Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయంజేఎన్‌యూ విద్యార్థులపై కేంద్రం కక్షసాధింపు

జేఎన్‌యూ విద్యార్థులపై కేంద్రం కక్షసాధింపు

- Advertisement -

తీహార్‌ జైలుకు
14 మంది విద్యార్థి సంఘ నేతలు
బెయిల్‌ మంజూరు చేసిన పాటియాలా హౌస్‌ కోర్టు
విడుదల చేయని జైలు అధికారులు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జవహర్లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేతలపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. కుల వివక్షను తొలగించడానికి యూజీసీ నిబంధనలను అమలు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడిన జెఎన్‌యు విద్యార్థి సంఘ నేతలను కేంద్ర ప్రభుత్వం తీహార్‌ జైల్లో పెట్టింది. ఢిల్లీ పోలీసులు గురువారం రాత్రి 14 మంది జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలపై కేసులు నమోదు చేసి, జైలుకు తరలించారు. ప్రభుత్వ అధికారి విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, శారీరకంగా దాడి చేశారని విద్యార్థులపై అభియోగాలు మోపారు. పాటియాలా హౌస్‌ కోర్టు విద్యార్థి సంఘ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు అధికారులు వారిని విడుదల చేయలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థి సంఘం ఆఫీస్‌ బేరర్లు అదితి మిశ్రా (అధ్యక్షురాలు), కె.గోపికా బాబు (వైస్‌ ప్రెసిడెంట్‌), డానిష్‌ అలీ (జాయింట్‌ సెక్రెటరీ) సహా 14 మంది విద్యార్థి నేతలను జైలులో పెట్టారు. అరెస్టయిన వారిలో యూనియన్‌ మాజీ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు శ్యామ్‌ శశి, వర్కే పరక్కల్‌ తదితరులు ఉన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వరకూ మార్చ్‌ నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడంతోపాటు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు శుక్రవారం పాటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు అధికారులు విద్యార్థి సంఘ నేతలను విడుదల చేయలేదు.

విద్యార్థుల ఆందోళనతో 37 మంది విడుదల
గురువారం ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సహా కేంద్ర దళాలు 51 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నాయి. నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో, శుక్రవారం ఉదయం పోలీసులు నిర్బంధంలో ఉన్న 37 మంది విద్యార్థులను విడుదల చేశారు. నిరసన తెలిపినందుకు బహిష్కరించిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆఫీస్‌ బేరర్లను తిరిగి నియమించాలని డిమాండ్‌ చేస్తూ క్యాంపస్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి.

వీసీని తొలగించాలని రాష్ట్రపతికి ఎస్‌ఎఫ్‌ఐ వినతి
జేఎన్‌యూ వీసీ శాంతిశ్రీ దులిపూడి పండిట్‌ను పదవి నుంచి తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్‌ ఎం సాజి, శ్రీజన్‌ భట్టాచార్య వినతిపత్రం సమర్పించారు. విసి దళితులకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది. శాంతిశ్రీ విసిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, క్యాంపస్‌లో ప్రజాస్వామ్య హక్కులు బలహీనపడ్డాయని, విద్యా వాతావరణం క్షీణిస్తోౖందని పేర్కొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని, విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న రిజర్వ్‌ పోస్టులకు పారదర్శక నియామకాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -