కఠిన నాణ్యతా నియంత్రణలతో తీవ్ర ప్రభావం
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోడీ సర్కారు
నీతి ఆయోగ్ సిఫారసులు
69 క్యూసీఓల ఉపసంహరణ
న్యూఢిల్లీ : దేశీయ తయారీ ప్రమాణాల పేరిట కేంద్రం సృష్టించిన క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీఓ)ల కఠిన వ్యవస్థ.. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈలు) తీవ్రంగా దెబ్బ తీసింది. 2016 నుంచి వీటి అమలును తీవ్రం చేసిన మోడీ సర్కారు.. క్యూసీఓల సంఖ్యను 70 నుంచి 790కి పెంచింది. ఎంఎస్‌ఎంఈలు ఎంతగానో నష్టపోయినా మోడీ సర్కారు మాత్రం ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ఇప్పుడు అమెరికా ఒత్తిడి, నిపుణుల సూచనలు, నీతి ఆయోగ్ సిఫారసుల నేపథ్యంలో మోడీ సర్కారు దిగివచ్చింది. 69 క్యూసీఓలను వెనక్కి తీసుకున్నది.
ఏమిటీ క్యూసీఓ?
క్యూసీఓ అంటే క్యాలిటీ కంట్రోల్ ఆర్డర్. ఇది ప్రభుత్వం జారీ చేసే ఒక అధికారిక ఆదేశం. ఇది ఏదైనా ఉత్పత్తి నాణ్యతకు సంబంధించి ప్రభుత్వం నిర్బంధ ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఆ ప్రమాణాలను పాటించని ఉత్పత్తులను తయారు చేయడం, దిగుమతి చేయడం, అమ్మడం నిషేధిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణం (బీఐఎస్ మార్క్) లేకుంటే ఆ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావడానికి అనుమతి ఉండదు. నాణ్యతలేని, ప్రమాదకర ఉత్పత్తులను అడ్డుకోవడం, దేశంలో తయారయ్యే వస్తువుల నాణ్యతను పెంచడానికి, దిగుమతులపై నియంత్రణ పెట్టడం కోసం దీనిని తీసుకొచ్చారు.
అతి నియంత్రణలు
2016 తర్వాత కేంద్రం క్యూసీఓలను విపరీతంగా పెంచింది. దీంతో క్యూసీఓల సంఖ్య 70 నుంచి ఇప్పుడు 790కు చేరుకున్నది. ఇది ఎంఎస్‌ఎంఈలను తీవ్ర షాక్‌కు గురి చేసింది. వీటిని ఎక్కువగా తుది ఉత్పత్తులపై కాకుండా ముడిసరుకులు, పరికరాలపై అమలు చేయడంతో ఈ చిన్న పరిశ్రమలకు చాలా నష్టం వాటిల్లింది. తాము ఎంతగా వ్యతిరేకిస్తున్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు తమ ఇబ్బందులను పట్టించుకోలేదని ఎంఎస్‌ఎంఈ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ”క్యూసీఓల కారణంగా దిగుమతి ముడిసరుకులు దొరకడం కష్టంగా మారాయి. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో చిన్న పరిశ్రమలు మార్కెట్లో నిలదొక్కుకోలేని పరిస్థితి. క్యూసీఓలతో పడే ఖర్చుల భారాన్ని పెద్ద కంపెనీలు మాత్రమే తట్టుకోగలవు. కాబట్టి ప్రభుత్వం.. నాణ్యత పేరిట పెద్ద కంపెనీలకు మేలు చేసి, చిన్న కంపెనీలను పక్కనబెట్టింది” అని వివరిస్తున్నాయి.
మరో లైసెన్స్‌రాజ్?
