ్యాహ్నం పనిప్రదేశం నుంచి ఫొటోలతో మళ్లీ హాజరు నమోదు చేయడం తలకుమించిన భారంగా మారుతున్నదనీ, ఫోన్లలో చార్జింగ్ అయిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని ఫీల్డు అసిస్టెంట్లు వాపోతున్నారు. గతంలో ఫీల్డు అసిస్టెంట్లు మాత్రమే కాకుండా 20 నుంచి 30 మంది కూలీలకు గుంపు పెద్దగా ఒక మేట్ ఉండేవారు. ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్ తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యవస్థకు చరమగీతం పాడారు. ఆన్‌లైన్ హాజరు విషయంలో కూలీలు కూడా ఒకింత అసహనానికి గురవుతున్నారు. రోజంతా పనిచేసినా రూ.100 నుంచి రూ.200 లోపు మాత్రమే దక్కటం, ఫొటోల అప్‌లోడ్ విషయంలో గంటల తరబడి వేచిఉండటం, ఆధార్, జాబ్ కార్డులతో బ్యాంకు పాస్‌బుక్కులతో లింకు చేసిన తర్వాత వేతనాల చెల్లింపులో అనేక ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల ఆ పని పట్ల కూలీలకు ఆసక్తి తగ్గుతున్నది. కాదుకాదు…పొమ్మనలేక పొగబెట్టినట్టు కేంద్రమే ఉపాధి కూలీలను పని నుంచి తప్పుకునేలా చేస్తున్నది. గ్రామీణ పేదలుగా ఉన్న దళితులు, గిరిజనులు, బడుగుబలహీన వర్గాల వారికి వంద రోజుల పనిని కల్పించాలనే బాధ్యత నుంచి కేంద్రంలోని మోడీ సర్కారు తప్పుకుంటున్నది.
యాప్ దుర్వినియోగమైతే చర్యలంటూ హుకూం
ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్ దుర్వినియోగం చేసినా, అవతవకలకు పాల్పడినా అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపాలని స్పష్టం చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ పర్యవేక్షణా విభాగాలు ఏర్పాటు చేసి దానికి ఐటీ మేనేజర్‌ను, ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. యాప్ పనిచేస్తుందా? లేదా? నెట్ సిగల్ ఉందా? లేదా? అనే దాన్ని ఫీల్డు అసిస్టెంట్లు ముందే చూసుకోవాలనీ, ఒకసారి గ్రామపంచాయతీ లాగిన్ నుంచి ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు ఉండదని స్పష్టం చేసింది.
డాక్యుమెంటేషన్ కోసం జిల్లా స్థాయిలో హార్డు డిస్కులను అందుబాటులో ఉంచుకోవాలి. ఎన్‌ఆర్‌ఈజీఎస్ యాప్‌లో 15 రోజుల తర్వాత ఫొటోలు అందుబాటులో లేకుంటే హార్డు డిస్కులను జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. హార్డ్ డిస్కుల సాక్ష్యాలు కనీసం ఏడాది పాటుగానీ, సోషల్ ఆడిట్ అయ్యేవరకుగానీ అందుబాటులో ఉండాలని సూచించింది. ఉదయమే కాకుండా మధ్యాహ్న సమయంలోనూ కూలీల ఫొటోల అప్‌లోడ్ తప్పనిసరి అనీ, ఒక పూటనే ఫొటో అప్‌డేట్ చేస్తే సగం వేతనమే దక్కుతుందని స్పష్టం చేసింది. ఫొటో అప్‌డేట్ కాకపోతే కూలీలకు వేతనం దక్కదు. తర్వాత రోజు అటెండెన్స్ వేసుకునే అవకాశం లేదని తెలిపింది. కానీ, దీని నిర్వహణ కోసం నిధుల కేటాయింపు ప్రస్తావనే లేదు.
రోజూ తనిఖీలు తప్పనిసరి
క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీంతో చట్టం అమలులో పారదర్శకత లోపిస్తున్నది. పారదర్శకత, జవాబుదారీ తనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. గ్రామస్థాయిలో 100 శాతం కూలీలకు సంబంధించి అప్‌లోడ్ చేసిన ఫొటోలను ఫీల్డు అసిస్టెంట్లు వంద శాతం తనిఖీ చేయాలనే నిబంధన పెట్టింది. మండల స్థాయిలో 200 ఫొటోలు లేదా అప్‌లోడ్ చేసిన ఫొటోల్లో 20 శాతం ఖచ్చితంగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్(డీపీసీ) కనీసం 30 ఫొటోలు, సిబ్బంది వంద ఫొటోలుగానీ, పది శాతంగానీ తనిఖీ చేయాలని ఆదేశించింది. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కనీసం 20 ఫొటోలు, ఆ శాఖ సిబ్బంది కనీసం వంద ఫొటోలుగానీ, ఐదు శాతం ఫొటోలుగానీ తనిఖీ చేయాలని సూచించింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరాలివీ..
– సంబంధం లేని ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు.
– పనిప్రదేశం నుంచి ఫొటోలు పెట్టకుండా వేరే దగ్గర నుంచి యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు.
– పనికి వచ్చిన వారి సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి.
– గ్రూపు, విడివిడి ఫొటోలతో పురుషులు, స్త్రీల సంఖ్య సరిపోలటం లేదు.
– ఒకే వర్కర్ ఫొటో చాలా మస్టర్ రోల్స్‌లో కనిపిస్తున్న పరిస్థితి.
– ఒక కూలి ఉదయం పనిప్రదేశంలో ఫొటో దిగుతున్నారు గానీ మధ్యాహ్నం దిగట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఒక ఫొటో అప్‌లోడ్ చేసి మధ్యాహ్నం మరొకరి ఫొటోను యాప్‌లో నమోదు చేస్తున్నారు.