క్యూసీఓ అనుమతులు కూడా క్లిష్టంగా మారాయి. ఇందుకోసం పేపర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. బీఐఎస్ సర్టిఫికేషన్‌లో నెలల తరబడి ఆలస్యం ఉంటుంది. విదేశాల్లో బీఐఎస్ తనిఖీలకు భారీ ఖర్చు ఉంటుంది. లైసెన్స్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం ఏర్పడుతుంది. దీంతో పాత లైసెన్స్ రాజ్ తిరిగి వచ్చినట్టయ్యిందని చిన్న కంపెనీలు చెప్తున్నాయి.
మెరుగుపడని ఎగుమతులు.. పడిపోయిన దిగుమతులు
ఢిల్లీ కేంద్రంగా పని చేసే స్వతంత్ర పరిశోధనా సంస్థ (థింక్ ట్యాంక్) సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ (సీఎస్‌ఈపీ) డేటా ప్రకారం.. క్యూసీఓల మొదటి ఏడాదిలో ఇంటర్మీడియెట్ ఇంపోర్ట్స్ (మధ్యస్థ ముడి దిగుమతులు) 16 శాతం పడపోయాయి. రెండో ఏడాది ఇది 17.5 శాతం పడిపోయాయి. ఈ తగ్గుదల దీర్ఘకాలంలో 30 శాతంగా ఉంటుంది. ఇక ఎగుమతులు మొదటి ఏడాది కొద్దిగా పెరిగినా.. రెండో ఏడాది 12.8 శాతం పడిపోయాయి. అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా ఎగుమతులు పెరుగుతాయన్న మాట కార్యరూపందాల్చలేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
ఎంఎస్‌ఎంఈలపై ప్రేమతో కాదు.. అమెరికా ఒత్తిడికి తలొగ్గి..
ప్రస్తుతం కేంద్రం రసాయనాలు, పాలిమర్ రంగంలో 14 క్యూసీఓలు, స్టీల్ సెక్టార్‌లో 55 క్యూసీఓలు కలుపుకొని మొత్తం 69 క్యూసీఓలను ఉపసంహరించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంఎస్‌ఎంఈల మీద ప్రేమతో కాదనీ, అమెరికా ట్రేడ్ ఒత్తిడిని తప్పించుకోవడం కోసమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే. భారత్ కొన్ని ఉత్పత్తులపై క్యూసీఓలు విధిస్తే అమెరికా కంపెనీలకు తీవ్ర కష్టం, నష్టం ఏర్పడుతాయి.
అందుకోసమే అమెరికా ప్రభుత్వం క్యూసీఓలను ఉపసంహరించాలని భారత్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని వివరిస్తున్నాయి. ఇక భారత్‌లో ఉన్న నియంత్రణలు ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వివరించింది. యూఎస్, ఈయూ, జపాన్‌లలో ఫ్యాక్టరీ-లెవెల్ సర్టిఫికేషన్ లేదని పేర్కొన్నది. భారత్‌లో మాత్రం ముడి సరుకులకే కఠిన క్యూసీఓలు ఉన్నాయని వివరించింది.
కేంద్రం తప్పుడు నిర్ణయానికి బాధ్యులెవరు?
ప్రభుత్వం నాణ్యత పేరిట గత కొన్నేండ్లుగా అమలు చేసిన క్యూసీఓలు ఎంఎస్‌ఎంఈలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. పోటీ సామర్థ్యం తగ్గిపోయింది. ఖర్చుల భారం పెరిగింది. ఎగుమతుల లాభం కనబడలేదు. ఇప్పుడు అమెరికా ఒత్తిడి, నిపుణుల హెచ్చరికలు, నిటి ఆయోగ్ సిఫారసుల నేపథ్యంలో మోడీ సర్కారు ఇప్పుడు వెనక్కి తగ్గింది. అయితే దేశంలోని ఎంఎస్‌ఎంఈలను నష్టపర్చిన ఈ తప్పుడు విధానానికి ఎవరు బాధ్యత వహిస్తారని పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం దెబ్బ
- Advertisement -
- Advertisement -



